
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 8 ఏకలవ్య మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు వేగిరం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 8 స్కూళ్లు నిర్వహిస్తుండగా.. మరో 8 స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. కేంద్రం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతమున్న ఈఎంఆర్ స్కూళ్లకు శాశ్వత భవనాలున్నప్పటికీ వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఈఎంఆర్‌ఎస్‌ల కోసం ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసిన క్రమంలో రాష్ట్రంలోని ఈఎంఆర్‌ఎస్‌లకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర గిరిజన శాఖ కేంద్రానికి నివేదించింది.
సీబీఎస్‌ఈ అనుమతితో: ఇప్పటికే ఉన్న 8 ఈఎంఆర్‌ఎస్‌లకు సీబీఎస్‌ఈ అనుమతులు వచ్చేశాయి. తాజాగా మరో 8 స్కూళ్లను ప్రారంభించాలని ఆ శాఖ నిర్ణయించడంతో వాటికి సీబీఎస్‌ఈ అనుమతులకు అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీటికి కూడా అనుమతులు ఇస్తున్నట్లు సీబీఎస్‌ఈ సమాచారం ఇచ్చింది. ఈఎంఆర్‌ఎస్‌ల నిర్వహణకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు విడుదలవుతున్నాయి. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే ఒక్కో ఈఎంఆర్‌ఎస్‌కు రూ.20 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదు.
వచ్చే ఏడాది సీబీఎస్‌ఈ సిలబస్‌తో ప్రారంభమయ్యే స్కూళ్లు..
సీరోల్, మరిమడ్ల, గాంధారి, ఎల్లారెడ్డిపేట్, కురవి, బాలానగర్, ఇంద్రవెల్లి, గండుగులపల్లి.
Comments
Please login to add a commentAdd a comment