Nerella issue
-
కేసు నమోదులో ఇంత జాప్యమా?
సాక్షి, హైదరాబాద్: తమను దారుణంగా కొట్టి హింసించారని ఆరోపిస్తూ సిరిసిల్ల సీసీఎస్ ఎస్ఐ రవీందర్‌పై బాధితులు ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఈ నెల 6 వరకు కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేశారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎందుకు ఎస్సీ, ఎస్టీ చట్ట నిబంధనల కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితులపై పోలీసుల దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ రాసిన లేఖపై కూడా హైకోర్టు స్పందించి విచారణ జరుపుతోంది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఎస్సై రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ తెలిపారు. ఘటన ఎప్పుడు జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. జూలైలో జరిగిందని సంజీవ్ చెప్పగా, కేసు నమోదు చేసేం దుకు అంత జాప్యం ఎందుకు జరిగిందని నిలదీసింది. ఆగస్టు 10న రవీం దర్‌ను సస్పెండ్ చేశామని, ఈ నెల 6న కేసు నమోదు చేశామని సంజీవ్ తెలిపారు. రవీందర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ స్పందిస్తూ.. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కోరారు. ఎస్పీ విశ్వజిత్ తరపున వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
సమర్థించాలిగాని సస్పెండ్ చేస్తారా?
- మంచి కోసమే లాఠీచార్జి చేస్తే ఎస్సై సస్పెన్షన్ ఎందుకు? - నేరెళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ‘సిరిసిల్ల జిల్లా రామచంద్రా పురం, నేరెళ్ల గ్రామస్తులపై లాఠీచార్జి చేసిన పోలీసుల తప్పు లేనప్పుడు ఎస్సైని ఎందుకు సస్పెండ్ చేశారు? శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగానే లాఠీచార్జి చేస్తే ఎస్సై చర్యను సమర్థించాలిగాని సస్పెండ్ చేస్తారా? సస్పెన్షన్‌కు కారణాలేంటి? నేరెళ్ల ఘటనకు కారకులెవరు? ఆ కేసుల్లో నిందితులు ఎవరు? నిందితుల జాబితాలో పోలీసులూ ఉన్నారా? ఉంటే వారిపై ఎందుకు కేసు నమోదు చేయ లేదు? అంత సీరియస్‌గా అందరికీ ఒకేచోట గాయాలు ఎందుకు చేశారు’.. వంటి ప్రశ్నలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎస్సై సస్పెన్షన్ గురించి కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ నివేదిక సమర్పించాలని తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఆదేశించింది. నేరెళ్ల ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం విచారించింది. అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గ్రామస్తులు పోలీసుల్ని కొట్టారని, పోలీ సుల బాధను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ రెండు గ్రామాల జనం గుంపులుగా వచ్చి పోలీసులపై దాడి చేశారని, దీన్ని అడ్డుకునే క్రమంలో లాఠీచార్జి జరిగిందన్నారు. ఘటనలో ఎస్సై అతిగా వ్యవహరించినందునే ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిందన్నారు. తెర వెనుక ఎస్పీ ఉన్నారు: పిటిషనర్ ఎస్పీనే తెర వెనుక ఉండి ఈ దారుణానికి తెర తీశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ కోర్టుకు విన్నవించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. బాధితులకు కరీంనగర్ ఆస్పత్రిలో జరిపిన వైద్య చికిత్సలపై నివేదిక తెప్పించాలని, జైలుకు తరలించినప్పుడు బాధితుల శరీరంపై ఉన్న గాయాలపై జైలు సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని, ఎస్సై సస్పెన్షన్‌పై కరీంనగర్ రేంజి డీఐజీ నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఘటనపై లోతుగా విచారణ చేస్తా మని, నివేదికలు అందాక తదుపరి విచారణ ఈ నెల 30న చేపడతామని పేర్కొంది. -
‘నేరెళ్ల’పై సుప్రీంను ఆశ్రయిస్తాం
ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ నిజస్వరూపాన్ని దేశ ప్రజలకు తెలియచేస్తామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలీసుల అండతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్న తీరును నాయస్థానాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఘటనకు బాధ్యత వహించి ఇప్పటికే సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి కేటీఆర్ గుట్టుగా పర్యటించి కేసును నీరుగార్చే యత్నం చేయడం దారుణమని నారాయణరెడ్డి మండిపడ్డారు.