సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్’లో చిత్రాలను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి జశ్వంత్ సిన్హ్
హైదరాబాద్: జవహర్ నవోదయ పాఠశాలలకు దీటుగా ఏకలవ్య పాఠశాలలను తీర్చిదిద్దుతామని గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయమంత్రి జశ్వంత్ సిన్హ్ సుమన్ భాయ్ భభోర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈఎం ఆర్‌ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) తొలి ‘ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ప్రారం భమైన ఈ స్పోర్ట్స్ మీట్ 16 వరకు జరగనుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పాలన్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆలోచననే ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో పెట్టారని తెలిపారు. 2022లోగా 400 ఏకలవ్య మోడల్ స్కూళ్లు ప్రారంభించి, వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దతామన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకంగా నిలిచిన ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఏకలవ్యకు నిధులు పెంచాం..
ఈఎంఆర్‌ఎస్ టలకు 2014–15 బడ్జెట్‌తో పోలీస్తే.. 2018–19 బడ్జెట్‌లో నిధులు అధికంగా కేటాయించామని వివరించారు. వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, అందరూ పట్టుదలతో కృషి చేసి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గిరిజన యువతలో ఎంతో ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని, అందుకు క్రికెటర్ ధోనీ, బాక్సర్ మేరికోమ్‌లే నిదర్శనమని అన్నారు. 20 వేల జనాభాకు ఒక గురుకులం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ నినాదంతో దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ఈఎంఆర్‌ఎస్ విద్యార్థులు స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం నృత్యాలు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన కోయ, లంబాడీ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బిశ్వజిత్ దాస్, రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి డాక్టర్ బెన్హూర్ మహేశ్ దత్ ఎక్క, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోగ్తు, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డైరెక్టర్ రాజేంద్ర కుమార్, శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment