Uddhanam
-
‘ఉద్దానం కొబ్బరికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు’
సాక్షి,కవిటి(శ్రీకాకుళం): ఉద్దానం కొబ్బరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా దేశవ్యాప్తంగా నాణ్యమైన మొక్కలు అందించేందుకు జాతీయ కొబ్బరి బోర్డు, రాష్ట్ర ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని సీడీబీ డిప్యూటీ డైరెక్టర్ రేష్మి డీఎస్ అన్నారు. ఆమె గురువారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈస్ట్‌కోస్ట్ టాల్ వెరైటీలో ఎంపిక చేసిన మదర్ ప్లాంట్ క్షేత్రాల్ని తనిఖీ చేసేందుకు అంబాజీ పేట ఉద్యానవన వర్సిటీ కొబ్బరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కవిటి మండలంలోని ముత్యాలపేట, డి.గొనపపుట్టుగ, కవిటి గ్రామాల్లో కొత్త మొక్కల తయారీకి ఆసక్తి కనబరిచిన రైతుల వ్యవసాయ క్షేత్రాల్ని పరిశీలించారు. ఈ పథకంలో చిక్కాఫ్ సంస్థ ఆధ్వ ర్యంలో రైతులు 10 లక్షల కొబ్బరిచెట్లు పెంచుతున్నామన్నారు. వీటిలో తొలిదశలో 5000 మదర్ప్లాంట్ల నుంచి ఎంపిక చేసిన విత్తన మొక్కల్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంచాలన్న ఒప్పందం రైతులకు, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(సీడీబీ)కు కుదురుతుందన్నారు. ఆ మేరకు తొలిదశ ఎంపిక జరిగిందన్నారు. ఎంపిక చేసిన మదర్ప్లాంట్లకు మూడోదశ తనిఖీ బృందం ట్యాగ్‌లను ఇచ్చి నంబర్లు కేటాయిస్తుందన్నా రు. ఆ ట్యాగ్ నంబర్లతో పాటు రైతు చిరునామా, ఫోన్ నంబర్ సీడీబీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అవసరమైన రైతు లు నేరుగా సంబంధిత రైతులను సంప్రదించి స్థానిక మార్కెట్ ధరకు అదనంగా 30శాతం చెల్లించి మదర్‌ప్లాంట్ మొక్కల విత్తన పండ్లు కొనుగోలు చేయడం ఈ పథకం ఉద్దేశమని సీడీబీ ఏపీ టెక్నికల్ ఆఫీసర్ ఎం.కిరణ్‌కుమార్ వివరించారు. చదవండి: AP: సినిమా టికెట్ల కలెక్షన్లు.. ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలోకి ’ -
కొండ, కోన, గంగమ్మ.. అన్నీ సాక్ష్యంగా ఆ ప్రాంత అభివృద్ధి
ఈ ఫొటో చూడండి. మెళియాపుట్టి కొండకు ఆనుకుని ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రదేశమిది. ఇక్కడి నుంచే ఉద్దానం ప్రాంతానికి నీరు వెళ్లనుంది. నీటి పిల్లర్, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంతో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం ఈ చిత్రం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొండ, కోన, గంగమ్మ.. అన్నీ సాక్ష్యంగా సిక్కోలు అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ప్రతిపక్షం చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు కూడా నిజం లేదని రుజువు చేస్తున్నాయి. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయని పనిని అధికారంలోకి రాగానే చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు అక్కడి తాగునీరే కారణమై ఉండొచ్చని పలు అధ్యయనాలు చెబుతుండటంతో ఆ సమస్యను మొదటిగా పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ఉపక్రమించారు. రూ.700కోట్లతో ఉద్దానం మెగా మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడా పనులు 80శాతం మేర పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేసి సాధ్యమైనంత వేగంగా ఉద్దానంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. ►జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 187 గ్రామాల్లో మూత్రపిండాల జబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ►సుమారు 20వేల మంది మూత్రపిండాల వ్యాధితో వివిధ దశల్లో ఉన్నట్లు అంచనా. ►ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే పనిలో ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోంది. వంశధార రిజర్వాయర్ నుంచి 807 గ్రామాలకు తాగునీరు అందించే ప్రయత్నం చేస్తోంది. ►దాదాపు 5,57,633 మందికి తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. చేపడుతున్న పనులివి.. ►హిరమండలం రిజర్వాయర్ నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు ప్రత్యేక పైపులైన్ల ద్వారా 1.12 టీఎంసీల వంశధార నీటిని అందించేందుకు 1067.253 కిలోమీటర్ల పైపులైను ఏర్పాటు చేస్తున్నారు. ►మెళియాపుట్టి మండల కేంద్రం వద్ద 84 మిలియన్ లీటర్ల తాగు నీటి పిల్లర్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ►264ఓవర్ హెడ్ సర్వీసింగ్ రిజర్వాయర్లు నిర్మించారు. మరో 500 ఓవర్ హెడ్ సర్వీసింగ్, బ్యాలెన్సింగ్ ఇతరత్రా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ►హెడ్ ట్యాంకుల నుంచి గ్రామాల్లోని స్థానిక ట్యాంకులకు అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తారు. చదవండి: అద్దెకుంటున్న యువకుడితో పరిచయం.. యువతికి ఫోన్ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ -
దైవం 'నైవేద్య' రూపేణా..
నిర్మలమైన నీలాకాశానికి మబ్బుతునకలు చుట్టపు చూపుగా వచ్చే వేళ.. నెర్రెలిచ్చిన నేలకు నింగి నుంచి మేఘ సందేశం అందే వేళ.. ఆ ఊరిలో టకోరం మోగుతుంది. సన్నాయికి జతగా డోలు లయబద్ధంగా ఉరుముతుంది. పడతుల చేతుల్లో కడవలు, ఆ కడవల్లో పసుపు నీరు ఎదురు చూస్తూ ఉండగా.. ఆ సందడిలో అమ్మ ఊరేగింపు మొదలవుతుంది. అనంతమైన ఆకాశాన్ని చూస్తూ అందమైన గజముద్ద ముత్తైదువుల నెత్తిపై అమ్మవారి ప్రతి రూపంగా కొలువై ఉంటుంది. ముత్తైదువుల పాదాలను పసుపు నీళ్లు తాకుతూ ఉంటే తల్లి ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది. ఊరుఊరికీ అమ్మ పేరు మారినా ఉత్తరాంధ్రలో జాతర జరిగే తీరు మాత్రం ఇదే. ఉత్సవంలో ఊరేగింపు.. ఆనక ఆరగింపు ఇక్కడి ప్రత్యేకత. ఇంకాస్త లోతుల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం రూరల్: ఫిబ్రవరి నుంచి జూలై వరకు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ఒడిశా ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో చల్లదనం ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామదేవతలను ఇష్టంగా అర్చించుకుని సంబరం జరుపుకునే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అమ్మవారు.. అవును అచ్చంగా అమ్మవారే. నైవేద్యాన్ని దేవత రూపంలో కొలిచే అపురూప సంస్కృతి ఈ పల్లెలు మనకు పరిచయం చేస్తాయి. నెయ్యిలు లేదా పేలాలుగా పిలిచే ఆహార పదార్థంతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఉత్సవ విగ్రహంలా పూజించి ఉత్సవం అయ్యాక ప్రసాదంలా ఆరగించే విశిష్టమైన పద్ధతి సిక్కోలు పల్లెల సొంతం. ఊరి అమ్మోరికి.. ప్రతి పల్లెను ఓ అమ్మవారి అంశ కాపాడుతూ ఉంటుందని స్థానికుల నమ్మిక. కాళీమాత, చింతామణి, భూలోకమాత, బాలామణి, అసిరిపోలమ్మ, నూకాలమ్మ, ధనరాజులమ్మ, స్వేచ్ఛావతి వంటి పేర్లతో గ్రామ దేవతలను పూజించుకుని ఏటా సంబరం చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతి రూపంగా నెయ్యిలతో తయారు చేసిన ‘గజముద్ద’ను పుష్పాలు, బంగారం, కరెన్సీ నోట్లతో అందంగా, ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తారు. పాకంతో పసందు ధాన్యం నుంచి సేకరించిన పేలాలతో తయారు చేసే ఈ పదార్థం రుచి చెప్పనలవి కానిది. ముందుగా కట్టెల పొయ్యిపై పెద్ద కళాయిని వేడి చేసి అందులో నీటిని వేడి చేస్తారు. అందులో పంచదార లేక బెల్లంను వేసి పాకం రూపం ఎర్రగా వచ్చే వరకు వేడి చేస్తారు. అనంతరం సమకూర్చిన పేలాలను పాకంలో వేసి ప్రత్యేకంగా తయారు చేసిన తెడ్డు(గరిటె)తో జిగురుగా వచ్చే వరకు కలుపుతారు. పొయ్యిపై నుంచి కిందకు దించి వేడిగా ఉన్న పాకం ముద్దను చేతులకు మంచి నూనెను పూసుకొని వివిధ ఆకృతుల్లో గజముద్దను తయారు చేస్తారు. అచ్చం అమ్మవారి పోలికల్లో నేత్రాలు, చేతులు, హారం, కిరీటాన్ని తయారు చేస్తారు. ఇందులో బెల్లంతో తయారుచేసే ప్రతిమల ధర ఎక్కువ. పాకం పక్కాగా ఉంటే నెల వరకు ఇది నిల్వ ఉంటుంది. నైవేద్యం సులువుగా జీర్ణమయ్యేందుకు అందులో నిమ్మ, జీలకర్ర, వాము వంటి పోపులను వేస్తుంటారు. సైజును బట్టీ చక్కెరతో తయారు చేసిన గజముద్దలు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ధర పలికితే, బెల్లంతో తయారు చేసిన గజముద్ద రూ.2వేల నుంచి రూ.8వేల వరకు పలుకుతుంది. గజముద్దలకు కేరాఫ్ ఉద్దానం నెయ్యిలతో ప్రత్యేకంగా తయారు చేసే గజముద్ద ప్రసాదానికి కేరాఫ్ ఉద్దానం. ఇక్కడి పల్లెల్లో వీటిని అధికంగా తయారు చేస్తారు. గ్రామాల్లో చిన్నపాటి హొటళ్లు నడిపే గుడియాలు ఈ గజముద్దలను తయారుచేస్తారు. అమ్మవారి స్వరూపం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గజముద్దను అమ్మోరు స్వరూపంగా భావించి పూజలు చేస్తాం. భక్తులు ఎంతో భక్తితో తలపై ధరించి ఊరేగిస్తారు. ఉద్దానం ప్రాంతంలో ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. – డీబీ పురుషోత్తం, అమ్మవారి పూజారి తరాల నుంచి తయారీ మా కుటుంబం తరతరాల నుంచి అమ్మవారి నైవేద్యం గజముద్దను తయారు చేస్తోంది. నాణ్యమైన ధాన్యం పేలాలను సేకరించి పవిత్రంగా తయారు చేస్తాం. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నెల వరకు గిరాకీ ఉంటుంది. – ధ్రౌపతి గుడియా, ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం -
ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టండి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న ప్రజలను ఆదుకునే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్దానం ప్రాంతంలో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి, తగినన్ని బెడ్లు, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కిడ్నీ జబ్బు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రజలకు ఉచితంగా వైద్య సాయం, మందులు అందించాలని, ఆ ప్రాంతంలో 500 పడకల ఆసుపత్రిని నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది కరుకోల సింహాచలం, ఓ రిటైర్డ్ ఉపాధ్యాయులు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ‘ఉద్దానం ప్రాంతంలో జీడిపçప్పు పరిశ్రమలు, ఇటుక బట్టీల నుంచి కలుషిత పదార్థాలు, వ్యర్థాలు చెరువుల్లోకి వదలకుండా ప్రభుత్వం, స్థానిక సంస్థలు వాటి అధికారాలను ఉపయోగించాలి. ఉద్దానం ప్రాంతంలో ఆసుపత్రుల స్థాయిని పెంచాలి. తగిన సంఖ్యలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలి. బాధితుడి ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చేంత వరకు చికిత్స అందించేందుకు ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి. బాధితుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్యం అందించాలి. అత్యవసర కేసుల్లో వైద్య సాయాన్ని నిరాకరించడానికి వీల్లేదు. బాధితులు ఆసుపత్రుల్లో చేరే విషయంలో వైద్యాధికారులు రెండు వారాలకొకసారి సమీక్ష సమావేశాలు పెట్టి, తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి. కిడ్నీ బాధిత కుటుంబాల్లోని పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎలాంటి వివక్షను ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి. తద్వారా వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ఉద్దానం, ఇతర గ్రామాల్లో ఆహారం కలుషితం కాకుండా తనిఖీలు చేసేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. పర్యవేక్షణకు భాగస్వామిగా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను పర్యవేక్షించేందుకు న్యాయ సేవాధికార సంస్థను భాగస్వామిని చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సలహా కమిటీ, అవగాహన కమిటీ, పర్యవేక్షణ కమిటీ, న్యాయ సాయం కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో పలువురికి స్థానం కల్పించింది. ఈ కమిటీలన్నీ నెల, రెండు నెలలకొకసారి సమావేశం కావాలని ఆదేశించింది. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలని ఆ కమిటీలను హైకోర్టు ఆదేశించింది. తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిని ఆదేశించింది. -
Jackfruit: ఉద్దానం పనస.. ఉత్తరాదిన మిసమిస
కాశీబుగ్గ: ఉద్దానం పంటను ఉత్తరాది వాళ్లూ మెచ్చారు. ఇక్కడి పనసకు కాయలను ఆ రాష్ట్రాల వారు లొట్టలేసుకుని తింటున్నారు. దీంతో ఇక్కడి పనస డిమాండ్ పెరుగుతోంది. రుచి పరంగా అద్భుతంగా ఉండడంతో పాటు రంజాన్ సీజన్ కావడంతో ఉత్తరప్రదేశ్, బిహార్, తదితర రాష్ట్రాలు ఉద్దానం ప్రాంతం నుంచి పనస కాయలు, పండ్లను దిగమతి చేసుకుంటున్నాయి. మరోవైపు కాశీబుగ్గ కేంద్రంగా బరంపురం, గుజరాత్, కోల్‌కతా, కటక్ తదితర ప్రాంతాలకు కూడా పనస ఎగుమతి అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ, పూండి, హరిపురం, కవిటి, ఇచ్ఛాపురం, మందస, కంచిలి, సోంపేట కేంద్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు పనస ఎగుమతులు ఊపందుకున్నాయి. గడచిన రెండు నెలల్లో రోజుకు సగటున 44 టన్నుల చొప్పున ఇప్పటివరకు 2,640 టన్నుల పనస కాయలు ఎగుమతి అయ్యాయి. విరగకాసింది మార్చి నెలాఖరు నుంచి మే వరకు పనస ఎగుమతులు కొనసాగుతాయి. తిత్లీ తుపానుకు దెబ్బతిన్న పనస చెట్లన్నీ ఈ ఏడాది జీవం పోసుకుని విరగకాస్తున్నాయి. ఉద్దాన ప్రాంతంలోని ఏడు మండలాల్లో పనస అంతర పంటగా సాగవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు రావడంతో ప్రస్తుతం కేజీ పనస కాయ కేవలం రూ.13 చొప్పున మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర గతంలో కేజీ రూ.20 వరకు ఉండేది. ఉద్యాన శాఖాధికారులు పనస, మునగ తదితర పంటలకూ ప్రభుత్వ పరంగా ధరలు నిర్ణయిస్తే మేలు జరుగుతుందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పనసతో చేసే వంటకాలవీ.. పనస ముక్కల బిర్యానీ, పనస పొట్టు కూర, పనస పండు హల్వా, పనస పొట్టు పకోడి, పనస గింజల కూర, పనస ముక్కల గూనచారు, పనస చిల్లీ, పనస కాయ కుర్మా, పనసకాయ ఇడ్లీ, పొంగనాలు, పనస నిల్వ పచ్చడి, పనస బూరెలు. 25 వేల హెక్టార్లలో మిశ్రమ పంటగా.. శ్రీకాకుళం జిల్లాలోని మన్యంలోనూ పనస పండుతున్నప్పటికీ ఉద్దాన ప్రాంతమే దీనికి చిరునామాగా మారింది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం మండలంలోనూ పనస పంట ఉంది. 8 మండలాల్లో ఈ ఏడాది విరగ కాసింది. ఎకరాకి రెండు నుంచి ఐదు చెట్లు ఉన్న రైతులు కలుపుకుని కేవలం ఉద్దానంలో వెయ్యి హెక్టార్లలో, జిల్లా వ్యాప్తంగా 25వేల హెక్టార్లలో మిశ్రమ పంటగా పండిస్తున్నారు. పండిన పంటలో 80 శాతం పంట కేజీ, కేజీన్నర కాయ పెరిగేంత వరకు మాత్రమే ఉంచి మార్కెట్ చేస్తారు. 20 శాతం కాయలు, వెనుక పండిన కాయలు పనస పండ్లుగా రెండో రకం మార్కెటింగ్ చేస్తారు. – సునీత, ఉద్యాన అధికారి, పలాస -
ఉద్ధానంలో మరో ‘అరసవెల్లి’
వజ్రపుకొత్తూరు రూరల్: అక్కుపల్లి శివసాగర్ బీచ్ అంటే.. ఇక్కడ ఇసుక తిన్నెలు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ప్రకృతి అందాలే మనకు గుర్తుకొస్తాయి. అయితే ఇక్కడ మరో విశేషం దాగివుంది. 250 ఏళ్ల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వర ఆలయం ఉద్దాన ప్రాంత ప్రజల ఇలవేల్పుగా భాసిల్లుతోంది. పర్యాటకులు సైతం స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఇక్కడ స్వామివారి ఆలయ నిర్మాణం వెనుక ఓ కథ కూడా ఉంది. పూర్వకాలంలో మోట్టూరు గ్రామస్తుడు మద్దిల కుటుంబానికి చెందిన నువ్వల వ్యాపారి కలలోకి స్వామివారు వచ్చారంట. అక్కడ బీచ్ పరిసరాల్లోని ఇసుక దిబ్బలో తాను వెలసినట్లు, అక్కడ గుడి కట్టాలని ఆజ్ఞాపించారంట. ఆ విధంగా వెళ్లి చూడగా శివలింగం కనిపించిందంట. స్వామివారు ఆజ్ఞ పాటించడంతో ఆయన వ్యాపారం లాభసాటిగా సాగిందంట. అప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు స్వామివారిని కొలుస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో మాదిరిగా సూర్యకిరణాలు శివలింగంపై పడుతుంటాయి. ఆ సమయంలో దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మహా శివరాత్రి, ప్రత్యేక దినాల్లో అక్కుపల్లి, బైపల్లి, చినవంక, బాతుపురం గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. -
మాటిచ్చా.. పాటించా
నా పాదయాత్రలో ప్రతి ఒక్కరు చాలా ఆవేదనతో చెప్పిన ఆ మాటలు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్ అందడం లేదని, డబ్బులు సరిపోవడం లేదని చెప్పారు. మీరు చెప్పిన ఆ ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితుల పింఛన్ రూ.10 వేలకు పెంచాం. స్టేజి –3 దశ నుంచి కిడ్నీ బాధితులకు స్పెషల్ ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు పింఛన్ ఇస్తాం. – సీఎం వైఎస్ జగన్ ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’...అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ప్రజలకు గట్టి భరోసా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లోనే ‘‘నేను నెరవేర్చా..’’ అని అభినందనలు అందుకుంటున్నారు. ఒక్కొక్క హామీని వడివడిగా అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీతో ముఖ్యమంత్రి జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాసే దుస్థితికి స్వస్తి పలికారు. కిడ్నీ వ్యాధులతో తల్లడిల్లుతున్న ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మూత్రపిండ సమస్యలతో అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు స్టేజ్–3 దశ నుంచే నెలకు రూ.5,000 చొప్పున ప్రత్యేక పెన్షన్‌ను ప్రకటించారు. కిడ్నీ పేషెంట్లు, వారి సహాయకులకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. తిత్లీ తుపాన్ బాధితులకు పెంచిన పరిహారం పంపిణీని ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించారు. మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీని 50 శాతం పెంచి మాట నిలబెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కిడ్నీ బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని స్టేజ్ – 3 దశ నుంచే వారికి పెన్షన్‌ను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు చొప్పున పింఛన్ అందచేస్తామని తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల (సీకేడీ) బారిన పడ్డ ప్రతి 500 మంది రోగులకు ఒక హెల్త్ వర్కర్‌ను నియమిస్తామని, కిడ్నీ బాధితులతోపాటు సహాయకులకు కూడా ఉచితంగా బస్ పాస్ అందిస్తామని చెప్పారు. కిడ్నీ రోగులకు ఉచితంగా ల్యాబ్ పరీక్షలతోపాటు నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా ఉద్దాన ప్రాంత ప్రజల కోసం రూ.600 కోట్లతో నిర్మించనున్న శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్టు, పలాసలో రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రిసెర్చ్ సెంటర్, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం గడపగడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.... స్టేజి –3 నుంచి రూ.5 వేలు ‘స్పెషల్’ పింఛన్ నా పాదయాత్రలో ప్రతి ఒక్కరు చాలా ఆవేదనతో చెప్పిన ఆ మాటలు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్ అందడం లేదని, డబ్బులు సరిపోవడం లేదని చెప్పారు. మీరు చెప్పిన ఆ ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితుల పింఛన్ రూ.10 వేలకు పెంచుతూ సంతకం చేశా. కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ తెస్తానని ఆరోజే చెప్పా. చెప్పినట్లే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నానని సగర్వంగా చెబుతున్నా. ఈ ఆసుపత్రి పెట్టడమే కాదు కిడ్నీ బాధితులకు ఇంకా మంచి చేయడానికి అడుగులు వేస్తాం. స్టేజి 5 స్థాయిలో డయాలసిస్ జరుగుతున్న పేషంట్లకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం. మీ డాక్టర్ (ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు) కోరిక మేరకు స్టేజి–3 దశ నుంచి కిడ్నీ బాధితులకు స్పెషల్ ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేల చొప్పున పింఛన్ ఇస్తామని ప్రకటిస్తున్నాం. కిడ్నీ బాధితులను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పడమే కాదు చేసి చూపిస్తాం. ప్రతి 500 మంది సీకేడీ పేషెంట్లకు ఒక హెల్త్ వర్కర్‌ను ఈరోజు నుంచే నియమిస్తున్నాం. హెల్త్ వర్కర్లు కిడ్నీ పేషెంట్లకుతోడుగా ఉంటారు. కిడ్నీ పేషంట్లతోపాటు ఒక అటెండెంట్‌కు కూడా ఉచితంగా బస్ పాస్ ఇస్తాం. ల్యాబ్‌ల్లో టెస్టులు కూడా ఉచితంగా చేస్తారు. ఇక మీదట నాణ్యమైన మెడిసిన్లు అందుబాటులోకి తెస్తాం. ఆ పరిస్థితి రాకూడదంటే.. ఒక మనిషి కిడ్నీ సమస్యలతో బాధపడకుండా చూడాలంటే అందుకు మూల కారణాలు, ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలనే దిశగా ఆలోచించి అడుగులు వేయాలి. అది జరగాలంటే మొత్తం ఉద్దానం ప్రాంతమంతటికీ శుద్ధ జలాలు అందాలి. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని 827 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లో ప్రతి ఒక్కరికీ నేరుగా శుద్ధమైన తాగునీరు అందించేందుకు రూ.600 కోట్లతో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేస్తూ అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పలు పథకాలు ప్రవేశపెట్టాం. మత్స్యకారుల కోరిక మేరకు జెట్టీ నిర్మాణం ఆ రోజు నా పాదయాత్రలో మత్స్యకార సోదరులు ఫిషింగ్ జెట్టీ కావాలని అడిగారు. వారి విన్నపాలను గత పాలకులు పట్టించుకోలేదు. వారి సమస్యలు విని నేనున్నానంటూ నాడు భరోసా ఇచ్చా. ఈరోజు మంచినీళ్లపేట, నువ్వులరేవులో ఫిషింగ్ జెట్టీ పెడుతున్నాం. మత్స్యకార సోదరుల కోసం జెట్టీ నిర్మాణంతోపాటు అక్కడే అన్ని వసతులు కల్పిస్తాం. పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన హాలు ఏర్పాటు చేస్తాం. షెడ్డులు, బాత్రూమ్లు నిర్మిస్తాం. మార్కెట్ చేసుకునేందుకు అనుమతి ఇస్తాం. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి తెస్తాం. మత్స్యకార దినోత్సవం సందర్భంగా పడవలు, బోట్లు ఉన్న మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఇవ్వబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తెచ్చాం. ఎస్టీ కుల ధ్రువీకరణకు వన్‌మ్యాన్ కమిషన్ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియాలు మాకు ఎస్టీ సర్టిఫికెట్లు రావడం లేదన్నా అని ఆ రోజు చెప్పారు. ఆ మాటలు నేను మర్చిపోలేదు. ఆ రోజే చెప్పా నేను విన్నాను... నేను ఉన్నాను అని. వారికి మంచి చేసేందుకు వన్‌మ్యాన్ కమిషన్‌ను జేసీ శర్మ ఆధ్వర్యంలో నియమిస్తున్నాం. బుడగ జంగాల వాళ్లకు కూడా ఒక మాట చెప్పాం. వీరిద్దరి సమస్యలను పరిగణనలోకి తీసుకొని మంచి చేసేందుకు జేసీ శర్మ కమిషన్ జీవో నంబర్. 104 నిన్ననే జారీ చేశారని చెబుతున్నా. సంక్షేమ ప్రణాళిక .. మా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ వేదిక నుంచి సగర్వంగా చెబుతున్నా. మా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి మాటను ఒక ఖురాన్‌లా, ఒక భగవద్గీతలా, ఒక బైబిల్లా భావిస్తామని ఆ రోజు చెప్పా. ఆ మాట ప్రకారం అడుగులు వేస్తున్నామని మరోసారి సగర్వంగా చెబుతున్నా. ఇందులో భాగంగానే ఈ సెప్టెంబర్ చివరికల్లా ఆటో, ట్యాక్సీలను సొంతంగా నడుపుకొనే ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున ఇవ్వనున్నాం. అవ్వా తాతల పెన్షన్ కూడా రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్తాం. అక్టోబర్ 15న రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున ఇస్తాం. ప్రతి పథకం డోర్ డెలివరీ.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల వ్యవధిలో 4 లక్షల ఉద్యోగాలిచ్చాం. అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామ వలంటీర్లను నియమించాం. వీరికి రూ.5 వేల చొప్పున వేతనం అందిస్తున్నాం. పింఛన్ దగ్గర నుంచి బియ్యం పంపిణీ దాకా, అమ్మ ఒడి నుంచి రైతు భరోసా దాకా, ఇళ్ల పట్టాల నుంచి ఇళ్ల స్థలాల దాకా ఎవరి చుట్టూ తిరగకుండా, లంచాలివ్వాల్సిన పనిలేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి మీ తలుపుతట్టి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని సగర్వంగా చెబుతున్నాం. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. ప్రతి పథకం డోర్ డెలివరీ చేస్తాం. పింఛను కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇళ్లు కావాలన్నా... మరే పథకం కావాలన్నా వలంటీర్లే నేరుగా దరఖాస్తు చేయిస్తారు. రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ 50 శాతం పెంపు సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని నవంబర్ 21న చేపట్టనున్నాం. డీజిల్ సబ్సిడీ ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియక అవస్థలు పడుతున్న ప్రతి మత్స్యకారుడికి చెబుతున్నా. ప్రతి జిల్లాలో కొన్ని బంకులను ఎంపిక చేస్తున్నాం. ఇక్కడ బెండి వద్ద ఉన్న బంకులో మత్స్యకారులు డీజిల్ తీసుకుంటే అక్కడే సబ్సిడీ అందుతుంది. రూ.6 ఉన్న సబ్సిడీని 50 శాతం పెంచి రూ.9 చొప్పున ఇస్తాం. డిసెంబర్ 21న నేరుగా చేనేత కుటుంబాల ఇంటి వద్దకే వెళ్లి రూ. 24 వేలు అందజేస్తాం. జనవరి 26న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి రూ.15 వేలు చొప్పున తల్లుల చేతికి అందిస్తాం. పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం. లాడ్జింగ్, బోర్డింగ్ కింద విద్యార్థికి రూ.20 వేలు చొప్పున అందజేస్తాం. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ.. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తాం. వంశధారపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతాం. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పరుగులు తీయిస్తామని ఇదే వేదిక నుంచి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నారాయణ పురం ఆనకట్ట, తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల్లో ముందడుగు వేస్తామని మాటిస్తున్నా’’ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, పార్టీ నాయకులు తలశిల రఘురాం, ఉన్నతాధికారులు జవహర్‌రెడ్డి, కోన శశిధర్, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం శ్రీకాకుళం జిల్లా నుంచి పైలెట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీ పథకానికి పలాస సభలో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ‘నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో బియ్యం పంపిణీ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాం. రేషన్ షాపుల్లో తినగలిగే స్వర్ణ బియ్యాన్ని పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి 100 శాతం స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలకు నాణ్యమైన బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. తిత్లీ బాధితులకు పెంచిన పరిహారం పంపిణీ ఏడాది క్రితం తిత్లీ తుపాన్లో తీవ్రంగా నష్టపోయిన ఉద్దాన రైతులకు పెంచిన పరిహారం రూ.150 కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని పలాస సభలో ముఖ్యమంత్రి జగన్ చేపట్టారు. కొబ్బరి చెట్టుకు పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచి చెక్కు రూపంలో అందించారు. హెక్టారు జీడి తోటలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచిన పరిహారం అందజేశారు. 9 మంది తిత్లీ బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్టుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచాం. శుక్రవారం నుంచే మిగతావారికి కూడా చెక్కుల పంపిణీ మొదలవుతుంది’ అని తెలిపారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం పంచాయతీలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) చేరుకుని రూ.28 కోట్లతో నిర్మించిన అకడమిక్ భవనం, వసతి గృహం, మెస్‌తోపాటు పైలాన్‌ను ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ కేజీబీవీ పాఠశాల సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్‌ను ప్రారంభించారు. అనంతరం అక్షయపాత్ర వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్లో విశాఖకు తిరుగుపయనమయ్యారు. అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు... షాపులు కలిగిన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఫిబ్రవరి చివరి వారంలో రూ.10 వేలు చొప్పున ఇస్తాం. మార్చి చివరి వారంలో అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు చేయూత అందిస్తాం. ఉగాది రోజు అక్కచెల్లెమ్మలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం. పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం. ఏప్రిల్ 2 శ్రీరామనవమి సందర్భంగా పెంచిన వైఎస్సార్ పెళ్లి కానుక పథకం అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు పెంచి ఇవ్వబోతున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులను నేరుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాలో వేస్తాం. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే డబ్బులు పాత అప్పుల కింద జమ కాకుండా నేరుగా వారికే దక్కేలా చేస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 చట్టాలు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గత పాలకులు మాటలు చెప్పి మభ్యపెట్టారు. నేను అందుకు భిన్నంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపిస్తున్నా. నామినేటేడ్ పోస్టుల్లో 50 శాతం వారికే కేటాయించేలా చట్టం తెచ్చాం. మాట ప్రకారం శంకుస్థాపన... పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్, సమగ్ర రక్షిత మంచినీటి పథకాల శంకుస్థాపన సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు ‘‘మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి తోడు, దీవెనలతో ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 151 సీట్లలో అఖండ మెజార్టీతో గెలిపించారు. 50 శాతం పైచిలుకు ఓటుబ్యాంకుతో మీ తమ్ముడిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు శిరస్సు వంచి పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు. 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో తిరిగా. మీ సమస్యలను విన్నాను, చూశాను. ఆరోజు మీకు నేనున్నా అని చెప్పా. వంద రోజులు తిరగక ముందే ఈరోజు మళ్లీ మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపన చేయగలుగుతున్నానంటే.. మీరంతా ఇచ్చిన ఈ గౌరవానికి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నా. -
అదే వేదన.. అవే కన్నీళ్లు.. చావుబతుకుల జీవితం
సాక్షి, ఉద్దానం : ‘అదే వేదన.. అవే కన్నీళ్లు. జబ్బు బారిన పడి చావుబతుకుల మధ్య జీవిత పోరాటం. కన్నీళ్లు తుడిచి కాసింత భరోసా ఇచ్చేవారే లేరు. వైద్యం అందకపోతే పట్టించుకునేవారే లేరు. నాలుగు రోజులకోసారి రక్తశుద్ధి రావాలంటే నరకయాతన. డయాలసిస్ భాగ్యం దక్కేవరకూ పడిగాపులు.. ఏదైతేనేం ఉద్దానం కిడ్నీ బాధితుల పరిస్థితిలో మార్పు లేదు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం.. ఎన్నికల ముందుకు పెన్షన్‌లో వెయ్యి రూపాయలు పెంచి సర్కారు చేతులు దులుపుకుంది.. సమయానికి మందులుండవు.. బయట కొనుక్కునే స్తోమత లేదు.. చావుతో పోరాటం చేస్తున్నాం..’ ఇదీ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల్లో ఆవేదన. ఉద్దానం ప్రాంతంలో సుమారు 110 గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఒక్కో డయాలసిస్ సెంటర్లో 30 మందికి పైగా వేచి చూస్తున్న బాధితులున్నారు. పలాస, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలిలో డయాలసిస్ సెంటర్లున్నాయి. తాజాగా కవిటిలో పెట్టారు. ఒక్కో మెషీన్‌కు రోజుకు మూడు డయాలసిస్ సెషన్లు మాత్రమే జరుగుతాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. కానీ ఇవి సరిపోకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయాలసిస్ బాధితులకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు మార్చాలి. కానీ కొన్ని రకాల మందులే ఇస్తుండటంతో బయట కొనుక్కుంటున్నామని బాధపడుతున్నారు. ఒక్కో నెలకు రూ.6 వేలు అదనంగా ఖర్చవు తోందని వాపోయారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నవి వేరు, ఇక్కడ ఇస్తున్నవి వేరు, ఇలా అయితే మేమెలా బతుకుతామని బాధితులు అంటున్నారు. వెయ్యి పెంచి చేతులు దులుపుకున్నారు.. గత కొన్నేళ్లుగా తమకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తేగానీ సరిపోదని అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం రూ.2,500 ఇస్తూ, ఎన్నికల ముందు మరో రూ.వేయి మాత్రమే పెంచిందని పలువురు బాధితులు వాపోయారు. రెండు మూడేళ్లలో చచ్చిపోయేవాళ్లం కదా ఆ మాత్రం కూడా ప్రభుత్వానికి కనికరం లేదంటే ఏమనుకోవాలని ఆవేదనగా వాపోయారు. అదీగాక రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది వరకూ బాధితులుండగా, కేవలం 3,500 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నట్టు బాధితులు చెప్పుకొచ్చారు. జగన్ హామీతో బాధితుల్లో భరోసా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కిడ్నీ, గుండెజబ్బులు, తలసీమియా వంటి బాధితులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తామన్న వైఎస్ జగన్మోహనరెడ్డి హామీతో బాధితుల్లో కాసింత భరోసా వచ్చింది. మందులకయ్యే వ్యయం మొత్తం తామే భరించి పెన్షన్ రూ.10 వేలు చేస్తే అంతకంటే తమకు కావాల్సింది ఏముంటుందని ఉద్దానం ప్రాంత బాధితులు అంటున్నారు. ప్రస్తుతం కొంతమంది బాధితులకే పెన్షన్ వస్తోందని, జగన్ వస్తే బాధితులందరికీ పెన్షన్ ఇస్తారన్న ఆశతో ఉన్నట్టు అక్కడి బాధితులు చెబుతున్నారు. అత్యవసరమైతే విశాఖ వెళ్లాల్సిందే గత కొంతకాలంగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాను. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అత్యవసరం అనుకుంటే విశాఖ వెళ్లి డయాలసిస్ చేయించుకోవాలి. మందులు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఈ బాధలు పగవాడికి కూడా వద్దు. రూ.2,500 ఇస్తున్న పెన్షన్‌కు మరో వెయ్యి పెంచారు. ఇది ఏమూలకు సరిపోతుంది? . –అప్పలస్వామి, గొల్లమూకన్న పల్లి, పలాస ఎక్కువ రోజులు బతకబోమని తెలిసి కూడా.. నా భార్య జయలక్ష్మి ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటోంది. మందులు సరిగా అందడం లేదు. పెన్షను 3,500 ఇస్తే, ఒక్కసారి డయాలసిస్‌కు వస్తే ఖర్చవుతోంది. మేము ఎక్కువ రోజులు బతకమని తెలిసి కూడా రూ.3,500 పెన్షన్ మాత్రమే ఇవ్వడం బాధిస్తోంది. –కోటేశ్వరరావు, (కిడ్నీ బాధితురాలు జయలక్ష్మి భర్త), అక్కుపల్లి, ఉద్దానం – గుండం రామచంద్రారెడ్డి, ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఉచిత మందులపై అవగాహన కల్పించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఉచితంగా అందజేస్తున్న మందులపై మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి సూచించారు. ఉద్దానంలో మందుల పంపిణీ అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయట మార్కెట్లో మందులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని వివరించాలన్నారు. ప్రస్తుతం 22 రకాల మందులను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రత్యేకంగా మరో ఆరు రకాలు ఉండాలని, వీటిలో ఒక రకాన్ని ఈ వారం నుంచి అందజేస్తామని పేర్కొన్నారు. వీటిపై గ్రామస్థాయిలో కమిటీలు వేసి, ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల అధికారులు ఆయా ప్రాంతాల ప్రైవేటు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కలిగించాలని తెలిపారు. ప్రతి పంచాయతీ స్థాయిలో నోడల్ అధికారిని ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. కిడ్నీకి వ్యాధి గ్రస్తులకు శుద్ధ జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏడు మదర్ ఆర్వో ప్లాంట్లు, ఏడు మండలాల్లో 128 గ్రామాలకు చెందిన 1,89,010 మంది జనాభాకు ప్రయోజనం చేకూర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాకు నెఫ్రాలజిస్టులను ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 పి.రజనీకాంతరావు, డీఆర్డీఏ పీడీ జి.సి.కిషోర్‌కుమార్, డీసీహెచ్ డాక్టర్ బి.సూర్యారావు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ నాయక్, అడిషినల్ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వై.వెంకటేశ్వరరావు, ఇమ్యూనైజేషన్ అధికారి బి.జగన్నాథరావు, గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీరు టి.శ్రీనివాసరావు ఉన్నారు. -
జనం పరిస్థితి అధ్వానం ఇది మన'ఉద్ధానం'
- కృష్ణమ్మ, తుంగభద్ర తీరాన కిడ్నీ వ్యాధులతో అవస్థలు - నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో జనం వెతలు - గువ్వలగుట్ట, యాపదిన్నెలో దారుణ పరిస్థితి మేకల కల్యాణ్‌చక్రవర్తి, వర్ధెల్లి వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్: పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. చుట్టూ కృష్ణా నది.. ఆహ్లాదకర వాతావరణం.. మధ్యలో గువ్వలగుట్ట. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న ఈ ఊరు కిడ్నీ సంబంధ వ్యాధులతో వణికిపోతోంది. ఊరి జనాభా దాదాపు 600 కాగా.. అందులో సగానికి సగం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ చుట్టుబెడుతోంది ఈ వ్యాధి. ఇక్కడే కాదు.. తుంగభద్ర తీర ప్రాంత పల్లెలనూ ఈ మాయరోగం వెంటాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా ఐజా, ఇటిక్యాల, మనోపాడు మండలాల ప్రజలు కిడ్నీ వ్యాధులతో నానా గోస పడుతున్నారు. ఐజా మండలం యాపదిన్నె గ్రామంలో 600 కుటుంబాలు ఉండగా.. ప్రతి మూడు ఇళ్లకు ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్నారు. గత నాలుగేళ్లలో ఏకంగా 17 మంది చనిపోయారు. మరో 15 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మరణించిన వారిలో 75 శాతం మంది 40 ఏళ్ల లోపు యువతే. ఈ రెండు పల్లెల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల వెతలు శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో పరిస్థితిని తలపిస్తున్నాయి. చెంతనే కృష్ణా.. అయినా సుద్దనీరు కృష్ణానది బ్యాక్‌వాటర్ ఒడ్డున ఉంటుంది గువ్వలగుట్ట. ఇక్కడ నివసించేవారికి ప్రతిరోజూ కృష్ణమ్మ దర్శనమిస్తూనే ఉంటుంది. కానీ 15 ఏళ్ల నుంచి ఈ ఊళ్లో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ కిడ్నీల వ్యాధి బారిన పడుతున్నారు. తలాపునే కృష్ణమ్మ ఉన్నా ఆ నీరు వచ్చే పరిస్థితి లేక సుద్ద నీళ్లు తాగుతున్నారు. దీంతో సగానికిపైగా గ్రామస్తులు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వాంతులతో ప్రారంభమై నడుము నొప్పి వచ్చిందంటే ఇక వాళ్లు కిడ్నీ డాక్టర్ బాట పట్టాల్సిందే. ఊరిలో ఇప్పటికే 100 మంది కిడ్నీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఇక్కడి మహిళలు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారంటే అనారోగ్య సమస్యలతో అనివార్యంగా గర్భసంచి తీయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల్లో నిస్సత్తువ ఆవరిస్తోంది. చాలామంది ఎక్కువ సేపు నడవలేరు. పని చేయలేరు. కనీసం మాట్లాడనూ లేరు. ‘సాక్షి’ ప్రతినిధి వెళ్లిన సమయంలో ఊళ్లో.. 150–200 మంది వరకు ఉన్నారు. మిగతా వారు పొలం పనులకు వెళ్లారు. ఊళ్లోని మాలచ్చమ్మ గుడి వద్దకు ఓ 70 మంది వరకు వచ్చారు. వారితో అక్కడే 20–25 నిమిషాలు మాట్లాడిన తర్వా త చూస్తే 70 శాతం మంది కింద కూర్చుండిపోయారు. అంతలో ఓ 40 ఏళ్ల మనిషి మాట్లాడుతూ.. ‘‘చూసిండ్రా సారూ...! మీరు మాట్లాడుతుంటేనే అందరూ ఎలా కూర్చున్నారో.. పట్టుమని పది నిమిషాలు కూడా మేం నిలబడలేం. కాళ్లు నొప్పులు వచ్చినందుకే కూర్చున్నాం..’’ అని అన్నాడు. పోలీసులు ప్లాంట్ ఇచ్చినా.. కరెంటు లేక.. గువ్వలగుట్టలో కిడ్నీల సమస్య ఉందని తెలియడంతో గతంలో ఎస్పీగా పనిచేసిన విక్రమ్‌జిత్ దుగ్గల్ ఓ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఇప్పుడు ఊళ్లో లేదు. ఎందుకంటే ప్లాంట్ పనిచేసేందుకు తగినంత కరెంటు కూడా రావడం లేదు. తక్కువ వోల్టేజీ కరెంటుతో ప్లాంట్ నడవకపోవడం, స్థానికులకు మెయింటెనెన్స్ తెలియకపోవడంతో మళ్లీ పోలీసులే వచ్చి ప్లాంటును తీసుకెళ్లారు. ఈ ఊరు కంబాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. కంబాలపల్లిని గ్రామజ్యోతి కింద రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. అయినా పక్కనున్న గువ్వలగుట్టలో విద్యుత్ పరిస్థితి మెరుగుపడలేదు. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల చిన్నచూపు, అధికారుల నిర్లక్ష్యం కలిసి మా జీవితాల్ని ఆగమాగం చేస్తున్నయ్. – రమావత్ సక్రు, గువ్వలగుట్ట నుంచి మొదటి గ్రాడ్యుయేట్ 30 వేలు తీసుకొని ఆపరేషన్‌కు రమ్మన్నారు నాకు కిడ్నీ సమస్య ఉంది. నొప్పితో కనీసం పడుకునే పరి స్థితి కూడా లేదు. హాస్పిటల్‌కు పోతే ఆపరేషన్‌కు రూ.30 వేలు తీసుకుని రమ్మన్నారు. ఊరంతా ఇదే సమస్య. –వడ్త్యా రవి, గువ్వలగుట్ట అన్నం కాదు.. మంచినీళ్లు ఇవ్వండి.. మాకు బస్సొద్దు. ఇళ్లూ వద్దు. ఏమీ వద్దు.. అన్నం లేకున్నా సరే.. మంచినీళ్లు ఇవ్వండి. అవి వస్తేనే బతుకుతాం. ఇట్లాగే ఉంటే మేం 40 ఏళ్లు కూడా బతకడం కష్టమే. అది కూడా డబ్బులు పెడితేనే. లేదంటే ఎప్పుడు పోతామో తెలియదు. – ముడావత్ లక్ష్మణ్, గువ్వలగుట్ట యాపదిన్నె యాతన ఇదీ.. ‘సాక్షి’ ప్రతినిధి యాపదిన్నెకు వెళ్లినరోజున జయలక్ష్మి అనే మహిళ ఇంట్లో దశదిన ఖర్మ చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆమె కిడ్నీ వ్యాధి బారిన పడి మరణించింది. ఉన్న రెండెకరాలు అమ్మి వైద్యం చేయించుకుంది. ప్రతి మూడ్రోజులకు ఓసారి మహబూ బ్‌నగర్ వెళ్లి డయాలసిస్ చేయించుకొని వచ్చేది. చివరికి ఆసుప త్రిలో చికిత్స పొందుతూనే మరణించింది. ఈ ఊరి పక్కన నుంచే తాండవ వాగు పారుతుంది. వాగుల్లో నీళ్లున్నప్పుడు ఊళ్లో బోర్లు పోస్తాయి. లేదంటే వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకోవా ల్సిందే. చేను చెలకల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పంట పొలాల్లో ఉన్నంతసేపు రైతులు నీళ్లు తాగటం లేదు. తీవ్ర అలసట, డీహైడ్రేషన్‌తో కండరాల నొప్పుల బారిన పడుతున్నారు. ఒంటి నొప్పుల నివారణకు ఇంజెక్షన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. కూర్చున్నా.. నిల్చున్నా.. నడుంనొప్పి నాకు కిడ్నీ రోగం వచ్చి ఆరు నెలలు దాటింది. కూర్చున్నా.. నిలబడ్డా నడుంనొప్పి వస్తోంది. ఎప్పుడూ నడవాలనిపిస్తది. కానీ నడవటానికి చేతకాదు. ఇప్పుడే మొదలైందట. నెలకు రూ 3వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నా. – చాకలి రాములు, యాపదిన్నె నాకు, నాయినకు కిడ్నీ జబ్బు.. మా నాయిన కిడ్నీ రోగంతోనే ఉన్నడు. ఇప్పుడు నాకు కూడా ఉన్నట్లు తేలింది. మా అన్న పొలం లో ఏడు గంటలు పని చేస్తడు. నేను రెండు గంటలు కూడా చేయలేకపోతున్న. నాయిన మంచం మీదనే ఉన్నడు. మందులు తింటుండు కానీ ఎక్కువ రోజులు కాలం గడుపుడు కష్టమే అనిపిస్తంది. – బొర్ల కిష్టన్న, యాపదిన్నె రోగం కమ్ముకొస్తోంది పిలగాళ్లు సూత్తానికి బాగానే కనిపిస్తున్నరు. కానీ లోపల నుంచి రోగం కమ్ముకొస్తోంది. ఇప్పటికే 20 మందికి పైగా చనిపోయారు. ఊర్లే ఇంకో 15.. 20 మందికి రోగం ఉంది. ఇంకా ఎంత మందికి ఉందో తెల్వదు. ఈ రోగం మా ఎమ్మట ఎందుకు పడ్డదో అర్థం కాట్లేదు. – రామకృష్ణ, గ్రామపెద్ద, యాపదిన్నె ఈ చిత్రంలో కనిపిస్తున్న బాబు పేరు మేరావత్ లక్ష్మణ్. 12 ఏళ్లుంటాయి. చిన్నతనంలోనే కిడ్నీల వ్యాధి బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆయన తల్లిదండ్రులు ఇల్లు, పొలం అమ్ముకున్నారు. 100 జీవాలూ అమ్ముకున్నా రు. ఇప్పుడు వేరే ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. 10 నెలల క్రితం లక్ష్మణ్ హైదరాబాద్ నిమ్స్‌లో చేరాడు. అయినా ఫలితం లేకపోవడంతో లాభం లేదని ఇంటికి తెచ్చారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న పాప పేరు ముడావత్ స్వప్న. వయసు ఐదేళ్లు. ఆపకుండా ఏడుస్తుంటే ఏమైందని ‘సాక్షి’ ప్రతినిధి అడగ్గా.. ‘‘ఏముంది సారూ..! మాయదారి కిడ్నీ జబ్బే. కొంచెం దూరం కూడా నడవలేదు. ఎప్పుడూ ఎత్తుకునే ఉండాలి. నాలుగడుగులు వేస్తే రొప్పుతుంది. ఒకటే ఏడుస్తుంది..’’ అని చిన్నారి అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఈసారి ఓట్లకొస్తే గడగొయ్యలే మా ఊరికి ఎమ్మెల్యే రాడు.. ఎంపీ రాడు.. ఎవ్వరూ రారు. ఓట్ల సమయంలో వచ్చి మాలచ్చమ్మ గుడి దగ్గర మీటింగ్‌లు పెట్టి ప్రమాణాలు చేస్తరు. కానీ ఆ తర్వాత పట్టించుకోరు. ఈసారి ఓట్ల కోసం వస్తే గడగొయ్యలే అందుకుంటం. కృష్ణానది రోజూ కనపడుతుంది. కానీ, మా కడుపులోకి పోయేది మాత్రం సుద్ద నీళ్లు..అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.