జాతి జాగృతి కోసం.. బంజారా భగవద్గీత : కేతావత్‌ సోమలాల | Banjara Bhagavad Gita Author Kethavath Somlal | Sakshi
Sakshi News home page

జాతి జాగృతి కోసం.. బంజారా భగవద్గీత : కేతావత్‌ సోమలాల

Published Thu, Jan 9 2025 2:52 PM | Last Updated on Thu, Jan 9 2025 3:17 PM

Banjara Bhagavad Gita Author Kethavath Somlal

రామంతాపూర్‌:  పురాణాల ప్రకారం, దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. దీన్ని భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహంగా పరిగణిస్తారు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. మనిషి ఎలా మసులు కోవాలి.. కష్టసుఖాల్లో ఎలా వ్యవహరించాలి తదితర విషయాలపై మానవాళిని సన్మార్గంలో నడిపే పవిత్ర గ్రంథం భగవద్గీత. 

భారతీయ సంస్కృతికి గోపురం వంటి గీతను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మానవ ప్రపంచానికి అందించారు. దాదాపు ప్రపంచంలోనే అన్ని భాషల్లోకి అనువదించబడినా బంజారాలకు మాత్రం చేరలేదు. దాంతో వారికి భగవద్గీత సారాన్ని అందించాలని అనుకున్నారు హబ్సిగూడవాసి కేతావత్‌ సోమ్‌లాల. తన జాతి జాగృతం కోసం మొక్కవోని సంకల్పంతో 16 నెలలు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారాభాషలోకి అనువదించారు. 

తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి అందజేశారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలోని ఆకుతోట బావి తండాకు చెందిన సోమ్‌లాల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించి వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. విద్యార్థి దశలోనే బంజారాలను చైతన్యపరుస్తూ 200లకుపైగా పాటలు రాశారు. తండాలు తిరుగుతూ ఈ పాటలు పాడి బంజారాలను ఉత్తేజపరిచారు.   విద్యార్థి దశలోనే బంజారా భాషలోకి అనువాదం చేసేందుకు ఎంతో శ్రమించారు. 

బంజారా భాషలో మల్లె మొగ్గ అనే పదాన్ని ఏమాంటారో తెలుసుకోవడం కోసం తిరగని తండా లేదు. పువ్వుడా అంటారని తెలుసుకొని ఆ పదాన్ని గీతలోకి చేర్చారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి 1988 ఆగస్టు నెలలో అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలలు కృషి చేస్తే పూర్తయింది. కానీ ముద్రణకు మాత్రం 25 ఏళ్లు నిరీక్షించాల్సి వచి్చంది. బంజారా భగవద్గీతను అప్పటి టీటీడీ ప్రెస్‌ అధికారి రవ్వ శ్రీహరి సహకారంతో తిరుమల బ్రహ్మోత్సవాల్లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు, జడ్జి రమణ ఆవిష్కరించారు.  

బంజారాల కోసం అనువదించిన భగవద్గీతతో పాటు ది హిస్టరీ ఆఫ్‌ బంజారా, బంజారా గీతమాల వంటి రచనలు చేసిన సోమ్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2024 సంవత్సరం ఏప్రిల్‌ నెలలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2001లో ఆల్‌ ఇండియా బంజారా సేవా సమితి ముంబై వారు సోమ్‌లాల్‌కు బంజారా జానపద బ్రహ్మ అనే అవార్డు అందించారు. మాజీ సీఎం కేసీఆర్‌ బంజారా సాహిత్యానికి సోమలాల్‌ చేస్తున్న సేవలను గుర్తించి బంగారు కంకణం తొడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనను అభినందించారు.  

పేద కుటుంబంలో జన్మించిన ఆయన జనగామలోని ప్రభుత్వ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న సమయంలో ఈ హాస్టల్‌ పక్కనే ఉన్న గీత మందిరం నుంచి ప్రతిరోజూ ఉదయం లౌడ్‌ స్పీకర్‌లో  వినిపించే గీతా శ్లోకాలను వింటూ స్ఫూర్తి పొందారు. వెనుకబడిన తన బంజారా సమాజానికి గీతా సారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement