
కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్ రమేశ్ రంగనాథన్. చిత్రంలో జగదీశ్వర్, త్రిపురాన వెంకటరత్నం, జస్టిస్ రమా సుబ్రహ్మణ్యం, షికా గోయల్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలు సమష్టిగా కృషి చేస్తే, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తే బాల్య వివాహాల నియంత్రణ పెద్ద సమస్యే కాదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, ఆర్థిక భారం కారణంగా 15–18 ఏళ్ల వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి భారం దించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న బాల్య వివాహాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్లాజా హోటల్‌లో శనివారం సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలతో వరకట్న వేధింపులు, బాధిత మహిళలకు గృహహింస ఇబ్బందులు పెరుగుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలు, సమస్యలపై తల్లిదండ్రుల్లో మరింత అవగాహన తీసుకొస్తే నియంత్రణ సులువవుతుందని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.
ఒక పెళ్లి.. అనేక సమస్యలు...
చిన్నతనంలోనే పిల్లలకు పెళ్లి చేయడం వల్ల జీవితాం తం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని జస్టిస్ రమా సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఒక పెళ్లి అనేక సమస్యలు సృష్టిస్తోందని, బాల్య వివాహాల వల్ల దేశంలో 78 శాతం బాధిత అమ్మాయిలు హింసను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితం జరిగిన బాల్య వివాహాల్లో 40 శాతం మంది బాధిత మహిళలు విడాకులు తీసుకున్నారని, వితంతువులయ్యారని చెప్పారు. ఇలాంటి పర్యవసా నాలు తగ్గించేందుకు న్యాయ, పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలు, జిల్లా న్యాయ సేవా సంస్థ కలసి పని చేయాలని సూచించారు. పోలీస్ శాఖ తరపున బాల్య వివాçహాల నియంత్రణకు కృషి చేస్తున్నామని, హైదరాబాద్ సౌత్‌జోన్‌లో జరుగుతున్న కాంట్రాక్టు పెళ్లిళ్లపై చర్యలు చేపట్టామని సీఐడీ ఐజీ షికాగోయల్ తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అమలు, పేర్ల నమోదుకు వెబ్‌సైట్ రూపొందిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ చెప్పారు. బాల్య వివాహ నియంత్రణకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తరుణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మమతా రఘువీర్ అభిప్రాయపడ్డారు.
పోలీస్ శాఖ నిర్లక్ష్యం..: మహిళా కమిషన్ చైర్‌పర్సన్
బాల్య వివాహాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లలో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోకుండా పోలీస్‌శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, ఓ కానిస్టేబుల్‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తూర్పారబట్టారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయా ల్సిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ విభాగాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు. పెళ్లి చేసుకున్న జంట మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలని అడిగితే.. ఏ అధికారి వద్ద కూడా సరైన సమాధానం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment