మాటిచ్చా.. పాటించా | AP CM YS jagan Comments About His Prajasankalpayatra guarantees given to public | Sakshi
Sakshi News home page

మాటిచ్చా.. పాటించా

Published Sat, Sep 7 2019 4:28 AM | Last Updated on Sat, Sep 7 2019 11:23 AM

AP CM YS jagan Comments About His Prajasankalpayatra guarantees given to public - Sakshi

శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో నాణ్యమైన బియ్యాన్ని మహిళకు అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు

నా పాదయాత్రలో ప్రతి ఒక్కరు చాలా ఆవేదనతో చెప్పిన ఆ మాటలు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్‌ అందడం లేదని, డబ్బులు సరిపోవడం లేదని చెప్పారు. మీరు చెప్పిన ఆ ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితుల పింఛన్‌ రూ.10 వేలకు పెంచాం. స్టేజి –3 దశ నుంచి కిడ్నీ బాధితులకు స్పెషల్‌ ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’...అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ప్రజలకు గట్టి భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లోనే ‘‘నేను నెరవేర్చా..’’ అని అభినందనలు అందుకుంటున్నారు. ఒక్కొక్క హామీని వడివడిగా అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీతో ముఖ్యమంత్రి జగన్‌ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాసే దుస్థితికి స్వస్తి పలికారు. కిడ్నీ వ్యాధులతో తల్లడిల్లుతున్న ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మూత్రపిండ సమస్యలతో అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు స్టేజ్‌–3 దశ నుంచే నెలకు రూ.5,000 చొప్పున ప్రత్యేక పెన్షన్‌ను ప్రకటించారు. కిడ్నీ పేషెంట్లు, వారి సహాయకులకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. తిత్లీ తుపాన్‌ బాధితులకు పెంచిన పరిహారం పంపిణీని ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించారు. మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీని 50 శాతం పెంచి మాట నిలబెట్టుకున్నారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కిడ్నీ బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని స్టేజ్‌ – 3 దశ నుంచే వారికి పెన్షన్‌ను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు చొప్పున పింఛన్‌ అందచేస్తామని తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల (సీకేడీ) బారిన పడ్డ ప్రతి 500 మంది రోగులకు ఒక హెల్త్‌ వర్కర్‌ను నియమిస్తామని, కిడ్నీ బాధితులతోపాటు సహాయకులకు కూడా ఉచితంగా బస్‌ పాస్‌ అందిస్తామని చెప్పారు. కిడ్నీ రోగులకు ఉచితంగా ల్యాబ్‌ పరీక్షలతోపాటు నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా ఉద్దాన ప్రాంత ప్రజల కోసం రూ.600 కోట్లతో నిర్మించనున్న శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్టు, పలాసలో రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం గడపగడపకూ నాణ్యమైన రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే....

స్టేజి –3 నుంచి రూ.5 వేలు ‘స్పెషల్‌’ పింఛన్‌ 
నా పాదయాత్రలో ప్రతి ఒక్కరు చాలా ఆవేదనతో చెప్పిన ఆ మాటలు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్‌ అందడం లేదని, డబ్బులు సరిపోవడం లేదని చెప్పారు. మీరు చెప్పిన ఆ ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితుల పింఛన్‌ రూ.10 వేలకు పెంచుతూ   సంతకం చేశా. కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ తెస్తానని ఆరోజే చెప్పా. చెప్పినట్లే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నానని సగర్వంగా చెబుతున్నా. ఈ ఆసుపత్రి పెట్టడమే కాదు కిడ్నీ బాధితులకు ఇంకా మంచి చేయడానికి అడుగులు వేస్తాం. స్టేజి 5 స్థాయిలో డయాలసిస్‌ జరుగుతున్న పేషంట్లకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం. మీ డాక్టర్‌ (ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు) కోరిక మేరకు స్టేజి–3 దశ నుంచి కిడ్నీ బాధితులకు స్పెషల్‌ ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని ప్రకటిస్తున్నాం. కిడ్నీ బాధితులను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పడమే కాదు చేసి చూపిస్తాం. ప్రతి 500 మంది సీకేడీ పేషెంట్లకు ఒక హెల్త్‌ వర్కర్‌ను ఈరోజు నుంచే నియమిస్తున్నాం. హెల్త్‌ వర్కర్లు కిడ్నీ పేషెంట్లకుతోడుగా ఉంటారు. కిడ్నీ పేషంట్లతోపాటు ఒక అటెండెంట్‌కు కూడా ఉచితంగా బస్‌ పాస్‌ ఇస్తాం. ల్యాబ్‌ల్లో టెస్టులు కూడా ఉచితంగా చేస్తారు. ఇక మీదట నాణ్యమైన మెడిసిన్లు అందుబాటులోకి తెస్తాం. 

ఆ పరిస్థితి రాకూడదంటే..
ఒక మనిషి కిడ్నీ సమస్యలతో బాధపడకుండా చూడాలంటే అందుకు మూల కారణాలు, ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలనే దిశగా ఆలోచించి అడుగులు వేయాలి. అది జరగాలంటే మొత్తం ఉద్దానం ప్రాంతమంతటికీ శుద్ధ జలాలు అందాలి. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని 827 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లో ప్రతి ఒక్కరికీ నేరుగా శుద్ధమైన తాగునీరు అందించేందుకు రూ.600 కోట్లతో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేస్తూ అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పలు పథకాలు ప్రవేశపెట్టాం.

మత్స్యకారుల కోరిక మేరకు జెట్టీ నిర్మాణం
ఆ రోజు నా పాదయాత్రలో మత్స్యకార సోదరులు ఫిషింగ్‌ జెట్టీ కావాలని అడిగారు. వారి విన్నపాలను గత పాలకులు పట్టించుకోలేదు. వారి సమస్యలు విని నేనున్నానంటూ నాడు భరోసా ఇచ్చా. ఈరోజు మంచినీళ్లపేట, నువ్వులరేవులో ఫిషింగ్‌  జెట్టీ పెడుతున్నాం. మత్స్యకార సోదరుల కోసం జెట్టీ నిర్మాణంతోపాటు అక్కడే అన్ని వసతులు కల్పిస్తాం. పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన హాలు ఏర్పాటు చేస్తాం. షెడ్డులు, బాత్‌రూమ్‌లు నిర్మిస్తాం. మార్కెట్‌ చేసుకునేందుకు అనుమతి ఇస్తాం. కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులోకి తెస్తాం. మత్స్యకార దినోత్సవం సందర్భంగా పడవలు, బోట్లు ఉన్న మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఇవ్వబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తెచ్చాం.

ఎస్టీ కుల ధ్రువీకరణకు వన్‌మ్యాన్‌ కమిషన్‌
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియాలు మాకు ఎస్టీ సర్టిఫికెట్లు రావడం లేదన్నా అని ఆ రోజు చెప్పారు. ఆ మాటలు నేను మర్చిపోలేదు. ఆ రోజే చెప్పా నేను విన్నాను... నేను ఉన్నాను అని. వారికి మంచి చేసేందుకు వన్‌మ్యాన్‌ కమిషన్‌ను జేసీ శర్మ ఆధ్వర్యంలో నియమిస్తున్నాం. బుడగ జంగాల వాళ్లకు కూడా ఒక మాట చెప్పాం. వీరిద్దరి సమస్యలను పరిగణనలోకి తీసుకొని మంచి చేసేందుకు జేసీ శర్మ కమిషన్‌ జీవో నంబర్‌. 104 నిన్ననే  జారీ చేశారని చెబుతున్నా.


సంక్షేమ ప్రణాళిక ..
మా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ వేదిక నుంచి సగర్వంగా చెబుతున్నా. మా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి మాటను ఒక ఖురాన్‌లా, ఒక భగవద్గీతలా, ఒక బైబిల్‌లా భావిస్తామని ఆ రోజు చెప్పా. ఆ మాట ప్రకారం అడుగులు వేస్తున్నామని మరోసారి సగర్వంగా చెబుతున్నా. ఇందులో భాగంగానే ఈ సెప్టెంబర్‌ చివరికల్లా ఆటో, ట్యాక్సీలను సొంతంగా నడుపుకొనే ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున ఇవ్వనున్నాం. అవ్వా తాతల పెన్షన్‌ కూడా రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్తాం. అక్టోబర్‌ 15న రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున ఇస్తాం. 

ప్రతి పథకం డోర్‌ డెలివరీ..
ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల వ్యవధిలో 4 లక్షల ఉద్యోగాలిచ్చాం. అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామ వలంటీర్లను నియమించాం. వీరికి రూ.5 వేల చొప్పున వేతనం అందిస్తున్నాం. పింఛన్‌ దగ్గర నుంచి బియ్యం పంపిణీ దాకా, అమ్మ ఒడి నుంచి రైతు భరోసా దాకా, ఇళ్ల పట్టాల నుంచి ఇళ్ల స్థలాల దాకా ఎవరి చుట్టూ తిరగకుండా,  లంచాలివ్వాల్సిన పనిలేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి మీ తలుపుతట్టి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని సగర్వంగా చెబుతున్నాం. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్‌ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. ప్రతి పథకం డోర్‌ డెలివరీ చేస్తాం. పింఛను కావాలన్నా, రేషన్‌ కావాలన్నా, ఇళ్లు కావాలన్నా... మరే పథకం కావాలన్నా వలంటీర్లే నేరుగా దరఖాస్తు చేయిస్తారు. రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. 

మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ 50 శాతం పెంపు
సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని నవంబర్‌ 21న చేపట్టనున్నాం. డీజిల్‌ సబ్సిడీ ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియక అవస్థలు పడుతున్న ప్రతి మత్స్యకారుడికి చెబుతున్నా. ప్రతి జిల్లాలో కొన్ని బంకులను ఎంపిక చేస్తున్నాం. ఇక్కడ బెండి వద్ద ఉన్న బంకులో మత్స్యకారులు డీజిల్‌ తీసుకుంటే అక్కడే సబ్సిడీ అందుతుంది. రూ.6 ఉన్న సబ్సిడీని 50 శాతం పెంచి రూ.9 చొప్పున ఇస్తాం. డిసెంబర్‌ 21న నేరుగా చేనేత కుటుంబాల ఇంటి వద్దకే వెళ్లి రూ. 24 వేలు అందజేస్తాం. జనవరి 26న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి రూ.15 వేలు చొప్పున తల్లుల చేతికి అందిస్తాం. పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం. లాడ్జింగ్, బోర్డింగ్‌ కింద విద్యార్థికి రూ.20 వేలు చొప్పున అందజేస్తాం.

వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ.. 
శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తాం. వంశధారపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతాం. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును పరుగులు  తీయిస్తామని ఇదే వేదిక నుంచి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నారాయణ పురం ఆనకట్ట, తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల్లో ముందడుగు వేస్తామని మాటిస్తున్నా’’
సభలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, పార్టీ నాయకులు తలశిల రఘురాం, ఉన్నతాధికారులు జవహర్‌రెడ్డి, కోన శశిధర్, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, కలెక్టర్‌ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.   

నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం
శ్రీకాకుళం జిల్లా నుంచి పైలెట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీ పథకానికి పలాస సభలో సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ‘నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో బియ్యం పంపిణీ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాం. రేషన్‌ షాపుల్లో తినగలిగే స్వర్ణ బియ్యాన్ని పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏప్రిల్‌ నుంచి 100 శాతం స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలకు నాణ్యమైన బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. 

తిత్లీ బాధితులకు పెంచిన పరిహారం పంపిణీ
ఏడాది క్రితం తిత్లీ తుపాన్‌లో తీవ్రంగా నష్టపోయిన ఉద్దాన రైతులకు పెంచిన పరిహారం రూ.150 కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని పలాస సభలో ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టారు. కొబ్బరి చెట్టుకు పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచి చెక్కు రూపంలో అందించారు. హెక్టారు జీడి తోటలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచిన పరిహారం అందజేశారు. 9 మంది తిత్లీ బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్టుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచాం. శుక్రవారం నుంచే మిగతావారికి కూడా చెక్కుల పంపిణీ మొదలవుతుంది’ అని తెలిపారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం పంచాయతీలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్‌ ఐటీ) చేరుకుని రూ.28 కోట్లతో నిర్మించిన అకడమిక్‌ భవనం, వసతి గృహం, మెస్‌తోపాటు పైలాన్‌ను ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురం పంచాయతీ కేజీబీవీ పాఠశాల సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ మోడ్రన్‌ కిచెన్‌ను ప్రారంభించారు. అనంతరం అక్షయపాత్ర వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్‌లో విశాఖకు తిరుగుపయనమయ్యారు.

అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు... 
షాపులు కలిగిన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఫిబ్రవరి చివరి వారంలో రూ.10 వేలు చొప్పున ఇస్తాం. మార్చి చివరి వారంలో అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు చేయూత అందిస్తాం. ఉగాది రోజు అక్కచెల్లెమ్మలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం. ఏప్రిల్‌ 2 శ్రీరామనవమి సందర్భంగా పెంచిన వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకం అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు పెంచి ఇవ్వబోతున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులను నేరుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాలో వేస్తాం. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే డబ్బులు పాత అప్పుల కింద జమ కాకుండా నేరుగా వారికే దక్కేలా చేస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 చట్టాలు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గత పాలకులు మాటలు చెప్పి మభ్యపెట్టారు. నేను అందుకు భిన్నంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపిస్తున్నా. నామినేటేడ్‌ పోస్టుల్లో 50 శాతం వారికే కేటాయించేలా చట్టం తెచ్చాం. 

మాట ప్రకారం శంకుస్థాపన...

పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్, సమగ్ర రక్షిత మంచినీటి పథకాల శంకుస్థాపన సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు  

‘‘మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి తోడు, దీవెనలతో ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 151 సీట్లలో అఖండ మెజార్టీతో గెలిపించారు. 50 శాతం పైచిలుకు ఓటుబ్యాంకుతో మీ తమ్ముడిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు శిరస్సు వంచి పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు. 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో తిరిగా. మీ సమస్యలను విన్నాను, చూశాను. ఆరోజు మీకు నేనున్నా అని చెప్పా. వంద రోజులు తిరగక ముందే ఈరోజు మళ్లీ మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపన చేయగలుగుతున్నానంటే.. మీరంతా ఇచ్చిన ఈ గౌరవానికి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement