
పనసపండు రుచిలోనే కాదు... ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా అంతే మంచిది. దాని వల్ల ఆరోగ్యానికి సమకూరే ప్రయోజనాలు అనేకం. వాటిలో కొన్నివి.
పనసలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ–రాడికల్స్‌ను నిర్మూలించి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మరీ ముఖ్యంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను నివారిస్తుంది. ∙పనసలో విటమిన్–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్–సితో వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. అందువల్ల పనస చాలా రకాల వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. పనస పండులో లోని కొన్ని పోషకాలు మంట, వాపు, నొప్పి (ఇన్‌ఫ్లమేషన్)ను తగ్గిస్తాయి. దెబ్బలు త్వరగా నయమయ్యేలా చూస్తాయి. పనసలోని ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాల సామర్థ్యం చాలా ఎక్కువ. అవి జీవకణాలలోని దెబ్బతిన్న డీఎన్‌ఏలను సైతం చక్కదిద్దగలవు. పనసలో విటమిన్–ఏ పాళ్లు ఎక్కువ.
అందుకే అది కంటికి మేలు చేస్తుంది. అదీగాక క్యాటరాక్ట్, మాక్యులార్ డీ–జనరేషన్, రేచీకటి వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది. పనసలోని విటమిన్–సి మన చర్మ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. మేనిని నిగారించేలా చేస్తుంది. దాంతో వయసు పెరగడం (ఏజింగ్ ప్రక్రియ) చాలా ఆలస్యంగా జరుగుతుంది. పనసలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల అది రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది.పనస థైరాయిడ్ గ్రంథికి వచ్చే జబ్బులను నివారించడంతో పాటు థైరాయిడ్ జీవక్రియలకు అవసరమైన కాపర్‌ను సమకూరుస్తుంది.