
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌పై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాల మేరకు నివేదిక ఇవ్వకపోవడమే కాక, నివేదిక సమర్పణకు మరింత గడువు కావాలని అఫిడవిట్ రూపంలో కోరకపోవడాన్ని తప్పుపట్టింది. కలెక్టర్ కర్ణన్ తమ ముందు ఏప్రిల్ 3న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మంచిర్యాల జిల్లా, నెన్నల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా, ఆక్రమణదారులు ఆ పాసు పుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రామ్మోహనరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి స్పందిస్తూ, కలెక్టర్ ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది దుర్గారెడ్డి లేచి నివేదిక సమర్పణకు మరింత గడువు కావాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, నివేదిక ఇవ్వకపోవడమే కాక, మరింత గడువు కావాలంటూ అఫిడవిట్ దాఖలు చేయకుండా, మౌఖికంగా కోరడం ఎంత మాత్రం సరికాదంది. ఇటువంటి వాటిని సహించేది లేదంటూ.. కలెక్టర్ కర్ణన్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment