
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా గాయపడి, మృత్యువాత పడినప్పుడు కేసులు నమోదుచేసే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఆ వివరాలని మోటారు ప్రమాద క్రైమ్‌ల ట్రిబ్యునల్‌కు అందజేయ డం లేదనే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హోంశాఖల ముఖ్యకార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది.
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 158 (6) ప్రకారం ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినా, మరణించినా ఆ వివరాల్ని 30 రోజుల్లోగా ట్రిబ్యునల్‌కు తెలియజేయాలనే నిబంధనను ప్రభుత్వాలు పెద్దగా అమలు చేయడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందినలా విద్యార్థి తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రమాద వివరాల్ని ట్రిబ్యునల్‌కు సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తెలియజేయాలని ఎంవీ యాక్ట్ చెబుతోందని పిటిషనర్ యోగేశ్ వాదించారు. సమాచార హక్కు చట్టంతో లభించిన వివరాల ప్రకారం 1995 నుంచి 3.67 లక్షల వాహనాలు ప్రమాదాలకు గురైతే అందులో 27,708 కేసుల సమాచారమే ట్రిబ్యునల్‌కు అందిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.