
ఆరోపణలపై బాలికల సమక్షంలో విచారణ చేస్తున్న అధికారులు (ఫైల్)
సాక్షి, ఆసిఫాబాద్: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గత డిసెంబరు 24న కుమురం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం దస్తగిరి హైమద్‌ఖాన్‌ను లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై విధుల్లోంచి తప్పించారు. ఈ కేసు విషయమై డీఎస్పీ అధికారి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఐటీడీఏ డీడీ స్థాయి అధికారి విచారణ జరిపి నివేదికను పీవోకు సమర్పించినా ఇంత వరకు దానిని బహిర్గత పర్చలేదు. హైమద్‌ఖాన్‌ను బెల్లంపల్లి ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించడం.. కొద్దిరోజులకు మళ్లీ ఆయనకే హెచ్‌ఎంగా బాధ్యతలు అప్పగిం చడం చర్చనీయాంశంగా మారింది.
గుట్టుగా ఉత్తర్వులు!
ఇటువంటి ఆరోపణలు ఉన్న వారికి అదే పాఠశాలలో తిరిగి బాధ్యతలు అప్పగించరు. ఇవేమీ లెక్క చేయకుండా మళ్లీ వాంకిడిలో జాయిన్ అయ్యేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఐటీడీవో పీవో, జిల్లా కలెక్టర్‌కు తెలియకుండా ఈ ఉత్తర్వులివ్వడం గమనార్హం. ఘటన జరిగినప్పు డు పరీక్షలకు సన్నాహాలు చేసే సమయం కాబ ట్టి సిలబస్ పూర్తి చేయడం, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు స్పెషల్ ఆఫీసర్‌గా ఏసీఎంవోను నియమించారు. స్పెషల్ ఆఫీసర్ నుంచి బాధ్యతలు తప్పించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి హెచ్‌ఎంగా విధుల్లోకి చేరేందుకు ఉత్తర్వులివ్వడం వెనుక ఏదో గూడు పుఠాని ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని సంప్రదించగా.. దస్తగిరి హైమద్‌ఖాన్‌కే హెచ్‌ఎం బాధ్యతలు అప్పగించారని, వేసవి సెలవులు కాగానే విధుల్లోకి చేరుతారని, దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు.
ఉత్తర్వులు ఇచ్చాం
సాధారణంగా డిప్యూటేషన్ అకడమిక్ పూర్తికాగానే అయిపోతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేం తిరిగి వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జాయిన్ కావాలని ఉత్తర్వులు ఇచ్చాం. –కృష్ణానాయక్, డీటీడీవో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు ప్రస్తుతం బెల్లంపల్లి ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న దస్తగిరి హైమద్‌ఖాన్‌ను తిరిగి వాంకిడి ఆశ్రమ పాఠశాలలో పని చేసేందుకు మా నుంచి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.
–ఆర్‌వీ.కర్ణన్, పీవో, ఐటీడీఏ