ముత్యాలపేటలో కొబ్బరి మదర్ ప్లాంట్ పరిశీలన చేస్తున్న రేష్మి డీఎస్, బీవీకే భగవాన్
సాక్షి,కవిటి(శ్రీకాకుళం): ఉద్దానం కొబ్బరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా దేశవ్యాప్తంగా నాణ్యమైన మొక్కలు అందించేందుకు జాతీయ కొబ్బరి బోర్డు, రాష్ట్ర ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని సీడీబీ డిప్యూటీ డైరెక్టర్ రేష్మి డీఎస్ అన్నారు. ఆమె గురువారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈస్ట్‌కోస్ట్ టాల్ వెరైటీలో ఎంపిక చేసిన మదర్ ప్లాంట్ క్షేత్రాల్ని తనిఖీ చేసేందుకు అంబాజీ పేట ఉద్యానవన వర్సిటీ కొబ్బరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె కవిటి మండలంలోని ముత్యాలపేట, డి.గొనపపుట్టుగ, కవిటి గ్రామాల్లో కొత్త మొక్కల తయారీకి ఆసక్తి కనబరిచిన రైతుల వ్యవసాయ క్షేత్రాల్ని పరిశీలించారు. ఈ పథకంలో చిక్కాఫ్ సంస్థ ఆధ్వ ర్యంలో రైతులు 10 లక్షల కొబ్బరిచెట్లు పెంచుతున్నామన్నారు. వీటిలో తొలిదశలో 5000 మదర్‌ప్లాంట్‌ల నుంచి ఎంపిక చేసిన విత్తన మొక్కల్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంచాలన్న ఒప్పందం రైతులకు, కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు(సీడీబీ)కు కుదురుతుందన్నారు.
ఆ మేరకు తొలిదశ ఎంపిక జరిగిందన్నారు. ఎంపిక చేసిన మదర్‌ప్లాంట్‌లకు మూడోదశ తనిఖీ బృందం ట్యాగ్‌లను ఇచ్చి నంబర్లు కేటాయిస్తుందన్నా రు. ఆ ట్యాగ్ నంబర్లతో పాటు రైతు చిరునామా, ఫోన్ నంబర్ సీడీబీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అవసరమైన రైతు లు నేరుగా సంబంధిత రైతులను సంప్రదించి స్థానిక మార్కెట్ ధరకు అదనంగా 30శాతం చెల్లించి మదర్‌ప్లాంట్ మొక్కల విత్తన పండ్లు కొనుగోలు చేయడం ఈ పథకం ఉద్దేశమని సీడీబీ ఏపీ టెక్నికల్ ఆఫీసర్ ఎం.కిరణ్‌కుమార్ వివరించారు.
చదవండి: AP: సినిమా టికెట్ల కలెక్షన్లు.. ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలోకి
’