కాశీబుగ్గ: ఉద్దానం పంటను ఉత్తరాది వాళ్లూ మెచ్చారు. ఇక్కడి పనసకు కాయలను ఆ రాష్ట్రాల వారు లొట్టలేసుకుని తింటున్నారు. దీంతో ఇక్కడి పనస డిమాండ్ పెరుగుతోంది. రుచి పరంగా అద్భుతంగా ఉండడంతో పాటు రంజాన్ సీజన్ కావడంతో ఉత్తరప్రదేశ్, బిహార్, తదితర రాష్ట్రాలు ఉద్దానం ప్రాంతం నుంచి పనస కాయలు, పండ్లను దిగమతి చేసుకుంటున్నాయి.
మరోవైపు కాశీబుగ్గ కేంద్రంగా బరంపురం, గుజరాత్, కోల్‌కతా, కటక్ తదితర ప్రాంతాలకు కూడా పనస ఎగుమతి అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ, పూండి, హరిపురం, కవిటి, ఇచ్ఛాపురం, మందస, కంచిలి, సోంపేట కేంద్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు పనస ఎగుమతులు ఊపందుకున్నాయి. గడచిన రెండు నెలల్లో రోజుకు సగటున 44 టన్నుల చొప్పున ఇప్పటివరకు 2,640 టన్నుల పనస కాయలు ఎగుమతి అయ్యాయి.
విరగకాసింది
మార్చి నెలాఖరు నుంచి మే వరకు పనస ఎగుమతులు కొనసాగుతాయి. తిత్లీ తుపానుకు దెబ్బతిన్న పనస చెట్లన్నీ ఈ ఏడాది జీవం పోసుకుని విరగకాస్తున్నాయి. ఉద్దాన ప్రాంతంలోని ఏడు మండలాల్లో పనస అంతర పంటగా సాగవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు రావడంతో ప్రస్తుతం కేజీ పనస కాయ కేవలం రూ.13 చొప్పున మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర గతంలో కేజీ రూ.20 వరకు ఉండేది. ఉద్యాన శాఖాధికారులు పనస, మునగ తదితర పంటలకూ ప్రభుత్వ పరంగా ధరలు నిర్ణయిస్తే మేలు జరుగుతుందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పనసతో చేసే వంటకాలవీ..
పనస ముక్కల బిర్యానీ, పనస పొట్టు కూర, పనస పండు హల్వా, పనస పొట్టు పకోడి, పనస గింజల కూర, పనస ముక్కల గూనచారు, పనస చిల్లీ, పనస కాయ కుర్మా, పనసకాయ ఇడ్లీ, పొంగనాలు, పనస నిల్వ పచ్చడి, పనస బూరెలు.
25 వేల హెక్టార్లలో మిశ్రమ పంటగా..
శ్రీకాకుళం జిల్లాలోని మన్యంలోనూ పనస పండుతున్నప్పటికీ ఉద్దాన ప్రాంతమే దీనికి చిరునామాగా మారింది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం మండలంలోనూ పనస పంట ఉంది. 8 మండలాల్లో ఈ ఏడాది విరగ కాసింది. ఎకరాకి రెండు నుంచి ఐదు చెట్లు ఉన్న రైతులు కలుపుకుని కేవలం ఉద్దానంలో వెయ్యి హెక్టార్లలో, జిల్లా వ్యాప్తంగా 25వేల హెక్టార్లలో మిశ్రమ పంటగా పండిస్తున్నారు. పండిన పంటలో 80 శాతం పంట కేజీ, కేజీన్నర కాయ పెరిగేంత వరకు మాత్రమే ఉంచి మార్కెట్ చేస్తారు. 20 శాతం కాయలు, వెనుక పండిన కాయలు పనస పండ్లుగా రెండో రకం మార్కెటింగ్ చేస్తారు.
– సునీత, ఉద్యాన అధికారి, పలాస
Comments
Please login to add a commentAdd a comment