సమర్థించాలిగాని సస్పెండ్ చేస్తారా?
- మంచి కోసమే లాఠీచార్జి చేస్తే ఎస్సై సస్పెన్షన్ ఎందుకు?
- నేరెళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘సిరిసిల్ల జిల్లా రామచంద్రా పురం, నేరెళ్ల గ్రామస్తులపై లాఠీచార్జి చేసిన పోలీసుల తప్పు లేనప్పుడు ఎస్సైని ఎందుకు సస్పెండ్ చేశారు? శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగానే లాఠీచార్జి చేస్తే ఎస్సై చర్యను సమర్థించాలిగాని సస్పెండ్ చేస్తారా? సస్పెన్షన్‌కు కారణాలేంటి? నేరెళ్ల ఘటనకు కారకులెవరు? ఆ కేసుల్లో నిందితులు ఎవరు? నిందితుల జాబితాలో పోలీసులూ ఉన్నారా? ఉంటే వారిపై ఎందుకు కేసు నమోదు చేయ లేదు? అంత సీరియస్‌గా అందరికీ ఒకేచోట గాయాలు ఎందుకు చేశారు’.. వంటి ప్రశ్నలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఎస్సై సస్పెన్షన్ గురించి కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ నివేదిక సమర్పించాలని తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఆదేశించింది. నేరెళ్ల ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం విచారించింది. అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గ్రామస్తులు పోలీసుల్ని కొట్టారని, పోలీ సుల బాధను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ రెండు గ్రామాల జనం గుంపులుగా వచ్చి పోలీసులపై దాడి చేశారని, దీన్ని అడ్డుకునే క్రమంలో లాఠీచార్జి జరిగిందన్నారు. ఘటనలో ఎస్సై అతిగా వ్యవహరించినందునే ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిందన్నారు.
తెర వెనుక ఎస్పీ ఉన్నారు: పిటిషనర్
ఎస్పీనే తెర వెనుక ఉండి ఈ దారుణానికి తెర తీశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ కోర్టుకు విన్నవించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. బాధితులకు కరీంనగర్ ఆస్పత్రిలో జరిపిన వైద్య చికిత్సలపై నివేదిక తెప్పించాలని, జైలుకు తరలించినప్పుడు బాధితుల శరీరంపై ఉన్న గాయాలపై జైలు సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని, ఎస్సై సస్పెన్షన్‌పై కరీంనగర్ రేంజి డీఐజీ నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఘటనపై లోతుగా విచారణ చేస్తా మని, నివేదికలు అందాక తదుపరి విచారణ ఈ నెల 30న చేపడతామని పేర్కొంది.