ఏపీ, టీ ఎన్జీవోల ఘర్షణ | AP, Telangana NGOs quarreled themselves | Sakshi
Sakshi News home page

ఏపీ, టీ ఎన్జీవోల ఘర్షణ

Published Sun, May 17 2015 3:32 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ఏపీ, టీ ఎన్జీవోల ఘర్షణ - Sakshi

ఏపీ, టీ ఎన్జీవోల ఘర్షణ

పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు
 హైదరాబాద్: ఏపీఎన్జీవో నాయకులు, టీఎన్జీవో నాయకుల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. రెండు సంఘాల నాయకుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో కార్యాలయం నినాదాలతో మార్మోగింది. చివరకు ఇరువర్గాలు అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉన్న అధ్యక్షుడు అశోక్‌బాబు వద్దకు తెలంగాణ ఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, ఇతర నాయకులు విచ్చేసి 58/42 రేషియో ప్రకారం గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో తెలంగాణ ఉద్యోగులకు పునర్విభజన చేయాలని సూచించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వాగ్వాదాలు, ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన విచ్చేసి ఇరువురికి నచ్చజెప్పారు. చివరకు ఏపీఎన్జీవో నాయకులు, తెలంగాణ ఎన్జీవో నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.
 
 తాను ప్రధాన కార్యదర్శి బలరాంలు సభ్యులతో కలిసి వినతిపత్రం సమర్పించేందుకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వద్దకు వెళ్లగా.. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి పాల్పడ్డ నిందితులను వెనకేసుకురావడమే కాకుండా సంస్థలోని తెలంగాణ ఉద్యోగులపై వినలేని వ్యాఖ్యలు, బూతు పదజాలంతో దూషిస్తూ, అహంకార ధోరణితో వ్యవహరించారని తెలంగాణ ఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
  కేవలం 58/42 రేషియో ప్రకారం గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో తెలంగాణ ఉద్యోగులకు పునర్విభజన చేయాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమపై అధ్యక్షుడి హోదాలో ఉన్నానన్న గర్వంతోనే ఇష్టానుసారంగా వ్యవహరించి దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో అందరి సమక్షంలో ఏపీఎన్జీవో సిటీ కార్యాలయాన్ని హెచ్‌టీఎన్జీవోస్‌కు కేటాయిస్తానని చెప్పిన అశోక్‌బాబు.. దాన్ని కుట్రపూరితంగానే ఏపీఎన్జీవో మహిళా విభాగానికి కేటాయించడం ఆయన కక్షపూరిత ధోరణికి నిదర్శనమన్నారు. దీనిపై అశోక్‌బాబు మాట్లాడుతూ... తెలంగాణ ఎన్జీవోస్ నాయకులే తమ కార్యాలయానికి విచ్చేసి తమతో ఘర్షణకు దిగారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement