సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు వెళ్లి విపత్కర పరిస్థితుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. గల్ఫ్ దేశాలకు బతుకుతెరువు కోసం వెళ్లే రాష్ట్ర వాసుల్లో ఎంతో మంది విపత్కర పరిస్థితుల్లో మరణిస్తున్నారని, దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అందువల్ల వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ‘మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్’ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోతుల రాజిరెడ్డి దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నారని, తన యజమాని పని చేయించుకుని జీతం చెల్లించకపోవడమే ఇందుకు కారణమని పిటిషనర్ల తరఫు న్యాయవాది శశికిరణ్ కోర్టుకు నివేదించారు.
రాజిరెడ్డిని అనాథగా పేర్కొంటూ దుబాయ్‌లోనేఅంతిమ సంస్కారాలు చేసేశారని వివరించారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన దుర్గం భీమయ్య మస్కట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎన్‌కౌంటర్‌లో మరణించారని కోర్టుకు నివేదించారు. పనికోసం వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో భీమయ్యను అక్కడి బోర్డర్ సెక్యూరిటీ అధికారులు కాల్చి చంపారని, దీంతో ఆయన కుటుంబం జీవనాధారం కోల్పోయిందని తెలిపారు. వీరిద్దరికీ పరిహారం చెల్లింపు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు సిఫారసు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన స్పందన రావడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.
‘గల్ఫ్’ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేలా ఆదేశించండి: హైకోర్టు
Published Fri, Dec 6 2013 2:16 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement