కేసు నమోదులో ఇంత జాప్యమా? | High Court Question to SI ravinder on nerella issue | Sakshi
Sakshi News home page

కేసు నమోదులో ఇంత జాప్యమా?

Published Wed, Oct 11 2017 3:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

సాక్షి, హైదరాబాద్‌: తమను దారుణంగా కొట్టి హింసించారని ఆరోపిస్తూ సిరిసిల్ల సీసీఎస్‌ ఎస్‌ఐ రవీందర్‌పై బాధితులు ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఈ నెల 6 వరకు కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేశారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎందుకు ఎస్సీ, ఎస్టీ చట్ట నిబంధనల కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితులపై పోలీసుల దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బెజ్జారం చంద్రకుమార్‌ రాసిన లేఖపై కూడా హైకోర్టు స్పందించి విచారణ జరుపుతోంది.

ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఎస్సై రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ తెలిపారు. ఘటన ఎప్పుడు జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. జూలైలో జరిగిందని సంజీవ్‌ చెప్పగా, కేసు నమోదు చేసేం దుకు అంత జాప్యం ఎందుకు జరిగిందని నిలదీసింది. ఆగస్టు 10న రవీం దర్‌ను సస్పెండ్‌ చేశామని, ఈ నెల 6న కేసు నమోదు చేశామని సంజీవ్‌ తెలిపారు. రవీందర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ స్పందిస్తూ.. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కోరారు. ఎస్పీ విశ్వజిత్‌ తరపున వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement