సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులైన జేకే మహేశ్వరి రేపు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషన్ హరిచందర్ సీజేగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న సీజే ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి (జనవరి 1, 2019) నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. గత 9 నెలలుగా ఏసీజేగా ఆయన విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి సీజే నియామకంతో జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు.
జస్టిస్ మహేశ్వరి నేపథ్యం..
జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్ 28న పదవీ విరమణ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment