ఉట్నూర్(ఖానాపూర్) : గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో వంటశాలల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కట్టెల పొయ్యిలు, గ్యాస్‌స్టౌవ్‌ల స్థానంలో స్టీమ్‌కుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంధనభారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణహిత పద్ధతిలో వంట చేసేందుకుగాను స్మార్ట్ కిచెన్ వైపు గిరిజన సంక్షేమ శాఖ దృష్టి సారించింది. ఈ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 40వేలకు పైగా గిరిజన విద్యార్థులు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతిగృహాల్లో 1,254 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూన్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. ఒక్కో ఆశ్రమ పాఠశాలలో 600కుపైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికి నిర్దేశిత మెనూ ప్రకారం రోజుకు మూడు పూటల భోజనం అందించేందుకు నిరంతరం దాదాపు 350 మంది నాల్గోతరగతి ఉద్యోగులు, 900మంది వరకు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆశ్రమ పాఠశాలలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఉండటం అక్కడ గ్యాస్ సరఫరాలో సమస్యల నేపథ్యంలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగ ఎక్కువగా వెలువడటం, సిబ్బంది అనారోగ్యం పాలవడంతో పాటు వంట రుచిలో తేడాలొస్తున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం 2016లో ప్రతి ఆశ్రమ పాఠశాలలో వంట తయారీ కోసం గ్యాస్ స్టౌవ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో రూ.30.60లక్షల వ్యయంతో 450 గ్యాస్ స్టౌవ్‌లను ఆశ్రమ పాఠశాలలకు అందించినా గ్యాస్ తిప్పలతో ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈ క్రమంలో వంట సమస్యలను అధిగమిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేందుకు స్టీమ్ కుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.
ఈడబ్ల్యూఐడీసీకి బాధ్యతలు...
ఆశ్రమపాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ పరికరాలు, వంట సామగ్రి కొనుగోలు చేసే బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఐడీసీ (ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కు అప్పగించింది. ఈ మేరకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకు గాను త్వరలో టెండర్లు పిలువడంతో పాటు వేసవి సెలవుల్లోగా ప్రతి ఆశ్రమ పాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ విధానం అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు వేగవంతం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment