అల్లం, వెల్లుల్లి పొడులు వస్తున్నాయ్‌! | Ginger and garlic powders are coming! | Sakshi
Sakshi News home page

అల్లం, వెల్లుల్లి పొడులు వస్తున్నాయ్‌!

Published Thu, Sep 7 2017 2:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

అల్లం, వెల్లుల్లి పొడులు వస్తున్నాయ్‌! - Sakshi

అల్లం, వెల్లుల్లి పొడులు వస్తున్నాయ్‌!

సీఎఫ్‌టీఆర్‌ఐ పరిజ్ఞానంతో అందుబాటులోకి
- హైదరాబాద్‌ శివారులో ప్రాసెసింగ్‌ యూనిట్‌
చింతపండుతోనూ పొడి తయారీ 
కల్తీలేని కారం, పసుపు పొడుల తయారీకి ఉద్యానశాఖ ఏర్పాట్లు
నేడు సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తలతో అధికారుల భేటీ
 
సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు మనం అల్లం, వెల్లుల్లి మిశ్రమం, మామూలు చింతపండును చూశాం. ఇకనుంచి అల్లం, వెల్లుల్లి, చింతపండు పొడులను వేర్వేరుగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) సహకారంతో రాష్ట్రంలో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ శివారు మేడ్చల్‌ జిల్లా దూళ్లపల్లి వద్ద 16.5 ఎకరాల్లో కల్తీలేని నాణ్యమైన సుగంధ ద్రవ్యాల యూనిట్‌ను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారం సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఉద్యానాధికారులతో సమావేశం కానున్నారు. రూ.6 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.6 కోట్లలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, మిగిలిన సొమ్మును కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి కేటాయిస్తారు. 
 
సుళువుగా పొడులు.. 
అల్లం, వెల్లుల్లి మిశ్రమం, చింతపండును నిల్వ ఉంచడం కష్టమైన వ్యవహారం. ఫ్రిజ్‌లో ఉంచినా కొంతకాలం తర్వాత పాడవుతాయి. పైగా వినియోగించేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ప్రత్యామ్నాయంగా పొడులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఎఫ్‌టీఆర్‌ఐ సిద్ధం చేసింది. దీని ఆధారంగా తయారు చేసే అల్లం, వెల్లుల్లి పొడులను సుళువుగా ఆహార పదార్థాలను వండేప్పుడు వేసుకోవచ్చు. చింతపండు పొడి వల్ల పులుపు కావాలనుకుంటే నేరుగా ఆహార పదార్థాలపై చల్లుకొని వాడుకోవచ్చు. వీటి తయారుకు సంబం«ధించి మైసూరు కేంద్రంగా ఉండే సీఎఫ్‌టీఆర్‌ఐతో రాష్ట్ర ఉద్యానశాఖ ఒప్పందం చేసుకుంది.

సేంద్రియ పద్ధతుల్లో పండించిన నాణ్యమైన అల్లం, వెల్లుల్లి, చింతపండు, మిర్చి, పసుపు పొడులను తయారు చేసే ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సీఎఫ్‌టీఆర్‌ఐ సాయం చేస్తుంది. చింతపండు పొడితోపాటు గుజ్జును తయారు చేసే వీలుంటుంది. కారం, పసుపు పొడులు తయారుచేసే ప్రాసెసింగ్‌ యూనిట్ల సామర్థ్యం రోజుకు 3.6 టన్నులు. అల్లం, వెల్లుల్లి పొడుల తయారు యూనిట్‌ సామర్థ్యం రోజుకు 800 కేజీలు. అలాగే చింతపండు పొడి, మిశ్రమం వేర్వేరుగా తయారు చేసే ఒక్కో యూనిట్‌ సామర్థ్యం రోజుకు 600 కేజీలు. చింతపండు మిశ్రమంతో నేరుగా పులిహోర కూడా తయారు చేసుకోవచ్చు.

అన్నీ కలిపి ఏడాదికి వెయ్యి టన్నులు తయారు చేసేలా ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ ఎండీ ఎల్‌.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తాము తయారు చేసే ఈ సుగంధ ద్రవ్యాలను ముందుగా హాస్టళ్లు, ఆసుపత్రులకు సరఫరా చేస్తామని, తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement