AP High Court Chief Justice 2021: Prashant Kumar Mishra As AP High Court CJ - Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

Published Sat, Oct 9 2021 5:38 PM | Last Updated on Sat, Oct 9 2021 7:46 PM

Prashant Kumar Mishra As AP High Court CJ - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నియమితులయ్యారు. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు చీఫ్‌ జస్టిస్‌ల నియామకం జరిగింది. తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌ చంద్రశర్మ నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

జస్టిస్‌ మిశ్రా.. ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు  చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు.

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్‌ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు.  డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా  నియమితులయ్యారు. కాగా, 2021, జూన్‌ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టుకు సీజేగా నియమితులయ్యారు. 

జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ.. 1961, నవంబర్‌ 30వ తేదీన భోపాల్‌లో జన్మించారు. 1984 సెప్టెంబర్‌ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్న సతీశ్‌ చంద్ర శర్మ.. మధ్యప్రదేశ్‌లో ఒక లీడింగ్‌ లాయర్‌గా పేరు గాంచారు. ఆయనకు 42 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సీనియర్‌ అడ్వొకేట్‌గా ప్రమోషన్‌ పొందారు. తద్వారా ఆ రాష్ట్ర హైకోర్టు చరిత్రలో పిన్న వయసులో సీనియర్‌ అడ్వొకేట్‌గా బాధ్యతలు చేపట్టిన అతి కొద్దిమందిలో ఆయన కూడా స్థానం సంపాదించారు. 

2008, జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు అడిషనల్‌ జడ్జిగా నియమితులైన ఆయన.. 2010, జనవరి 10 వ తేదీన పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్నారు. 2020, డిసెంబర్‌ 31న కర్ణాటక హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ అయిన సతీశ్‌ చంద్ర శర్మ.. 2021, జనవరి 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై ఈ ఏడాది, ఆగస్టు 31 వ తేదీ నుంచి కర్ణాటక హైకోర్టుకు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.

చదవండి:
కోస్తాంధ్రకు మరో తుపాను! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement