* ప్రత్యేక కోర్టు, పోలీస్‌స్టేషన్, లీగల్ సెల్ ఏర్పాటుచేయాలి
* గిరిజన కార్పొరేషన్‌ను వెంటనే విభజించాలి
* యువజన శిక్షణ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలి
* టీ సర్కార్‌కు గిరిజన సంక్షేమశాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు, తెగలపై అత్యాచారాలు, దాడులకు సంబంధించి కేసులను సత్వరం విచారించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని గిరిజన సంక్షేమశాఖ తెలం గాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులు, పోలీస్‌స్టేషన్లు, విడిగా లీగల్‌సెల్‌ను ఏర్పాటుచేయాలని, స్పెషల్ మేజిస్ట్రేట్ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని కోరింది. రాష్ర్టంలోని గిరిజనుల సంక్షేమానికి అందిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మెరుగైన రీతిలో అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం, ఆయారంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ మేరకు పలు ప్రతిపాదనలు చేసింది.
రాష్ర్ట విభజన జరిగినప్పటికీ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ట్రైకార్, ట్రిప్‌కో, ట్రిమ్‌కో, గిరిజన సహకార సంఘాలను విభజించకపోవడం వల్ల ఆయా పథకాలు, కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షెడ్యూ ల్ ఏరియాల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల వారి సమగ్ర ఆర్థికాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే కార్పొరేషన్లను విభజించి సీనియర్ అధికారులకు పూర్తి బాధ్యత అప్పగిస్తే వీటి నిర్వహణ సజావుగా సాగుతుంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో గిరి జనుల జనాభా 9.34 శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం) అని స్పష్టమైంది. అయితే, ఉ న్న ఒకేఒక అదనపు డెరైక్టర్ పోస్టు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. గిరిజన జనాభా దృష్ట్యా ఆయా పథకాలను సమర్థవంతంగా అమలు చే సేందుకు తెలంగాణకు అదనపు డెరైక్టర్ పోస్టును, ఇతర సిబ్బందిని మంజూరుచేయాలి.
నిర్మాణదశలో ఉన్న ఇరవై యువజన శిక్షణా కేంద్రాల్లో మౌలికసదుపాయాలు కల్పించడంతో పాటు జాతీయస్థాయిలో శిక్షణను అందించి వారికి మార్గదర్శనం చేయడం, ఉపాధిని కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందించాలి.
అత్యంత వెనుకబడిన చెంచు. తోటి. కోలామ్, కొండారెడ్డి గిరిజన తెగల కోసం ఆర్థిక సహాయ పథకాలకు అందజేస్తున్న 60 శాతం సబ్సిడీని 80 శాతానికి (గ్రూపులకు గరిష్టంగా రూ.లక్ష వరకు) పెంచాలి.
విద్యాహక్కు చట్టంలో భాగంగా గిరిజనుల పిల్లలకు విద్యనందించేందుకు చర్యలు తీసుకోవాలి. కనీస టీచర్, విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35, హైస్కూల్‌లో 1:40 ఉండేలా చూడాలి.
ప్రస్తుతం పెద్ద సంఖ్యలో టీచర్ల ఖాళీలు ఉండడంతో అనుకున్న ధ్యేయం నెరవేరడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గురుకులాల్లో కలుపుకుని దాదాపు 3,800 టీచర్‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మైదానప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లోనూ ప్రమాణాలు పాటించి, నాణ్యమైన విద్యనందించేందుకు టీచర్‌పోస్టులను మంజూరు చేయాలి.
తొమ్మిది జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలకు 1,500 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి. కాగా, ఇటీవల జరిగిన సంక్షేమరంగ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ వివిధ ప్రతిపాదనలు, ప్రభుత్వపరంగా వెంటనే తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ ఒక నివేదికను సమర్పించారు.
ఎస్సీ, ఎస్టీ కేసులను సత్వరం విచారించాలి
Published Fri, Sep 12 2014 2:03 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement