అభివాదం చేస్తున్న ఆదివాసీ సంఘాల నేతలు
ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని, దీనికోసం ఆదివాసీలందరూ ఏకతాటిపై ఉండాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆదిలాబాద్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి, వినతిపత్రాల సమర్పణ, 19న నాగోబా దర్బార్‌లో వినతిపత్రాలు ఇవ్వాలని, అలాగే, దర్బార్‌కు లంబాడీలు ఎవరూ రావద్దని.. 22న గిరిజన సంక్షేమ శాఖ కమిషన్‌కు, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ ఉంటుందని తెలిపారు.
23న గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతిపత్రం అందజేత, 24న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్, 27న మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర నిర్వహణ బోర్డు సభ్యులుగా లంబాడీలు కొనసాగరాదని పూజారులతో సమావేశం, అదే రోజు కుమురంభీం విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. 30, 31వ తేదీల్లో జిల్లాల వారీగా ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఒత్తిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 5 నుంచి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని సోయం బాపురావ్ వివరించారు.
ఈ నెల నుంచి జూన్ వరకు చేపట్టనున్న కార్యచరణను ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, పల్ల సత్యనారాయణ, దుర్వ సంజీవ్, ఉయికే సంజీవ్, గోడం గణేశ్, సిడాం వామన్ రావ్, కుడ్మేత భీంరావు, గేడం మనోహర్, ఆదివాసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment