
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలోని బజార్హత్నూర్ మండలం డేడ్రా అటవీ ప్రాంతం చిరుతపులి మృతి చెందిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆదివాసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చిరుతను ఎవరు చంపారనే దానిపై ఆదివాసీలు, లంబాడాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఉన్న లంబాడీ వర్గానికి చెందిన నామ్‌దేవ్ పులిని చంపి ఆ కేసులో అమాయక గిరిజన రైతులను ఇరికించారని ఆదివాసీ నేతలు ఆరోపిస్తున్నారు. నామ్‌దేవ్ పులిని చంపి వస్తూ దారిలో ఉన్న రైతులకు గోర్లు ఇచ్చి.. రెండు కాళ్లు పోలీసులకు ఇచ్చి తమను కేసులో ఇరికించారని నిందితులు చెబుతున్నారు. దీంతో ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య వివాదం ముదురుతోంది.
మరోవైపు ఆదివాసీ నేతలు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లడంతో.. నిందితులు వారిని ఫోన్‌లో సంప్రదించి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నామ్‌దేవ్ పోలీసు ఇన్‌ఫార్మర్ కావడంతోనే తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే అటవీ అధికారులు తమను అదుపులోకి తీసుకున్నట్టు వారు తెలిపారు. కాగా, చిరుత మరణానికి అడవిలో అమర్చిన విద్యుత్ తీగలే కారణమని అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందుకు కారణమైన 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. విద్యుత్ తీగలు పంటల రక్షణ కోసం అమర్చారా లేదా వేట కోసమా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment