హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రమేశ్ రంగనాథన్
► రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్.బి.బొసాలే బాధ్యతల నుంచి తప్పుకున్న నాటి నుంచి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రధాన న్యాయమూర్తి నిర్వహించే విధులను నిర్వర్తిస్తారని కేంద్రం ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. జస్టిస్ బొసాలే పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే.
జస్టిస్ రమేశ్ రంగనాథన్ 1958 జూలై 28న న్యూఢిల్లీలో జన్మించారు. 1977లో గ్రాడ్యుయేషన్, 1981లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చార్టెర్డ్ అకౌంటెంట్‌గా, కంపెనీ సెక్రటరీగా కూడ ఆయన అర్హత సాధించారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1985 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూలై నుంచి 2004 మే వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు.
ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర ప్రముఖ సంస్థలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. 2005, మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2015 డిసెంబర్ 29 నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.