Wi Fiతో జర భద్రం
ఇంటర్‌నెట్.. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఆధారపడుతున్న సాధనం. ముఖ్యంగా యువత ఎక్కువగా నెట్‌కు ఆకర్షితులవుతున్నారు. ఇంటర్‌నెట్ కనెక్షన్ లేని వారు వైఫై ఎక్కడుంటుందో చూసుకుని మరీ వాడుకుంటున్నారు. అయితే ఈ వైఫైతో ఒకరి ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను వాడుకోవడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల చేయని తప్పులకు బాధ్యులు కావాల్సి వస్తుందంటున్నారు. నెట్ సెంటర్‌లతోపాటు ఇంటర్‌నెట్ సౌకర్యం ఉన్న ప్రతీ ఒక్కరు పాస్‌వర్డ్ సిస్టమ్స్‌తోపాటు లాక్ వేసుకోవడం, వినియోగించిన తర్వాత ఆఫ్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. వైఫైతో జరిగే అనర్థాలు, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి తదితర విషయాలపై కథనం..
వైఫై అంటే..
వైఫై అంటే వైర్‌లెస్ ఫెడిలిటీ. రేడియో తరంగాలను ఉపయోగించి ఇంటర్నెట్ కనెక్షన్ పొందే ఒక వైర్‌లెస్ సాంకేతికత. ఈ వైఫై ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఒక ఇంట్లో లేదా కార్యాలయంలో ఉన్న ఇంటర్‌నెట్ కనెక్షన్‌పై ఆధారపడి సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో ఇంటర్‌నెట్ సులువుగా వాడుకోవచ్చు. ఒక హాట్‌స్పాట్ నుంచి 20 మీటర్లు(66 అడుగులు) వరకు ఇండోర్‌లో అంతకంటే ఎక్కువ దూరం వరకు అవుట్‌డోర్‌లో వాడుకోవచ్చు.
ఫైర్‌వాల్స్ డిజిబుల్ కావద్దు
ప్రతీ కంప్యూటర్, రూటర్‌లలో ఉన్న ఫైర్‌వాల్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఆధునికంగా తయారవుతున్న రూటర్‌లలో బిల్ట్ ఇన్ ఫైర్‌వాల్స్ ఉంటున్నాయి. వాటిని డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.అందుకే ఎల్లప్పుడూ ఫైర్‌వాల్స్ ఆన్‌లో ఉండేలా చూసుకుంటూ వినియోగించిన ప్రతీ సారి చెక్ చేసుకోవాలి.
ఢీఫాల్ట్‌లు వద్దే వద్దు
చాలా వరకు రూటర్‌లు డీఫాల్ట్ లాగిన్, పాస్ వర్డ్స్‌తో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనె క్షన్ వినియోగంలో వీటిని కొనసాగించకూడదు. కనెక్షన్ పొందిన వెంటనే సొంతంగా మీరే లాగిన్, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. డీఫాల్ట్ వివరాలను హ్యాక్ చేయడం చాలా తేలిక.
యాక్సిస్ పాయింట్ అందుబాటులో వద్దు
వైఫై కనెక్షన్ ఇన్ స్టాల్ చేసే సందర్భంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని యాక్సిస్ పాయింట్, రూటర్‌లు బయటివారికి అందుబాటులో లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు కిటికీలకు దూరంగా ఉండడం మేలు.
ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్ వదలద్దు
ప్రతీ వైర్‌లెస్ డివైస్‌కు ఒక ప్రత్యేకమైన మీడియా యాక్సిస్ కంట్రోల్ (ఎంఏసీ) అడ్రస్ ఉంటుంది. యాక్సిస్ పాయింట్లు, రూటర్‌లు వాటికి కనెక్ట్ అయి ఉన్న ప్రతీ డీవైస్ కు సంబంధించిన ఈ ఎంఏసీ అడ్రస్‌ను ట్రాక్ చేస్తుంటాయి. హ్యాకింగ్‌కు దూరంగా ఉండాలంటే వైఫై కనెక్షన్‌కు సంబంధించిన ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్‌ను ఎనేబుల్‌గా ఉంచుకోవాలి.
టర్న్ ఆఫ్ విషయం మరవద్దు
కొంత కాలంపాటు వైఫై కనెక్షన్ వాడని పక్షంలో నెట్‌వర్క్ అందుబాటును టర్న్ ఆఫ్ చేయడం మరవకూడదు. నెట్‌వర్క్‌ను షట్ డౌన్ చేయడం వల్ల హ్యాకింగ్ చేసుకునేందుకు ఆస్కారం ఉండదు. కనెక్షన్ బ్రేక్ చేయడానికి అవకాశం చిక్కదు.
ఆటో కనెక్ట్ అసలే వద్దు
వైఫై వినియోగంలో ఆటో కనెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దు. దీని వల్ల సమీపంలోని ఏ రూటర్ నుంచైనా కనెక్ట్ కావడం వంటి వాటితో మీకు సౌకర్యవంతంగా అనిపించినా, అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుందని మరవద్దు. ఆటోకనెక్ట్ వాడటం వల్ల మీ కంప్యూటర్, కనెక్షన్స్‌కు సెక్యూరిటీ రిస్క్‌తో పాటు ఎటాక్స్ ముప్పు ఉంటుందని గుర్తించుకోండి.