సాక్షి, హైదరాబాద్: మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఆశలు గల్లంతయ్యాయి. ఈ ఉత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి జశ్వంత్‌సింగ్ బబోర్ ఇటీవల లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.2 కోట్లు ఇచ్చిందని, వచ్చేసారి ఈ నిధిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మాత్రం పేర్కొన్నారు.
రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం వల్లే..
సమ్మక్క–సారలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. గిరిజనులు, ఆదివాసీలతో పాటు వివిధ వర్గాలకు చెందిన కోటి మందికి పైగా భక్తులు జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు హాజరవుతున్న సందర్భంగా మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ అంశంపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సైతం మొదట్లో సానుకూలంగా స్పందించింది. జాతరకు రావాలన్న రాష్ట్ర ఆహ్వానాన్ని సైతం అంగీకరించిన కేంద్ర బృందం, ఉత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించింది. జాతర తీరును పరిశీలించి నిర్ణయాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కేంద్ర బృందం వచ్చే ముందు పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వీఐపీ తాకిడి ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర బృందం పర్యటనకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో జాతరకు హాజరయ్యే నిర్ణయాన్ని మంత్రుల బృందం విరమించుకుంది.
జాతీయ ఉత్సవమైతే...
మేడారం జాతరకు జాతీయ ఉత్సవ హోదా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ నిబంధనల్లో భాగంగా పది లక్షలకు పైగా గిరిజనులు హాజరయ్యే ఉత్సవానికి జాతీయ హోదా అర్హతలుంటాయి. కానీ సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏకంగా కోటి మందికి పైగా హాజరవుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడంతో చేజేతులా అవకాశం వదులుకున్నట్‌లైంది. ఈ ఉత్సవానికి జాతీయ హోదా దక్కితే నిధులు, నిర్వహణ అంతా కేంద్రం చూసుకోవడమే కాకుండా, జాతరకు మరింత ప్రచారం దక్కేదని గిరిజన మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment