ఎఫ్‌డీ విషయంలో ఈ పొరబాటు చేయకండి, ఇలా చేస్తే లాభాలు! | FD laddering: Explanation to build wealth via fixed deposits | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీ విషయంలో ఈ  పొరబాటు చేయకండి, ఇలా చేస్తే లాభాలు!

Published Mon, Sep 4 2023 4:27 AM | Last Updated on Mon, Sep 4 2023 11:40 AM

FD laddering: Explanation to build wealth via fixed deposits - Sakshi

డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి చేరుకోవడంతో ఈ సమయంలో ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్‌ చేయాలా..? లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా? అన్నది ఎంతో మంది ఎదుర్కొంటున్న సందేహం. నిజానికి ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరగొచ్చు. లేదంటే కొంత విరామం తర్వాత రేట్లు తగ్గొచ్చు. మరి ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత.. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే అదనపు రాబడి అవకాశాన్ని కోల్పోతామేమో..? అనుకునే వారు ఒక రకం అయితే.. ఈ రేట్లపై ఇన్వెస్ట్‌ చేయకపోతే, రానున్న రోజుల్లో ఆర్‌బీఐ రేట్లను తగ్గిస్తే అప్పుడు మెరుగైన రాబడి చాన్స్‌ మిస్‌ అవుతామేమో అనుకునే వారు ఇంకో రకం.

ఇలాంటి అయోమయ వాతావరణాన్ని చూసి పెట్టుబడుల అవకాశాలను కోల్పోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వాటికి తగినట్టు పెట్టుబడుల వ్యూహాలను అనుసరించడమే ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గం. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు ‘ఎఫ్‌డీ లాడరింగ్‌’ (అంచెలంచెలుగా) విధానాన్ని అనుసరించొచ్చు. అంటే డిపాజిట్‌ మొత్తాన్ని ఒకేసారి గడువు తీరే విధంగా ఇన్వెస్ట్‌ చేసుకోకుండా ఉండడం. మున్ముందు ఏం జరుగుతుందోనన్నది అన్ని సందర్భాల్లోనూ అంచనా వేయలేం. అటువంటప్పుడు వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు ఎఫ్‌డీ లాడార్‌ ఉపయోగపడుతుంది. మెరుగైన రాబడులకు మార్గం చూపుతుంది.

ఆర్‌బీఐ గడిచిన రెండు ద్రవ్య విధాన సమీక్షల్లో కీలకమైన రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యానికి ఎగువనే చలిస్తోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు ముగింపు పడిందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. త్వరలో వెలువడనున్న ఆగస్టు ద్రవ్యోల్బణం తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ద్రవ్యోల్బణం ఎగసి పడుతుండడంతో అదనపు సీఆర్‌ఆర్‌ రూపంలో బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ మరింత లిక్విడిటీని తీసుకునే నిర్ణయాన్ని గత సమీక్షలో ప్రకటించింది. మరోవైపు యూఎస్‌ ఫెడ్‌ రానున్న సమీల్లో రేట్లను పెంచే అవకాశాలే ఉన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలా? వేచి చూడాలా? అన్న సందిగ్ధత ఎదుర్కొనే వారు ఎఫ్‌డీ లాడార్‌ను అనుసరించొచ్చు. (వర్క్‌ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్‌ అంటున్న ఐటీ దిగ్గజం)

వడ్డీ రేట్ల అస్థిరతలకు చెక్‌
కాలానుగుణంగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎఫ్‌డీ లాడార్‌ సాయపడుతుంది. ఈ విధానంలో పెట్టుబడి మొత్తాన్ని ఒకే కాల వ్యవధికి ఇన్వెస్ట్‌ చేయకుండా.. వివిధ కాల వ్యవధుల మధ్య భాగాలుగా చేసుకోవాలి. సాధారణంగా వడ్డీ రేట్లు పడిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి కాకుండా స్వల్ప కాలానికి ఎఫ్‌డీలు చేస్తుంటారు. ఒకవేళ వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం మొదలు పెడితే.. స్వల్పకాలానికి చేసిన ఎఫ్‌డీ గడువు తీరి చేతికి వస్తుందని, ఆ మొత్తాన్ని మెరుగైన రేటుపై మళ్లీ ఎఫ్‌డీ చేసుకోవచ్చని అనుకుంటారు. అదే మాదిరిగా, వడ్డీ రేట్లు పెరుగుతూ వెళుతుంటే అప్పుడు దీర్ఘకాలానికి ఎఫ్‌డీలు చేస్తుంటారు. ఒకవేళ అక్కడి నుంచి వడ్డీ రేట్లు పడిపోవడం మొదలు పెడితే.. అధిక రేటుపై ఎఫ్‌డీ చేసుకున్నట్టు అవుతుందని భావిస్తుంటారు. కానీ, ఇది సరైన విధానం కాబోదు. వడ్డీ రేట్లు అస్థిరంగా ఉన్న సమయంలో పెట్టుబడినంతా ఒకే ఎఫ్‌డీగా మార్చుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. 

‘‘ఇన్వెస్టర్లు సాధారణంగా గరిష్ట రేటుపై ఎఫ్‌డీ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. భవిష్యత్‌ వడ్డీ రేట్ల గమనాన్ని అంచనా వేయడం రిస్‌్కతో కూడుకున్నదే అవుతుంది. దీనికి బదులు వడ్డీ రేట్ల చలనంతో వచ్చే రిస్‌్కను తగ్గించుకునేందుకు ఎఫ్‌డీ లాడరింగ్‌ ఒక టెక్నిక్‌’’అని ముంబైకి చెందిన సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ అభిజిత్‌ తాలూక్‌దార్‌ సూచించారు. ‘‘లాడరింగ్‌ను క్రమం తప్పకుండా అనుసరించినట్టయితే వడ్డీ రేట్ల మారి్పడికి భిన్నంగా లేకుండా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో, కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉండొచ్చు. ఎఫ్‌డీలను తిరిగి రెన్యువల్‌ చేసుకునే సమయంలో అప్పటి వరకు ఉన్న రేటు కంటే మెరుగైన రేటు రావొచ్చు. లేదంటే తక్కువ రేటు ఉండొచ్చు. కాకపోతే మొత్తం మీద నా పెట్టుబడులపై రేటు సగటుగా ఉంటుంది. ఎఫ్‌డీ లాడరింగ్‌తో మెరుగైన రేటుపైనే ఇన్వెస్ట్‌ చేయాలన్న సందిగ్ధత, అయోమయం తొలగిపోతుంది’’అని ‘ఇంటర్నేషనల్‌ మనీ మ్యాటర్స్‌’ సంస్థ ఎండీ, సీఈవో లోవై నవలకి వివరించారు.  

రాబడి సగటుగా మారి..
ఉదాహరణకు మీ వద్ద రూ.9 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని ఒకే ఎఫ్‌డీగా కాకుండా.. రూ.3 లక్షల చొప్పున మూడు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని వేర్వేరు కాల వ్యవధికి ఎఫ్‌డీగా మార్చుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకు ఒకటి చొప్పున ఎఫ్‌డీగా మార్చుకోవాలి. మొదటి రూ.3 లక్షలు ఏడాదికి మెచ్యూరిటీ తీరి చేతికి వస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి మళ్లీ ఎఫ్‌డీ చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ వెళ్లే తరుణంలో అధిక రేటుపై ఎఫ్‌డీ చేసుకున్నట్టు అవుతుంది. అదే వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో అప్పటి వరకు చేసిన రేటు కంటే కొంచెం తక్కువకు ఎఫ్‌డీ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మిగిలి ఉన్న రెండు, మూడేళ్ల ఎఫ్‌డీలపై అధిక రేటు పొందినట్టు అవుతుంది. ఎఫ్‌డీ లాడార్‌ విధానం వల్ల ఇన్వెస్టర్‌ తన పెట్టుబడిపై పొందే రేటు సగటుగా మారుతుందని, మెరుగైన రాబడికి వీలు కలుగుతుందని అభిజిత్‌ తాలూక్‌దార్‌ వివరించారు.  
  ∙
ఉదాహరణకు రూ.9 లక్షలను రూ.3 లక్షల చొప్పున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి ఎఫ్‌డీ చేశారని అనుకుందాం. 2018 జనవరి నుంచి 2020 డిసెంబర్‌ మధ్య ఈ ఎఫ్‌డీలు మెచ్యూరిటీ తీరేట్టుగా డిపాజిట్‌ చేశారు. అప్పుడు వడ్డీ రేట్లు క్షీణ బాటలో ఉన్నాయి. కనుక 6.5 శాతం, 6 శాతం, 4.7 శాతంపై ఎఫ్‌డీ చేసినట్టు అయింది. 2020 డిసెంబర్‌ చివరికి మూడు ఎఫ్‌డీలపై కలిపి రూ.1,63,500 రాబడిగా వచ్చి ఉండేది. అలా కాకుండా మొత్తం రూ.9 లక్షలను 2018 జనవరిలో మూడేళ్ల కాలానికి (2020 డిసెంబర్‌లో గడువు తీరే విధంగా) ఎఫ్‌డీ చేసి ఉంటే, అప్పుడు రూ.1,75,500 రాబడిగా వచ్చి ఉండేది.

మూడు భాగాలుగా చేయడం వల్ల (ఎఫ్‌డీ లాడరింగ్‌) ఈ ఉదాహరణలో (వడ్డీ రేట్లు పడిపోయే క్రమంలో) రూ.12,000 తక్కువ రాబడి పొందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో ఉదాహరణలో.. 2021 జనవరి నుంచి 2023 జూలై వరకు ఇంతే మొత్తాన్ని మూడు భాగాలుగా ఎఫ్‌డీ చేసుకుని ఉంటే (4.25 శాతం, 5.50 శాతం, 6.75 శాతం) మొత్తం మీద వడ్డీ రాబడి రెండున్నరేళ్లలో రూ.1,35,000 వచ్చి ఉండేది. అలా కాకుండా రూ.9 లక్షలను 2021 జనవరిలో ఒకే ఎఫ్‌డీగా చేసి ఉంటే, దీనిపై రాబడి రూ.1,14,750గా ఉండేది. ఎఫ్‌డీ లాడర్‌ కారణంగా రూ.20,300 అధిక రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. ‘‘క్షీణించే, పెరుగుతూ పోయే వడ్డీ రేట్ల సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని 2018–2023 కాలంలో ఎఫ్‌డీ లాడరింగ్‌ చేసి ఉంటే, ఈ మొత్తంపై రూ.8,250 అధిక రాబడికి అవకాశం లభించేది’’అని ముంబైకి చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ ‘స్ట్రాటజీ’ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ ప్రశాంత బర్వాలియా వెల్లడించారు.

ఏమిటి మార్గం..?
నిజానికి వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో కంటే.. పెరుగుతున్న తరుణంలో, మిశ్రమంగా చలించే తరుణంలో ఎఫ్‌డీ లాడర్‌ ప్రయోజకరంగా ఉంటుంది. ఒక్క వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలోనే ఎఫ్‌డీ లాడర్‌ వల్ల కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు పెరుగుతాయా? లేదంటే తగ్గుతాయా? వడ్డీ రేటు గరిష్ట స్థాయికి చేరినట్టు ధ్రువీకరించుకోగలరా..? సాధారణ ఇన్వెస్టర్లకు ఇది క్లిష్టమైన టాస్క్‌ అవుతుంది. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి కచి్చతంగా పెరుగుతాయని అనిపించినప్పుడే ఎఫ్‌డీ లాడర్‌ చేసుకోవచ్చు. అలా కాకుండా ఊహలు, అంచనాలపై ఆధారపడకుండా అన్ని కాలాల్లోనూ ఎఫ్‌డీ లాడార్‌ చేసుకోవడం అనుకూలమైన విధానం.

ఎఫ్‌డీ లాడర్‌తో వడ్డీరేట్ల అస్థిరతలను అధిగమించడంతోపాటు, మరో ప్రయోజనం కూడా ఉంది. లిక్విడిటీ సమస్య ఉండబోదు. ఏడాదికోసారి లిక్విడిటీ చేతికి అందుతుంది. రిటైర్మెంట్‌ తీసుకున్న వారికి క్రమం తప్పకుండా ఆదాయం అవసరం పడుతుంది. అటువంటి వారు మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, పన్నెండు నెలల కాలానికి ఒక్కో భాగం చొప్పున ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ‘‘ఎఫ్‌డీ లాడరింగ్‌ అనేది వడ్డీ రేటు, పెట్టుబడుల రిస్‌్కను తగ్గిస్తుంది. దీనికితోడు వివిధ కాలాల్లో స్థిరమైన నగదు ప్రవాహాలకు అవకాశం కలి్పస్తుంది. కాకపోతే ఏడాదిలోపు కాల వ్యవధులకు చేసే మినీ లాడర్‌పై తక్కువ రాబడి వస్తుంది’’అని రాకెట్‌ఫోర్ట్‌ ఫిన్‌క్యాప్‌ వ్యవస్థాపకుడు వెంకట కృష్ణన్‌ శ్రీనివాసన్‌ సూచించారు.

ఇక డిపాజిట్‌ చేసే ముందు అందుబాటులోని వివిధ బ్యాంకులు ఆఫర్‌ చేస్తున్న వడ్డీ రేట్లను పరిశీలించాలి. మెరుగైన రేటును ఆఫర్‌ చేసే బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేసుకోవడం ద్వారా రాబడిని పెంచుకోవచ్చు. సాధారణంగా బ్యాంకుల్లో ఎఫ్‌డీల కాలవ్యవధి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం అయితే 7.5 శాతం వరకు వడ్డీ రేటు ఎఫ్‌డీలపై లభిస్తోంది. 60 ఏళ్లు నిండిన వారికి అర శాతం అదనపు రేటు లభిస్తుంది. ఎఫ్‌డీ లాడార్‌లో వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో రాబడి తగ్గుతుంది. అయినా కానీ, ఈ విధానంపై నమ్మకం ఉన్న వారే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే.. ఏదైనా ఒక బ్యాంకులో అన్ని డిపాజిట్లు కలిపి రూ.5 లక్షలు మించకుండా, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా బ్యాంకు సంక్షోభంలో పడినా,  రూ.5 లక్షల వరకు బీమా రూపంలో వెనక్కి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement