
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు రాసిన లేఖ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు అందింది. మూడు పేజీల లేఖను అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ శనివారం ఏసీజే ఇంటికి వెళ్లి అందించారు. ఈ విషయాన్ని ఏసీజే మంగళవారం న్యాయవాదుల సంఘం ప్రతినిధుల వద్ద ధ్రువీకరించారు. నేడు హైకోర్టు న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్ట్ సమావేశం కానుంది.
న్యాయమూర్తులు విభజన విషయంలో అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఫుల్‌కోర్టు నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. కాగా, విభజించే ముందు తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు మంగళవారం ఏసీజేని కలిశారు. దీంతో ఏసీజే వినతిపత్రం సమర్పించాలని వారికి సూచించారు.
హైకోర్టు విభజనకు సంబంధించి ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రస్తావనతో చంద్రబాబు తన లేఖను ప్రారంభించారు. 2015 అక్టోబర్‌లో అప్పటి ఏసీజేకి తాను రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. హైకోర్టు ఏర్పాటు కోసం కొన్ని భవనాలను గుర్తించామని, వాటిని పరిశీలించేందుకు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తన లేఖలో ఏసీజేను కోరారు.
న్యాయమూర్తుల కమిటీ ఈ నెలాఖరుకల్లా భవనాలను పరిశీలించి ఏవైనా మార్పులను సూచిస్తే, వాటిని మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. మార్పులు చేశాక ఏప్రిల్‌లో మరోసారి కమిటీ భవనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తే మేలో తరలింపు మొదలుపెడతామన్నారు. జూన్ 2 నుంచి కొత్త హైకోర్టు పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment