
తోడూ.. నీడ నీవే 'నాన్న'
పిల్లల భవిష్యత్తు కోసం తపించే 'నాన్న'
ఆప్యాయత పంచులూ మార్గదర్శిగా నిలుస్తూ..
అనంతపురం కల్చరల్: లాలించి.. లాలపోసి.. అడుగులేయించి.. అక్షరాలు పలికించి అన్నీ తానై తోడూ నీడగా ఉండే 'నాన్న'కు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానముంటుంది. అనురాగానికీ, ఆప్యాయతలకు ప్రతీక మాత్రమే కాదు. మార్గదర్శిగా ఉంటూ పిల్లల బంగారు భవితకు బాటలు వేయడానికి నిరంతరం తపన పడుతుంటాడు. నాన్నతో గడిపిన క్షణాలు ప్రతి వ్యక్తి జీవితంలో మరచిపోలేని మధురానుభూతులు. పెళ్లయి అత్తారింటికి వెళ్లినా ఆడపిల్లకు తండ్రి లాలన పట్లే మక్కువ. ఉద్యోగాలొచ్చి ఎక్కడెక్కడో స్థిరపడే మగపిల్లలను సైతం తండ్రి నేర్పిన క్రమశిక్షణే ముందుకు నడిపిస్తుంది. బిడ్డలను ప్రయోజకులను చేయడంలో తల్లికి ఎంత పాత్ర ఉంటుందో.. తండ్రికీ అంతే ఉటుంది. అందుకే చరిత్ర పుటల్లో 'నాన్న' కోసం ప్రత్యేక రోజును కేటాయించారు. నేడు (ఆదివారం) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
ఆసక్తికరమైన నేపథ్యం
పిల్లలు ఎదుగుతుంటే మౌనంగా ఆనందించే తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఏర్పడిన 'ఫాదర్స్' డే వెనుక ఆసక్తికర నేపథ్యముంది. 1890లో అమెరికాలోని ఆర్కాన్సాస్లో చర్చికి సోనారా అనే అమ్మాయి వెళ్లింది. అక్కడ మదర్స్ డే జరుగుతోంది. అది చూసిన సోనారా.. కుటుంబ అభ్యున్నతికి పాటుపడే నాన్నకూ ఇలాంటి గౌరవం దక్కాలని మత పెద్దలను కోరింది. ఆమె న్యాయమైన కోరిక వాళ్లను కదిలించింది. అంతే.. ఆ అమ్మాయి తండ్రి జాక్సన్ పుట్టిన రోజును ఫాదర్స్ డేగా నిర్వహించాలని నిశ్చయించారు. అది మూడో ఆదివారం కావడంతో అప్పటి నుంచి జూన్ లో వచ్చే ఇదే రోజున ప్రపంచ వ్యాప్తంగా 'ఫాదర్స్ డే' నిర్వహిస్తున్నారు. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఫాదర్స్ డేను ఆ దేశ జాతీయ పండుగగా ప్రకటించారు. తర్వాత అది ప్రపంచ వ్యాప్తమైంది.
నాన్నే ఫ్రెండయ్యారు!
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడిచే రోజుల్లో తండ్రి అంటే అత్యంత భయభక్తులుండేవి. ఎదిరించి మాట్లాడటం కాదు కదా.. కావాల్సింది అడగడానికీ జంకేవారు. ఏది కావాలన్నా తల్లిని మాత్రమే అడిగేవారు. అయితే.. కాల చక్రంలో అనేక మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలు చెదిరిపోయాయి. చిన్న కుటుంబాల్లో తండ్రి స్నేహితుడిగా మారిపోయాడు. పిల్లలకు మార్గదర్శిగా ఉంటూనే స్నేహితుడిలా నడిపిస్తున్నాడు. నాన్నంటే ఓ నీడ.. వెన్నంటి ఉండే ఓ గోడ అన్న భావాన్ని ఈ తరం పిల్లలు వ్యక్తం చేస్తున్నారు.