గడప దాటని గిరిజన వర్సిటీ! | Tribal Varsity File Pending at HRD | Sakshi
Sakshi News home page

గడప దాటని గిరిజన వర్సిటీ!

Published Tue, Jan 1 2019 3:17 AM | Last Updated on Tue, Jan 1 2019 3:17 AM

Tribal Varsity File Pending at HRD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన యూనివర్సిటీకి చిక్కుముళ్లు వీడటంలేదు. స్థల కేటాయింపులతో పాటు నిధులు విడుదలైనప్పటికీ వర్సిటీ కార్యకలాపాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజన చట్టంలో రాష్ట్రానికి గిరిజన వర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. దీనికోసం భూసమీకరణ చేపట్టాలని కేంద్రం సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 ఎకరాలను గుర్తించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలో దాదాపు 200 ఎకరాలను గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరోవైపు జాకారం గ్రామం సమీపంలో ఉన్న వైటీసీ (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌)కోసం నిర్మించిన అత్యాధునిక భవనాన్ని కూడా వర్సిటీ కోసం కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ భవనంలో కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈమేరకు నిర్ణయించింది. భూముల అప్పగింతతో పాటు భవనాన్ని సైతం అప్పగించినా, అనుమతులు తదితర ప్రక్రియ కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. 

హెచ్‌ఆర్‌డీ వద్ద పెండింగ్‌... 
యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సంబంధిత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇందులో భాగంగా రెండుసార్లు హెచ్‌ఆర్‌డీ అధికారులు పర్యవేక్షణ సైతం చేపట్టినప్పటికీ అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. తాజాగా సోమవారం హెచ్‌ఆర్‌డీ అధికారులు వర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. 

పార్లమెంటులో బిల్లుతోనే... 
యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతితో పాటు వర్సిటీ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలోనే  వర్సిటీ బిల్లుకు ఆమోదం లభిస్తే 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభించ వచ్చని ఉన్నాతాధికారలు అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement