
►నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత?
►నడత మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఆ సంపద నివ్వటంలో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది.
►ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం , అసహాయులు, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు.
నిషి పక్షిలా ఆకాశంలో ఎగరగలడు, నీటి అడుగునా ఈదగలడు. భూమిని తొలిచే శక్తి ఉన్నవాడు. భూమి మీద నడవగలిగితే ఈ రోజు ప్రపంచమే స్వర్గమవుతుంది’ అన్నాడు టామి డగ్లస్ అనే కెనడా దేశపు తత్వవేత్త.ఎంత అర్థవంతమైన మాటలు! ఎంత లోతుగా ఆలోచింపచేస్తున్నాయి!! చిత్తశుద్ధితో ఆత్మశోధన చేసుకోమనటం లేదూ!!! మనిషి శక్తి సామర్థ్యాలను, మనిషికున్న పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి ఈ మాటలు.తమ ప్రవర్తనను పరిశీలించుకుని, మదింపు చేసుకుని దానిలోని మంచి చెడులను తెలుసుకుని చెడును పరిహరించుకోవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. మనిషి విస్మరిస్తున్న బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. మనిషి మనిషిగా ఉండటం చాలా కష్టమన్న ఓ కవి మాటల్ని రుజువు చేస్తున్నాయి. ఆ విషయాన్ని సుస్పష్టం చేస్తూ మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తున్నాయి.
ఇక్కడ నడవడమంటే మనిషి నడుచుకునే తీరు అని అర్ధం. అంటే ప్రవర్తన. దీనిలో అనేక అంశాలు... మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి, నలుగురిలో మసలే తీరు, ఎదుటి వారి గురించి మనం చేసే ఆలోచనలు, సభ లో మనం నడుచుకునే విధానం, వివాహాది సందర్భాలలో మనముండే పద్ధతి... ఇమిడి ఉన్నాయి. మన ముఖకవళికలు, కనుబొమ ల కదలికలు, నేత్రద్వయ విన్యాసం, కరచరణాల అభినయం మన ఆలోచనా పోకడకు, మనసుకు చిత్తరువులవుతాయి. ఇవే మన నడతకు భాష్యం చెపుతాయి. మన వ్యక్తిత్వాన్ని ఇతరులకు స్ఫురింపచేస్తాయి. మనకు సమా జంలో ఒకగౌరవాన్ని, హుందాతనాన్ని తేవచ్చు లేదా అవి పోయేటట్టు చెయ్యచ్చు.
మనలోని భావోద్వేగాలు అక్షరాకృతిని పొంది శబ్దరూపం దాల్చటానికి ముందే మన హావభావాలు, ఆంగికవిన్యాసం మన నడవడిని ఎదుటివారికి చూపిస్తాయి. మనమేమిటో చెప్పేస్తాయి. మనం ఒకరిని నోరారా ప్రేమతో పిలిచినా, ఆ పిలుపు అదే భావనలో వారికి చేరాలంటే వాటికి హావభావాలు తోడవ్వాలి. అప్పుడే వాటి మధ్య ఒక సమన్వయం ఏర్పడుతుంది. లేకపోతే, నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించటమే అవుతుంది. ఇదీ ప్రవర్తనలో అంతర్భాగమే. అందుకనే మన మాటలను, వాటిని ముందుగానే సూచించే శారీరక సంకేతాలమీద, ముద్రల మీద కూడ మనకు నియంత్రణ కావాలి. అది కష్టసాధ్యమే కాని, అసాధ్యమేమి కాదు. అపుడే ఇతరులను నొప్పించకుండా మనగలం. దీనికోసం ప్రయత్నం చేయాలి. మన మాటలతో కాని, చేతలతో కాని ఎదుటివారిని బాధ పెట్టకూడదు.
‘ఒరులేయవి యొనరించిన...’ అన్న శ్లోక సారాంశమిదే. ఇటువంటి వర్తనను అలవరుచుకోగలిగితే మన సంబంధ బాంధవ్యాలు హాయిగా, ఆనందంగా సాగిపోతాయి.నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత?మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోది చేస్తుంది. ఆ సంపద నివ్వటం లో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది.ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం, అసహాయుల, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు.
వీటిని గొప్ప విషయాలుగా భావిస్తాం. వీటి గురించి చర్చించడం వల్ల ఉపయోగమే లేదు. ఈ అంతర్గత శక్తులు లేదా సుగుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఆచరించగలగాలి. అంటే త్రికరణ శుద్ధి అవసరం. అలా ఆచరించిన వారినే శీలసంపన్నులంటాం. కొన్ని వేలమాటలకు దక్కని ఫలితం, విలువ ఆచరణ వల్ల వస్తుంది. అపుడే ఆ సుగుణాలు మరింతగా శోభిస్తాయి. మనిషికి మంచి నడత చాలా ముఖ్యం. అందుకే అది అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వంటపదార్ధపు రుచి దాని గురించి ఎంతగా మాట్లాడినా, వివరించినా తెలియదు. దాన్ని రుచి చూసినపుడే తెలుస్తుంది. అదే బోధనకు, ఆచరణకు ఉన్న భేదం. అటువంటి వారినే సమాజం గౌరవిస్తుంది. వారే ఆదర్శప్రాయులు. ప్రాతః స్మరణీయులు. వారే మార్గదర్శకులు అవుతారు. మంచి నడత గలవారి మాటలకు ఎనలేని శక్తి వస్తుంది. వారే ఎందరినో ప్రభావితం చెయ్యగలరు. సన్మార్గం చూపించగలరు.టామి డగ్లస్ చెప్పిన మాటల సారమిదే. మనిషి తనలోని శక్తులను మేల్కొలపాలి. నడతకున్న ప్రాముఖ్యతను గుర్తెరగాలి. అదే తనను మంచి మార్గంలో నడిపించగల శక్తి అని తెలుసుకోవాలి. మనిషిని మనీషిగా మార్చే శక్తి నడతే. అపుడు అందరిలోనూ, అంతటా ఆనందమే.
– బొడ్డపాటి చంద్రశేఖర్ ఆంగ్లోపన్యాసకులు