
భక్తులక దర్శనం ఇస్తున్న మూలవిరాట్
వజ్రపుకొత్తూరు రూరల్: అక్కుపల్లి శివసాగర్ బీచ్ అంటే.. ఇక్కడ ఇసుక తిన్నెలు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ప్రకృతి అందాలే మనకు గుర్తుకొస్తాయి. అయితే ఇక్కడ మరో విశేషం దాగివుంది. 250 ఏళ్ల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వర ఆలయం ఉద్దాన ప్రాంత ప్రజల ఇలవేల్పుగా భాసిల్లుతోంది. పర్యాటకులు సైతం స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఇక్కడ స్వామివారి ఆలయ నిర్మాణం వెనుక ఓ కథ కూడా ఉంది. పూర్వకాలంలో మోట్టూరు గ్రామస్తుడు మద్దిల కుటుంబానికి చెందిన నువ్వల వ్యాపారి కలలోకి స్వామివారు వచ్చారంట. అక్కడ బీచ్ పరిసరాల్లోని ఇసుక దిబ్బలో తాను వెలసినట్లు, అక్కడ గుడి కట్టాలని ఆజ్ఞాపించారంట.
ఆ విధంగా వెళ్లి చూడగా శివలింగం కనిపించిందంట. స్వామివారు ఆజ్ఞ పాటించడంతో ఆయన వ్యాపారం లాభసాటిగా సాగిందంట. అప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు స్వామివారిని కొలుస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో మాదిరిగా సూర్యకిరణాలు శివలింగంపై పడుతుంటాయి. ఆ సమయంలో దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మహా శివరాత్రి, ప్రత్యేక దినాల్లో అక్కుపల్లి, బైపల్లి, చినవంక, బాతుపురం గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment