ఈ ఆర్థికంలో అద్భుతాలు సాధ్యమా? | Shekar Gupta Special Article On Indian economy | Sakshi
Sakshi News home page

ఈ ఆర్థికంలో అద్భుతాలు సాధ్యమా?

Published Sat, Sep 21 2019 1:21 AM | Last Updated on Sat, Sep 21 2019 1:21 AM

Shekar Gupta Special Article On Indian economy - Sakshi

భారత ఆర్థిక వ్యవస్థ అనే ఏనుగు మరణం గురించిన వార్తలు మరీ అతిశయించిన రూపంలో ఉంటున్నాయి. కానీ అది చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతోందన్నది నిజం. జాతీయవాదం మరీ పాతుకుపోతున్నప్పుడు, వెనుకంజ కూడా జాతిని ఐక్యం చేసే అంశంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీకి లభిస్తున్న ప్రజాదరణ స్పష్టం చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద సవాలు అయిన ఆర్థిక మందగమనాన్ని తోసిపుచ్చి మోదీ అసాధారణంగా పేరు ప్రఖ్యాతులు పొందుతుండవచ్చు లేదా ఏదైనా అద్భుతాన్ని సృష్టించి దాన్ని మరింతగా మెరుగుపర్చవచ్చు కూడా.  మోదీ ఆర్థిక వ్యవస్థ బాధ్యతలను నేరుగా చలాయించగలిగితే 2014 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చడం అసాధ్యం కాదు. నా ఈ మాటలు నిజం కావాలని నేను నిజాయితీగా కోరుకుంటున్నాను.

అనేక సంవత్సరాలుగా నేను వార్తలను కవర్‌ చేస్తూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ వచ్చాను. హేతుబద్ధంగా ఉండే ప్రజాస్వామ్య దేశాల్లో లాగా తమ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడ్డానికి సుముఖత చూపని ప్రజలను కూడా కలిశాను. అది నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. కష్టకాలాల్లో హాస్యం, వ్యంగ్యం వికసిస్తూ ఉంటాయి. అయితే అనుమానం, భయం చోటుచేసుకున్నప్పుడు సృజనాత్మకతకు చెందిన రసావిష్కరణ పరవళ్లు తొక్కుతుంటుంది. గతంలో సోవియట్‌ పాలనపై వచ్చిన అత్యుత్తమ జోక్‌లు మాస్కోలోని వీధుల్లో, షాపుల్లో వినపడేవట. కానీ గుసగుసల రూపంలో మాత్రమే అని అదనంగా జోడిం చాలి. నిన్నటి గుసగుసలు నేటి వాట్సాప్‌ ఫార్వర్డ్‌లుగా మారుతున్న కాలమిది. వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న జోకులను ముందుగా ఎవరు కనిపెట్టారో తెలీదు కనుక, పేరు లేకుండా వాట్సాప్‌లో జోకులు పేల్చడం సురక్షితమైనది. ఈ సీజన్‌లో బాగా వ్యాప్తిలో ఉన్న అంశం భారతీయ ఆర్థిక వ్యవస్థ. తాజాగా 1.45 లక్షల కోట్ల పన్ను రాయితీతో కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యకు ప్రాధాన్యం లేదు. 

ప్రతిరోజూ నా ఇన్‌బాక్స్‌లో మోదీ ప్రభుత్వ ఉపద్రవపూరితమైన ఆర్థిక వ్యవస్థ గురించి అనేక జోకులు, మెమ్‌లు వచ్చి చేరుతుం టాయి. వీటిలో మహారాజు, ఆయన ప్రేమించే ఏనుగు గురించిన జోకులు ఎక్కువగా వ్యాప్తిలో ఉంటాయి. దురదష్టవశాత్తూ ఒకరోజు దానికి ప్రాణాంతక జబ్బు వచ్చింది. గుండె పగిలిన మహారాజు తన ఏనుగు చనిపోయింది అన్న వార్తను తన వద్దకు మొదటగా మోసుకొచ్చే వాడి తల నరికిస్తానని హుంకరించాడు. ఒక రోజు అనివార్యమైనదే సంభవించింది. కానీ మహారాజు చెవిన ఆ విషయం చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. చివరకు మావటీవాడు కాస్త ధైర్యం తెచ్చుకుని వణుకుతూ, ‘మహారాజు ఏనుగు ఏమీ ఆరగించలేదని, లేవడం లేదని, శ్వాస పీల్చడం లేదని, స్పందించడం లేద’ని చెప్పాడు. ‘అంటే నా ఏనుగు చనిపోయిందని చెబుతున్నావా’ అని మహారాజు ప్రశ్నించాడు. ‘ఆ విషయం మీరే చెప్పారు మహారాజా’ అని మావటి గజగజ వణుకుతూ చెప్పాడు.

ఈ కథలోని ఏనుగువంటిదే ప్రస్తుత మన ఆర్థిక వ్యవస్థ. మన ఏనుగు బహుశా చచ్చిపోయి ఉంటుందని కేంద్ర ప్రభుత్వంలోని అనేకమంది మంత్రులు వివిధ మార్గాల్లో ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఏనుగు చచ్చిపోయింది అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించడానికి ఎవరూ పూనుకోవడం లేదు. మార్క్‌ ట్వైన్‌ మాటల్ని అరువు తెచ్చుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థ మరణం గురించిన వార్తలు మరీ అతిశయించిన రూపంలో ఉంటున్నాయి. కానీ అది చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతోందన్నది నిజం. గత జూన్‌ నుంచి మదుపుదారులకు చెందిన రూ.11 లక్షల కోట్ల మదుపులు ఆవిరైపోయాయి.

ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రభుత్వ స్పందన మూడు రకాలుగా ఉంటోంది. ఒకటి, మోదీని ద్వేషించేవారు చేస్తున్న తప్పుడు ప్రచారమే దీనికి కారణం. రెండు, ఆర్థిక మంత్రి తాజా ప్రకటన మరింత విశిష్టమైంది. సరైన గేమ్‌ ప్లాన్‌ లేకుండా భారీగా కార్పొరేట్‌ పన్నురాయితీ కల్పించడం. హౌస్టన్‌ వీకెండ్‌లో ఇది పతాశ శీర్షిక అయింది. మార్కెట్లు కొన్నిరోజులపాటు పండగ చేసుకుంటాయి. కానీ ఈ రాయితీని చెల్లించడం కోసం ప్రభుత్వం తన సొంత ఖర్చులను కుదించుకోవడానికి తగిన సాహసం ప్రదర్శించకపోతే ఇది మరింత కరెన్సీని ముద్రించడం ద్వారా మార్కెట్లకు అందించడానికి లేక పేదలపై పరోక్ష పన్ను విధించడానికి మార్గం సుగమం చేసుకుంటుంది. 

ఇక మూడవదీ చాలా ముఖ్యమైనదీ ఏమిటంటే ఇవి మోదీ రెండో దఫా హయాంలో ప్రారంభ దినాలు మాత్రమే. రెండో దఫా పాలనలో 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కొన్నింటిని మోదీ పరిష్కరించారు. ట్రిపుల్‌ తలాక్‌తోపాటు ఏకీకృత సివిల్‌ కోడ్‌ వైపు తొలి అడుగు వేశారు. తర్వాత ఆర్టికల్‌ 370 రద్దు. ఇలాగే మరికొన్ని. బహుశా నవంబర్‌ మొదట్లోనే రామమందిరం నిర్మాణం ప్రారంభం కావచ్చు. తర్వాత అత్యంత కష్టమైనది, అత్యవసరమైనది వేచి చూస్తోంది. మోదీ ఆర్థిక వ్యవస్థ బాధ్యతలను నేరుగా చలాయించవచ్చు. తాను అలా చేయగలిగితే 2014 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చడం కూడా అసాధ్యం కాదు. నా ఈ మాటలు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను.  

మరొక దృక్పథం ఏమిటంటే, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు సమీపకాలంలో మెరుగుపడవన్నదే. అయితే 2018 మే నెలలో జాతిహితంలో నేను చెప్పినట్లుగానే తనకున్న భారీ ప్రజాదరణమీద మోదీ స్వారీ చేస్తుంటారు. ఆయన ఓటర్లు మాత్రం మోదీకోసం త్యాగాలు చేస్తుంటారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ గత నెల మాతో చేసిన సంభాషణలో అద్భుతరీతిలో దీన్ని వివరించారు. జాతీయవాదం పెచ్చరిల్లుతున్నప్పుడు ప్రజలు ఆర్థికరపరమైన త్యాగాలను ఆమోదిస్తారు అని అన్నారాయన. జాతీయవాదం మరీ పాతుకుపోతున్నప్పుడు, వెనుకంజ కూడా జాతిని ఐక్యం చేసే అంశంగా ఉంటుందని ఖట్టర్‌ విడమర్చిచెప్పారు. దీనికి సులభమైన ఉదాహరణ ఉంది కూడా. చంద్రయాన్‌ 2 హృదయాల్ని బద్దలు చేస్తూ విఫలమైన క్షణాల్లో కూడా యావద్దేశం ఆ రోజు రాత్రి 2 గంటలవరకు చంద్రయాన్‌–విక్రమ్‌ ల్యాండింగ్‌ను చూడటానికి మేల్కొని చూస్తూ ఉండటమే. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పుడు కూడా మోదీ ప్రజాదరణ ఆకాశాన్నంటుతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలోని హౌస్టన్‌లో ఆదివారం రాత్రి జరగనున్న ‘హౌడీ, మోదీ’ (ఎలా ఉన్నారు మోదీ) కార్యక్రమం కోసం జనం మానసిక స్థితిని గమనించండి చాలు. 

నరేంద్ర మోదీ ఉత్థానం సాంప్రదాయిక రాజకీయ విశ్లేషణలను పటాపంచలు చేసింది. పెద్దనోట్ల రద్దు దారుణ వైఫల్యాన్ని చవి చూస్తూ కూడా భారత్‌ తనను క్షమించేసింది. నిరుద్యోగం పరాకాష్టకు చేరుకుంది కానీ ఓటింగ్‌ పరంగా అది మోదీని దెబ్బతీయలేదు. ఎన్నికల సమయంలో నేను దేశ పర్యటనలో ఉన్నప్పుడు ఎంతోమంది సామాన్యులు, పేదలు పెద్దనోట్ల రద్దు వల్ల తామెంతగానో దెబ్బతిన్నామని కానీ దేశం కోసం మనం కొంతమేరకు వ్యక్తిగత త్యాగాలు చేయవలసి ఉంటుందని నేరుగా చెబుతుంటే దిగ్భ్రాంతి చెందాను. మోదీ పట్ల సామాన్యులు ఇదే అభిమానాన్ని కొనసాగించడం అసాధ్యం కాదు. ఇప్పటికే విజయవంతమైన ఎల్‌పీజీ, టాయిలెట్లు, గ్రామీణ గృహకల్పన, ముద్రా లోన్లు వంటి పథకాలతో పాటు ఇంటింటికీ కుళాయిల ద్వారా నీళ్లు, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కొత్త, స్మార్ట్‌ పథకాలను ప్రభుత్వం పతాక శీర్షికల్లో అద్బుతంగా ప్రచురింపజేస్తున్నంత కాలం మోదీకి జరిగే నష్టమేమీ ఉండదు.

తన మొదటి విడత పాలనలో అభివృద్ధితో సంబంధం లేకుండా ఈ పథకాలన్నింటికీ ఆయన నిధులు అందించగలిగారు. ఎక్సయిజ్‌ పన్ను పెంపు ద్వారా లభించిన సుమారు రూ.11 లక్షల కోట్లతో ఇది సాధ్యమైంది. అభివృద్ధి లేకుండా అదనపు సంపదను సృష్టించడం ఇప్పుడు సాధ్యం కాదు. ఒకవేళ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగితే ఈ రాజకీయ ఆర్థిక వ్యవస్థ నాశనం కాక తప్పదు. గతంలో విశేష జనాదరణ పొందిన నేత ఇందిరా గాంధీ. 1972 మొదట్లో బంగ్లాదేశ్‌ ఏర్పడిన తరువాత ఆమె ఓ వెలుగు వెలిగారు. ఆమె తప్పేమీ చేయలేదు. ఆమె తన కఠినమైన, వినాశకరమైన పద్ధతిలో వరుసగా ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారు. అదే పద్ధతిలో నిర్మాలా సీతారామన్‌ పన్ను 42.7 శాతానికి పెంచేశారు. దీంతో ఎంతో కొంత ఆదాయం వస్తుందని అందరికీ తెలుసు. కానీ పన్నుల రాబడి పడిపోయింది. ధనవంతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పేదలు ఆనందపడ్డారు. అప్పట్లో ఇందిర లాభపడినట్టే మనమూ లాభపడుతున్నాం.

అదే ఇందిర 1969–73మధ్య ఏ తప్పూ చేయకపోయినా, 1974లో జాతీయం, జాతీయవాద చర్యలతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. సోవియట్‌ విధానాలతో స్ఫూర్తిపొందిన అనుయాయుల సలహాలతో ధాన్యం, గుడ్ల పరిశ్రమను కూడా జాతీయం చేయడం ద్వారా ఇందిర ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వెంటనే ఆమె తన తప్పును సరిదిద్దుకుంది. అదేవిధంగా మోదీ ప్రభుత్వం భయంతో రూ. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్‌ పన్నును రద్దు చేయడం తీవ్ర నష్టం కలిగిస్తుంది. బహుశా లక్షల్లో ఒకడిగా మోదీ ఈ చరిత్రను తిరగరాయొచ్చు. ఆయనకు అత్యంత సన్నిహితులైనవారు చెబుతున్నట్టుగా ఆర్థిక వ్యవస్థ పగ్గాలను చేబూని అద్భుతం చేయొచ్చు. అది జరగాలని మనం ఆశిద్దాం.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
Twitter@ShekarGupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement