వడ్డీ తగ్గుతోంది ! రిటైరయ్యాక ఎలా ? | business Special Article | Sakshi
Sakshi News home page

వడ్డీ తగ్గుతోంది ! రిటైరయ్యాక ఎలా ?

Published Mon, Mar 13 2017 4:43 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

వడ్డీ తగ్గుతోంది ! రిటైరయ్యాక ఎలా ?

వడ్డీ తగ్గుతోంది ! రిటైరయ్యాక ఎలా ?

ఎఫ్‌డీలపై గణనీయంగా తగ్గుతున్న రాబడి
ఊహించని రీతిలో పెరుగుతున్న వైద్య వ్యయాలు
అందుకోసం మూడంచెల భద్రత అవసరం

అత్యవసర నిధి వైద్య బీమా ఈక్విటీల్లో పెట్టుబడి
అనవసర వ్యయాలు తగ్గించుకోవటమూ మంచిదే  


డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. బ్యాంకు ఎఫ్‌డీలపై 7 శాతానికి మించి వడ్డీ రావటం లేదు. మరి వడ్డీ ఆదాయాన్నే నమ్ముకున్న విశ్రాంత ఉద్యోగుల పరిస్థితేంటో ఒక్కసారి ఊహించుకోండి? ప్రైవేటు ఉద్యోగాలు కనక చాలామందికి పింఛన్‌ కూడా లేదు. మరి వాళ్లేం చేయాలి? తక్కువ వడ్డీ రేట్లున్న ఈ పరిస్థితుల్లో జీవనావసరాలను తీర్చుకునేందుకు వారికున్న ప్రత్యామ్నాయాలేంటి? ఇదే ఈ ప్రత్యేక కథనం...

గడిచిన రెండు మూడేళ్ల కాలంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగని ఖర్చులేమీ తగ్గిపోవటం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి అవసరాలకు వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలు గతం కంటే ఎక్కువే అయ్యాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు నెలనెలా వడ్డీ ఆదాయంతోపాటు మూల నిధి నుంచి కొంత మేర వినియోగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే మరో ఇబ్బంది ఎదురవుతుంది. తరిగిపోయిన అసలునిధి భవిష్యత్తులో తగినంత ఆదాయాన్నివ్వలేదు. జీవించి ఉన్నంత కాలం అవసరాలను తీర్చే స్థాయిలో అది ఉండకపోవచ్చు. ఇది కూడా ప్రమాదకరమే

రిస్క్‌ సమంజసం కాదు...
పెట్టుబడుల ద్వారా అధికంగా ఆదాయం పొందాలన్న ఆలోచనతో రిటైర్మెంట్‌ కాలంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉన్న నిధిని ఇతర సాధనాల వైపు మళ్లించడం సరికాదు. ఎందుకంటే విశ్రాంత జీవనంలో ప్రశాంతత ముఖ్యం. ఆ సమయంలో ఆదాయం కోసం తీసుకునే రిస్క్‌ ఆందోళనను పెంచకూడదు. పైగా అసలు నిధికి భద్రత ఎంతో అవసరం. కార్పొరేట్‌ సంస్థలు చేతులెత్తేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నందున బాడ్‌ ఫండ్లు, కార్పొరేట్‌ డిపాజిట్లలో పెట్టుబడులూ సమంజసం కాదు. ఇక ఉన్న అవకాశాలు యాన్యుటీ పథకాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే. యాన్యుటీ పథకాల కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనే రాబడి ఎక్కువగా ఉంది. తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పరిమితం చేసుకోవడం, రివర్స్‌ మార్ట్‌గేజ్‌ వంటి వాటి ద్వారా అవసరమైనంత పొందడం విశ్రాంత జీవనంలో ఉన్న వారి చేతుల్లో ఉన్న అవకాశాలు.  

ఆరోగ్యానికి రక్షణ ఉందా?
అన్నింటికంటే ఖరీదైనది వైద్యం అని తెలిసిందే. అందుకే మలి జీవితంలో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా ఆరోగ్య రక్షణపై ప్రభావం పడకూడదు. ఇందుకోసం మూడెంచల రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. మొదటిది అత్యవసర నిధి. రెండోది వైద్య బీమా. మూడోది ఈక్విటీల్లో పెట్టుబడులు. వైద్య బీమాలో కొన్ని వ్యాధులు, సర్జరీలకు కవరేజీ ఉండదు. దానికి ఎక్కువ డబ్బే అవసరమవుతుంది. అందుకోసమే మూడో ఆప్షన్‌. వైద్య వ్యయాలనేవి అనుకోకుండా ఎదురవుతాయి. ఏ స్థాయిలో ఉంటాయన్నదీ ఊహించలేం. అందుకే ఈక్విటీల్లో కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత మేర రక్షణ కల్పించుకోవచ్చన్నది నిపుణుల సూచన.  ఎందుకంటే సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆరోగ్య రంగ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. ఈ లెక్కన సాధారణ వస్తువుల ధరలతో పోలిస్తే వైద్య వ్యయాల పెరుగుదల వేగంగా ఉంటుంది. మరి ఉన్నదంతా తీసుకెళ్లి సురక్షితమైనదన్న యోచనతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనే పెడితే వచ్చే నామమాత్రపు వడ్డీ ఆదాయం ఏ మూలకు సరిపోతుందన్నది ఆలోచించాలి. అందుకే కొంత రిస్క్‌ ఉన్నప్పటికీ ఈక్విటీలో కొంచెం మెరుగైన రాబడులను ఆశించవచ్చు.  

ఖర్చులకు కళ్లెం వేయాలా?
ఇటువంటి సందర్భాల్లో వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం సముచితం. వినోదం, కాలక్షేపం కోసం ఖర్చులకు బదులు జీవన వ్యయాలు, ఆరోగ్య వ్యయాలకే ప్రాధాన్యమివ్వాలి. ‘జీవితమంతా కష్టపడ్డాను ఇప్పుడైనా ఎంజాయ్‌ చేయకుంటే ఎలా’ అన్న భావన కలగడం అసహజమేమీ కాదు. అయితే మీకు వస్తున్న ఆదాయం మీ ఆకాంక్షలన్నింటినీ తీర్చే స్థాయిలో ఉంటే త్యాగం చేయాల్సిన అవసరం రాదు. కానీ, తక్కువ ఆదాయం ఉంటే మాత్రం కనీస అవసరాలే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలి.

‘రివర్స్‌’ మందు!!  
సొంత ఇంటినే ఆదాయ వనరుగా మార్చుకునే ప్రత్యేక సదుపాయం...

ఇది అనువైన సమయమే!
వడ్డీ రేట్ల క్షీణత నేపథ్యంలో రివర్స్‌ మార్ట్‌గేజ్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుత రేట్ల ప్రకారం చూస్తే రిటైర్మెంట్‌ జీవితాన్ని గడుపుతున్న వారికి రివర్స్‌ మార్ట్‌గేజ్‌ అనువైనదనేది నిపుణుల అభిప్రాయం. విశ్రాంత జీవనంలో ఉన్న వారికి ప్రధానంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే ఆధారం. మరి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతానికి దిగివచ్చేశాయి కనక వడ్డీ ఆదాయానికీ చిల్లులు పడ్డాయి. రూ.50 లక్షలను ఎఫ్‌డీ చేస్తే గతంలో 9 శాతం వడ్డీ రేటున్నప్పుడు వార్షికంగా రూ.4.5 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 7 శాతం వడ్డీపై ఈ ఆదాయం రూ.3.5 లక్షలకు పడిపోయింది. ఆదాయం ఈ స్థాయిలో తగ్గిపోయినందున రివర్స్‌ మార్ట్‌గేజ్‌ తీసుకోవడానికి ఇది అనువైన సమయమన్నది నిపుణుల మాట. ఎక్కువ బ్యాంకులు 10–12 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తుండగా, ఐవోబీ మాత్రం 9.40 శాతానికే రుణమిస్తోంది.

రివర్స్‌ మార్ట్‌గేజ్‌ పనిచేసేదెలా?
ఇంటి కోసం రుణం తీసుకున్నామనుకోండి. ఒకేసారి రుణం తీసుకుని... నెలనెలా వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. దానికి రివర్స్‌లో... మన దగ్గరున్న ఇంటిని బ్యాంకుకు తనఖా పెడతామన్న మాట. బ్యాంకే నెలనెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలా కాకుండా రుణం మొత్తం ఒకేసారి కావాలన్నా జారీ చేస్తుంది. కాల వ్యవధి తర్వాత ఏక మొత్తంలో రుణాన్ని, వడ్డీతో కలిపి తీర్చివేయాలి. 2007లో ఈ పథకం అమల్లోకి రాగా... ప్రారంభంలో ఈ పథకం పట్ల భారీ అంచనాలే వ్యక్తమయ్యాయి. కానీ, వాస్తవంగా చూస్తే ఆదరణ అంతగా లేదు. దీనికి కారణం వడ్డీ రేట్లు అధికంగా ఉండడమే. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు తమ సొంతింటిని రివర్స్‌ మార్ట్‌గేజ్‌ చేసుకునేందుకు అర్హత ఉంది.

ఎలా తీసుకుంటే మేలు...?
రివర్స్‌ మార్ట్‌గేజ్‌ రెండు విధాలుగా ఉంటుంది. అర్హత మేరకు రుణం మొత్తాన్ని బ్యాంకు ఖరారు చేసిన తర్వాత నెలసరి వాయిదాల రూపంలో లేదా మూడు నెలలు లేదా వార్షికంగా రుణాన్ని తీసుకోవచ్చు. కాదంటే ఏక మొత్తంలోనూ ఇస్తారు. ఒకేసారి రుణాన్ని తీసేసుకుంటే దాన్ని నెలనెలా ఆదాయం కోసం బ్యాంకు ఎఫ్‌డీ లేదంటే బీమా కంపెనీ పెన్షన్‌ యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుంది. అదే బ్యాంకు నుంచి రుణాన్ని నెలసరి వాయిదాల రూపంలో అందుకున్నట్టయితే, అది రుణం కనుక దానిపై పన్ను పడదు.

ఇంటి విలువలో ఎంత రుణం..?
రివర్స్‌ మార్ట్‌గేజ్‌లో బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తి మరణించినపుడు మాత్రమే రుణాన్ని వసూలు చేసుకోగలవు. అదే సమయంలో రుణ గ్రహీత మార్ట్‌గేజ్‌ కాల వ్యవధి వరకూ జీవించి ఉంటే... బ్యాంకులు రుణ వసూలును వాయిదా వేసుకోవాలి. దీంతో రిస్క్‌ పెరుగిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు అసలు ఇంటి విలువలో 40 శాతాన్ని మాత్రమే (ఎల్‌టీవీ) రుణంగా మంజూరు చేస్తున్నాయి.

ఎవరికి అనుకూలం...?
చక్కగా స్థిరపడిన వారికి తల్లిదండ్రుల పేరిట ఉన్న ఇంటితో దాదాపు అవసరం ఏర్పడదు. అలాంటి పిల్లల తాలూకు తల్లిదండ్రులు రివర్స్‌ మార్ట్‌గేజ్‌ రుణ పథకాన్ని పరిశీలించొచ్చు. అలాగే, వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు అధికం కావడం తరచూ జరుగుతుంటే రివర్స్‌ మార్ట్‌గేజ్‌ ఓ మంచి అవకాశమేనంటున్నారు నిపుణులు. ఒకవేళ ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం తక్కువగా ఉంటే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలూ చూడొచ్చన్నది వారి సలహా. బ్యాంకు ఎఫ్‌డీల్లోనుంచి పెట్టుబడులను స్వల్పకాలిక డెట్‌ ఫండ్స్‌కు మళ్లించడం ద్వారా కొంచెం అధిక రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది.

విధి, విధానాలు
60 ఏళ్లు ఆపైబడిన వారే రుణానికి అర్హులు. దంపతులు ఇద్దరి పేరిటా తీసుకోవచ్చు. కాకపోతే అందులో ఒకరి వయసు 60, ఆపైన ఉండాలి.  

రుణ కాల వ్యవధి గరిష్టంగా 20 ఏళ్లు. బ్యాంకుల మధ్య ఈ విషయంలో తేడాలున్నాయి. వాస్తవానికి తనఖా పెడుతున్న ఇంటి మిగిలిన జీవిత కాలం రుణ కాల వ్యవధికి కీలకం.

రుణ గ్రహీత మరణానంతరమే బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకుంటాయి. ఉదాహరణకు బ్యాంకు 20 ఏళ్ల కాలవ్యవధితో మార్ట్‌గేజ్‌ రుణాన్ని జారీ చేసిందనుకుందాం. రుణగ్రహీత 30 ఏళ్లు జీవించి ఉంటే, అప్పటి వరకూ బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకోవు.

రుణ గ్రహీత మరణానంతరం అతని వారసులకు రుణాన్ని చెల్లించే హక్కుంటుంది. వారసులు రుణాన్ని చెల్లించేందుకు ముందుకు రాకపోతే, బ్యాంకులు అప్పుడు తనఖాలో ఉన్న ఇంటిని వేలం వేస్తాయి. అలా వచ్చిన ఆదాయంలో రుణం, వడ్డీ పోను ఏమైన మిగిలి ఉంటే ఆ మొత్తాన్ని చట్టబద్ధమైన వారసులకు అందిస్తాయి.

ఇంటి రుణం మాదిరిగానే ప్రాసెసింగ్‌ చార్జీలు వంటివి మామూలే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement