గిరిజన సంక్షేమ శాఖలో విద్యకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు.
- మూడో తరగతి నుంచి ఇంగ్లీష్‌లో విద్యాబోధన
- ఆశ్రమ స్కూళ్ళన్నీ రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్పు
- ఈ ఏడాది 30 ఆశ్రమ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనకు శ్రీకారం
- మూడో క్లాస్ నుంచి ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి
గిరిజన సంక్షేమ శాఖలో విద్యకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యా విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గిరిజన విద్యార్థులకు మూడో తరగతి నుంచి డేస్కాలర్ ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఇప్పటికే ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మారిపోయాయి. ఈ సంవత్సరం 30 ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రారంభించేందుకు నిర్ణయించారు.
మూడు నుంచి ఇంగ్లీష్‌లో విద్యా బోధన
ఈ సంవత్సరం మూడో తరగతి నుంచి విద్యార్థులకు ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు 30 ఆశ్రమ స్కూళ్లను శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించారు. ఈ స్కూళ్ళలో యువతీ యువకులైన క్వాలిఫైడ్ టీచర్లను నియమించారు. మంచి బోధన ఉంటే మాణిక్యాలుగా విద్యార్థులు తయారవుతారనే వాదన గిరిజన సంక్షేమ శాఖలో ఉంది. సుమారు 3500 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగనుంది.
రెసిడెన్సియల్ స్కూల్స్‌గా 179 హాస్టల్స్
గత సంవత్సరం వరకు సంక్షేమ హాస్టల్స్‌గా ఉన్న 179 హాస్టల్స్‌ను ఈ సంవత్సరం నుంచి 80 రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్చారు. గతంలో ఉన్న హాస్టళ్ళ స్థానే రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్చడంతో పిల్లలకు పెద్దగా ఇబ్బందులు ఏర్పడలేదు. మరీ తక్కువ విద్యార్థులు ఉన్న చోట్ల వేరే రెసిడెన్సియల్‌లోకి మెర్జ్ చేశారు.
అందరికీ ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్
మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టలర్స్, డేస్కాలర్‌లకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 9,10వ తరగతుల విద్యార్థులకు మాత్రమే ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందేవి. దీనిని 5వ తరగతి నుంచి అమలు చేయాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 5 నుంచి 8వ తరగతి వరకు మొత్తం లక్ష మంది విద్యార్థులకు రూ. 7 కోట్లు అవసమని వివరించింది. అలాగే మూడు నుంచి ఐదు వరకు కూడా పిల్లలను డేష్కార్స్‌గా పరిగణించి స్కాలర్‌షిప్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. వీరు 1.04 లక్షల మంది ఉన్నారని, రూ.14 కోట్లు స్కాలర్‌షిప్స్‌కు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపించారు. గత సంవత్సరం 9, 10 తరగతుల్లో చదువుతున్న 31000 మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కింద ప్రభుత్వం రూ.11.79 కోట్లు ఇచ్చింది.
విద్యాబోధనలో మార్పులు చేస్తున్నాం: డెరైక్టర్ పద్మ
విద్యాబోధనలో భారీ మార్పులు తీసుకు వస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం పద్మ తెలిపారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సంక్షేమ హాస్టల్స్‌ను రెసిడెన్సియల్ స్కూళ్ళుగా మార్చడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మూడో తరగతి నుంచి ఇంగ్లీష్‌లో విద్యాబోధన సక్సెస్ అవుతుందని, తాను విశాఖ జిల్లాలోని మంప గిరిజన గ్రామం వెళితే అక్కడ విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఇది స్పష్టమైందన్నారు.