
గుడిహత్నూర్(బోథ్): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించకుంటే ‘మావ నాటే–మావ రాజ్యం’ (మా ప్రాంతం–మా రాజ్యం) ఏర్పాటు చేసుకుంటామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాపురావుతోపాటు పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడారు. గత పాలకులు రాష్ట్రంలో ఉన్న లంబాడీలను రాజ్యాంగానికి విరుద్ధంగా ముసాయిదా లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నేడు అసలైన ఆదివాసీ బిడ్డలు వివక్షకు గురై వెనుకబాటును అనుభవిస్తున్నారన్నారు.
లంబాడీ ఉద్యోగులు ఆదివాసీ బిడ్డలను విద్య, రాజకీయ, ఉద్యోగ పరంగా వివక్షకు గురి చేస్తూ వారికి భవిష్యత్తు లేకుండా వ్యవహరిస్తున్నారని గర్జించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు శాంతియుత పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో నిర్వహించే సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు అనుమతి లభిస్తుందని అనుమతి లభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జల్కే పాండురంగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment