
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు కార్యదర్శి కె. శివకుమార్ నాయుడికి సింగిల్ జడ్జి విధించిన 30 రోజుల సాధారణ జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగిల్ జడ్జి విధించిన రూ.2 వేల జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇది తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ప్రకటించింది.
గత వారం సింగిల్ జడ్జి జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ శివకుమార్ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్‌రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణకు స్వీకరించింది.శివకుమార్ నాయుడు మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బుచ్చయ్య అనే వ్యక్తి తన ప్రైవేట్ స్థలంలో చేపట్టిన కల్యాణ మంటప నిర్మాణ పనుల కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సింగిల్ జడ్జి ఆయనకు జైలు, జరిమానా విధించిన సంగతి విదితమే.దీనిపై శివకుమార్ అప్పీల్ దాఖలు చేయడంతో ధర్మాసనం ఊరటనిచ్చింది.