మళ్లీ హైకోర్టుకు ‘ఏపీ ఎన్జీవో’ వివాదం
- మీటింగ్ హాల్, గదుల తాళాలు ఇవ్వడం లేదు: ఏపీ ఎన్జీవో
- సభ్యత్వం ఇవ్వడం లేదన్న భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవో సంఘం భవన వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో ఉన్న సంఘం భవనంలోని మీటింగ్ హాల్, 4 గదులకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం వేసిన తాళాలు తీసి.. వాటిని తమకు అప్పగించాలన్న హైకోర్టు ఆదే శాల్ని ఖాతరు చేయడం లేదని ఏపీ ఎన్జీవో సంఘం కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. గత ఆదేశాల మేరకు తాము ఏపీ ఎన్జీవోలో సభ్యత్వ చందా చెల్లిస్తా మంటే తీసుకోవడం లేదని భాగ్య నగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
సంఘ భవనంలోని గదులకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం వేసిన తాళాలను తమకు అప్పగించాలని గతంలోని హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఏపీ ఎన్జీవో సంఘం తరపు న్యాయవాది చెప్పారు. తాళాలు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని, అయితే తమకు సభ్యత్వం ఇవ్వాలన్న గత ఆదేశాల్ని ఏపీ ఎన్జీవో సంఘం పట్టించుకోవడం లేదని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏపీ ఎన్జీవో సంఘ సభ్యత్వానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ ఎన్జీవో సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.