
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టుల కోసం.. పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున భూములు సేకరిస్తున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కావాల్సిన వారి కోసం స్పెషల్ జీవోలు జారీ చేస్తూ, మిగిలిన వారి విషయంలో వాయిదాలు కోరుతుండటాన్ని ఉమ్మడి హైకోర్టు పిల్ కమిటీ ఆక్షేపించింది. ప్రభుత్వాలు నామమాత్రంగా పరిహారం చెల్లిస్తుండటంతో బాధితులు కోర్టులను ఆశ్రయించి పరిహారం పెంపు ఉత్తర్వులు పొందుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో మరోసారి కోర్టుల గడప తొక్కాల్సి వస్తున్న విషయాన్ని గమనించింది.
ఈ నేపథ్యంలో పరిహారం పెంపు నిమిత్తం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ బాధితులు పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ) దాఖలు చేస్తుండటం, ప్రభుత్వాలు పదే పదే వాయిదాలు కోరుతుండటం.. కింది కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి కారణంగా గుర్తించింది. ఈపీల పెండింగ్ విషయాన్ని ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.వెంకటకృష్ణయ్య ఓ లేఖ ద్వారా ఉమ్మడి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ లేఖను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రజా ప్రయోజన వ్యాజ్య (పిల్) కమిటీకి పంపారు. ఈ లేఖను పరిశీలించిన పలువురు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీ, సమస్య తీవ్రతను అర్థం చేసుకుంది. అంతేకాక కావాల్సిన వారికి ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు జారీ చేస్తున్న విషయాన్ని కూడా గమనించింది.
వాయిదాల వల్లే పెండింగ్ కేసులు: పిల్ కమిటీ వెంటనే ఉభయ రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కోర్టుల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈపీ వివరాలను తమ రిజిస్ట్రీ ద్వారా తెప్పించింది. ఈపీల విషయంలో ప్రభుత్వాలు పదే పదే వాయిదాలు కోరుతుండటం వల్లే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడింది. పరిహారం పెంపు ఉత్తర్వుల విషయంలో ప్రభుత్వాలకు విధానపరంగా ఏకరూపత లేకపోవడాన్ని కమిటీ ఎత్తిచూపింది. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మహబూబ్‌నగర్ ప్రధాన జిల్లా జడ్జి లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలని సిఫారసు చేసింది.
ఏసీజే విచారణ: అదే లేఖను పిల్‌గా పరిగణించిన ఏసీజే ఇటీవల విచారణ జరిపారు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం నిప్పులు చెరిగింది. ప్రభుత్వాల పనితీరు ఇలాగే కొనసాగితే, భూ సేకరణ ప్రక్రియను నిలిపేస్తామని స్పష్టం చేసింది. ముందు పరిహారం చెల్లించిన తరువాతే భూ సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేస్తామని కూడా హెచ్చరించింది. అసలు ఉభయ రాష్ట్రాల్లో ఎన్ని ఈపీలు పెండింగ్‌లో ఉన్నాయి.. ఎన్ని కేసుల్లో కోర్టులు నిర్ణయించిన పరిహారం చెల్లించారు.. ఎంత పరిహారం చెల్లించారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని ఉభయ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువునిచ్చింది.
అత్యధిక పెండింగ్ పిటిషన్లు తెలంగాణలోనే: పరిహార పెంపు ఉత్తర్వుల అమలు కోసం బాధితులు దాఖలు చేసిన ఎగ్జిక్యూషన్ పిటిషన్లు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు సంబంధించి 1,029 కేసులు పెండింగ్‌లో ఉంటే, తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించి ఏకంగా 2,003 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో అత్యధికంగా 1204 పెండింగ్ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment