ఖమ్మం జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై స్టే
* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
* ఎంపీపీ అధ్యక్ష ఎన్నికలపైనా స్టే
* కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం
* విచారణ రెండు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు, ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఖమ్మం జెడ్పీ చైర్మన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరిగాయని, అప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, జిల్లా మొత్తాన్ని యూనిట్లుగా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేశారని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు, ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను తొలగించారని, అందువల్ల తిరిగి రిజర్వేషన్లను ఖరారు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.విజయగాంధీ, కె.రోశిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ శుక్రవారం మరోసారి విచారించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీపీ చైర్మన్ పోస్టును ఎస్సీ మహిళకు కేటాయించారని, దీని వల్ల గాంధీ జెడ్పీపీ చైర్మన్ పోస్టుకు పోటీ చేయలేకపోయారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అలాగే రోశిరెడ్డి కూడా ఎంపీపీ పోస్టుకు అర్హుడని, అందువల్ల కొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సమయంలో పంచాయతీరాజ్ శాఖ తరఫు న్యాయవాది పాండురంగారెడ్డి స్పందిస్తూ, రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు అందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే అప్పటి వరకు ఖమ్మం జిల్లా జెడ్పీపీ చైర్మన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేస్తామని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.