Tribal welfare hostels
-
జ్వరంతో బూరుగూడలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని మృతి
-
డిగ్రీ విద్యార్థిని మృతి.. ఉద్రిక్తత.. హాస్టల్లో ఏం జరిగింది?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ మండలం బూరుగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో సంగీత అనే డిగ్రీ విద్యార్థిని జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్లో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, విద్యార్థి యువజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురు విద్యార్థినిలు జ్వరంతో మృతిచెందిన అధికారులు చర్యలు చేపట్టడం లేదని అధికారుల తీరుపై గిరిజనులు మండిపడుతున్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి... -
ఫుడ్ పాయిజన్‌తో 67మందికి అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి ఈ హాస్టల్లో సంబరాలు నిర్వహించారు. కేక్ కూడా కట్ చేశారు. అనంతరం విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. అయితే, ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు. కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
గురుకులాలకు కొత్త రూపు
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు విద్యార్థులకు అన్నివిధాలా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరంగా కనీస మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇన్నాళ్లుగా సవాలక్ష సమస్యలతో కునారిల్లిన వీటిని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు నూతన ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. మొత్తం 106 బీసీ గురుకుల విద్యాలయాలు ఉంటే అందులో భవనాలు లేక ఇప్పటికీ 20 గురుకుల స్కూళ్లను గత ప్రభుత్వం ప్రారంభించలేదు. 60 గురుకుల స్కూళ్లు ప్రైవేట్ భవనాల్లో నడుపుతున్నారు. ఈ భవనాలు విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా లేవు. అన్నింటిలో మొత్తం 27,212 మంది విద్యార్థినీ, విద్యార్థులు కనీస సౌకర్యాలు లేకుండా విద్యాభ్యాసం చేస్తున్నారు. బీసీ విద్యార్థుల దుస్థితిని గుర్తించిన ప్రభుత్వం అత్యవసరంగా మౌలిక వసతులు (బాత్రూములు, మంచినీటి పైపులు, సెప్టిక్ ట్యాంకులు, భవనంలో దెబ్బతిన్న నేలలకు మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటు, విద్యుత్ వైరింగ్, భవనాలకు పెయింట్లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, డార్మెట్రీలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలు, ల్యాబుల ఏర్పాటు) కల్పించేందుకు రూ.4 కోట్లు మంజూరు చేసింది. కాగా, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలో ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. 4 భవనాల నిర్మాణాలు పూర్తి ప్రస్తుతం నాలుగు గురుకుల భవనాల నిర్మాణం పూర్తి కావస్తోంది. గుండుమల (బాలురు), గుండిబండ (బాలికలు), గొనబావి (బాలికలు), ఉదయమాణిక్యం (బాలికలు)ల్లో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం రాష్ట్రంలో 26 బీసీ గురుకుల విద్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. బాలికలవి 16, బాలురవి 10. ఈ స్కూళ్లలో వసతుల కోసం రూ.52.63 కోట్లతో గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. ఒక్కో భవనానికి రూ. 60 కోట్లు ప్రస్తుతం 60 గురుకులాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. 52 స్కూళ్ల నిర్మాణానికి స్థలాలు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖను బీసీ గురుకుల సొసైటీ కోరింది. కొత్తగా ఒక్కో భవనానికి రూ.60 కోట్లతో మొత్తం 76 భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసింది. రూ.4,560 కోట్లు అవుతుందని అంచనా. నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. త్వరలోనే అన్ని సౌకర్యాలు త్వరలోనే బీసీ గురుకుల విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రైవేట్ భవనాల్లో ఉన్న స్కూళ్లలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. అయినా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణాలు, స్థల సేకరణ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – ఎ కృష్ణమోహన్, కార్యదర్శి, బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. గిరిజన విద్యార్థులకు సమకూరిన సదుపాయాలు సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరాయి. రెండు నెలల క్రితం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమైతే చర్యలు తప్పవని, రెండు నెలల్లో పూర్తి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసింది. గిరిజన హాస్టల్ విద్యార్థులకు 32,88,499 నోట్ పుస్తకాలు, 98,706 కార్పెట్స్, 8,315 బెడ్‌షీట్స్, 14,72,146 మీటర్ల యూనిఫామ్ క్లాత్, 90,391 ఉలెన్ దుప్పట్లు, 53,181 ట్రంకు పెట్టెలు, 53,181 ప్లేట్లతోపాటు గ్లాసులు, 4,560 బంక్ బెడ్స్, 2,114 డ్యూయల్ డెస్క్‌లు సమకూర్చారు. గురుకుల బాలికల హాస్టళ్లకు 375 పొయ్యిలు, 1,119 డీప్ ఫ్రిజ్‌లు అందించి నూరు శాతం హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. గురుకుల విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల బట్టలు ఇవ్వాల్సి ఉండటంతో.. 7.96 లక్షల మీటర్ల క్లాత్, 9.35 లక్షల నోట్ పుస్తకాలు అందించారు. 52 వేల కార్పెట్స్, 25,229 బెడ్ షీట్స్, 52 వేల కండువాలు, 25,949 ఉలెన్ దుప్పట్లు, 51,506 బ్లాక్ షూస్, రెండేసి జతల సాక్స్‌లు, 51,506 వైట్ షూస్, రెండేసి జతల సాక్స్‌లు అందించారు. యూనిఫామ్‌ను మెప్మా సభ్యులతో కుట్టించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టగా.. చాలాచోట్ల ఈ పని పూర్తి కాలేదు. 2019–20వ సంవత్సరానికి సంబంధించి యూనిఫామ్ క్లాత్‌ను అందజేసి, కుట్టు చార్జీలను సైతం విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చారు. -
62 మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, రాయచోటి(కడప) : రాయచోటిలోని ఏపీ గిరిజన సంక్షేమశాఖ వసతి గృహంలో 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడపకు తరలించారు. శనివారం ఉదయం హాస్టల్లో అల్పాహారంగా ఇడ్లీ ..చట్నీ.. మజ్జిగ ఇచ్చారు. చట్నీలో విపరీతమైన కారమున్నట్లు తింటున్నప్పుడే విద్యార్థులు గమనించారు. మజ్జిగలో బ్లీచింగ్ ఎక్కువ శాతం కలిపిన నీటిని వినియోగించారని తెలుస్తోంది. అల్పాహారం తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు. బాధిత విద్యార్థులను ఉదయం 10 గంటలకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితుల్లో తేడా రావడంతో వైద్యులు, అక్కడి వైద్య సిబ్బంది వేగవంతంగా చికిత్స అందించారు. కొంతమంది వెంటనే కుదుటపడ్డారు. కొందరు కోలుకుంటున్నారు. ఒకరిని కడప తరలించినట్లు తెలిసింది. రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు మహేశ్వరరాజు, భాస్కర్‌రెడ్డి, నిస్సార్‌అహ్మద్, ఖదీర్‌బాషా, రియాజ్ తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వ చీఫ్‌విప్ ఆరా వసతిగృహంలోని చిన్నారుల అస్వస్థతపై ప్రభుత్వ చీఫ్‌విప్ జి.శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం కారణంగా చిన్నారులు అనారోగ్యం పాల్వవ్వడం తీవ్రంగా పరిగణించాలన్నారు. వైద్యులు, వసతి గృహం అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందివ్వాలని ఆసుపత్రి వైద్యులు మహేశ్వరరాజుకు సూచించారు. అవసరమైతే తిరుపతి తరలించి చికిత్స చేయించాలని ఆదేశించారు. వసతిగృహం పరిస్థితులపై జిల్లా గిరిజన సంక్షేమాధికారి చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులుగా కనిపించని వార్డెన్... వసతి గృహంలో వార్డెన్ శ్రీనివాసులు వారం రోజులుగా రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. వచ్చినా ఏ మాత్రం పట్టించుకోరని, వంట మనుషులు ఇష్టమొచ్చిన రీతిలో తయారు చేసి వడ్డిస్తారని ఆరోపిస్తున్నారు. నీటిలో బ్లీచింగ్ ఎక్కువ కలవడంతోనే తాము అనారోగ్యం పాలు కావాల్సి వచ్చిందంటూ ఆవేదన చెందారు. వసతిగృహాన్ని పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్లు అక్కడి పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నీటి తొట్లలో బల్లులు పడ్డాయని పలుమార్లు ఫిర్యాదులు చేస్తే తప్ప స్పందించడలేదని తెలిసింది. విద్యార్థుల అస్వస్థత విషయం తెలిసిన వెంటనే రాయచోటి అర్బన్ సీఐ రాజు, ఎస్ఐ రఫిక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులరెడ్డిలు ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. -
వసతి గృహాల్లో నిఘా నేత్రం
రామాయంపేట(మెదక్): వంద మంది చేయలేని పనిని ఒక సీసీ కెమెరా చేస్తుందంటారు. రోజురోజుకు సీసీ కెమెరాల వినియోగం పెరుగుతోంది. తాజాగా జిల్లాలో సాంఘీక సంక్షేమశాఖ అధ్వర్యలో కొనసాగుతున్న అన్ని గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు బిగించారు. గిరిపుత్రులకు మంచి భోజనంతో పాటు హాజరు శాతాన్ని పెంచడం, అవినీతి, అక్రమాలను అరికట్టడానికిగాను ఈ సీసీ కెమెరాలను బిగించినట్లు సమాచారం. ఒక్కో హాస్టల్లో సుమారుగా రూ. 50 వేల ఖర్చుతో నాలుగు కెమరాలతో పాటు ఒక మానిటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఆరు ఎస్టీ హాస్టళ్లలో, మూడు ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కెమెరాలు బిగించిన తర్వాత హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో పాటు హాస్టళ్ల సంక్షేమాధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందుతుంది. కెమెరా కనుసన్నల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులుసైతం క్రమశిక్షణతో మెదులుతున్నారని జిల్లా పరిధిలోని ఒక హాస్టల్ సంక్షేమాధికారి తెలిపారు. హాస్టళ్లలోని ప్రధాన ద్వారం, సామగ్రి ఉంచే ప్రదేశం, భోజనం, ప్రార్థన చేసే ప్రాంతంలో, వీటిని ఏర్పాటు చేశారు. నాలుగు కెమెరాల నుంచి వచ్చే వీడియోలకు సంబంధించి సమాచారం ఒక గదిలో ఉంచిన మానిటర్(టీవీ సెట్టు)లో నిక్షిప్తమవుతుంది. దీంతో హాస్టళ్లకు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటివరకు కెమెరాలు బిగించిన గిరిజిన హాస్టళ్లు రామాయంపేట, చిన్నశంకరంపేట, మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, టేక్మాల్ (బాలికల హాస్టల్) ఆశ్రమ సంక్షేమ వసతి గృహం, మహమ్మదాబాద్( నర్సాపూర్) ఆశ్రమ వసతి గృహం, కౌడిపల్లి (ఆశ్రమ వసతి గృహం). -
ఆశ్రమాల్లో ‘స్మార్ట్ కిచెన్’
ఉట్నూర్(ఖానాపూర్) : గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో వంటశాలల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కట్టెల పొయ్యిలు, గ్యాస్స్టౌవ్ల స్థానంలో స్టీమ్కుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంధనభారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణహిత పద్ధతిలో వంట చేసేందుకుగాను స్మార్ట్ కిచెన్ వైపు గిరిజన సంక్షేమ శాఖ దృష్టి సారించింది. ఈ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40వేలకు పైగా గిరిజన విద్యార్థులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతిగృహాల్లో 1,254 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూన్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. ఒక్కో ఆశ్రమ పాఠశాలలో 600కుపైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికి నిర్దేశిత మెనూ ప్రకారం రోజుకు మూడు పూటల భోజనం అందించేందుకు నిరంతరం దాదాపు 350 మంది నాల్గోతరగతి ఉద్యోగులు, 900మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆశ్రమ పాఠశాలలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఉండటం అక్కడ గ్యాస్ సరఫరాలో సమస్యల నేపథ్యంలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగ ఎక్కువగా వెలువడటం, సిబ్బంది అనారోగ్యం పాలవడంతో పాటు వంట రుచిలో తేడాలొస్తున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం 2016లో ప్రతి ఆశ్రమ పాఠశాలలో వంట తయారీ కోసం గ్యాస్ స్టౌవ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో రూ.30.60లక్షల వ్యయంతో 450 గ్యాస్ స్టౌవ్‌లను ఆశ్రమ పాఠశాలలకు అందించినా గ్యాస్ తిప్పలతో ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈ క్రమంలో వంట సమస్యలను అధిగమిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేందుకు స్టీమ్ కుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈడబ్ల్యూఐడీసీకి బాధ్యతలు... ఆశ్రమపాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ పరికరాలు, వంట సామగ్రి కొనుగోలు చేసే బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఐడీసీ (ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కు అప్పగించింది. ఈ మేరకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకు గాను త్వరలో టెండర్లు పిలువడంతో పాటు వేసవి సెలవుల్లోగా ప్రతి ఆశ్రమ పాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ విధానం అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు వేగవంతం చేస్తోంది. -
గిరిజన హాస్టళ్లలో ‘సీసీ’ నిఘా
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థుల భద్రతతో పాటు నిఘా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలను బిగిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఏర్పాటు చేస్తుండగా, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో కూడా ఈ నెలాఖరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఎనిమిది హాస్టళ్లు ఉండగా నాలుగు ప్రీ మెట్రిక్, నాలుగు పోస్ట్‌మెట్రిక్ హాస్టలున్నాయి. వీటిలో దాదాపు 950కి పైగా మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే విద్యార్థులతో పాటు వార్డెన్, వర్కర్ల కదలికలు గమనించడానికి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. ఇటీవల జిల్లాలో ఎస్సీ హాస్టళ్లలో సన్న బియ్యం తరలింపు వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీ కెమెరాలే అధికారులకు ఆధా రాలయ్యాయి. ఈ నేపథ్యంలో బియ్యం, సరుకులు పక్కదారి పట్టించినా, లారీల్లోంచి బియ్యం బస్తాల ను లెక్క ప్రకారమే దింపుతున్నారా అనే విషయాలు సీసీ కెమెరాల్లో రికార్డయిన పుటేజీల ద్వారా తెలిసిపోనుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే కిచెన్, స్టోర్ రూం, గ్రౌండ్, హాస్టల్ ఎంట్రెన్స్ ఇలా దాదాపు ఒక్కో హాస్టల్లో 7–8 సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సీసీ కెమెరాలు చేరుకోగ, ఈ నెలాఖరులోగా పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు కూడా సీసీ కెమెరాలు రానున్నాయి. కంప్యూటర్లు, బయోమెట్రిక్ విధానం... విద్యార్థుల హాజరు శాతాన్ని రోజు వారీగా నమోదు చేసేందుకు ఈ గిరిజన హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్లో హాజరు శాతాన్ని నమోదు చేసి వార్డెన్లు అధికారుల కు పంపాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థుల రాకు న్నా వారి పేరిట రేషన్‌ను డ్రా చేసేందుకు వీలుపడదు. దీంతో అక్రమాలను అడ్డుకట్ట పడనుంది. అలాగే కంప్యూటర్లను కూడా ప్రతీ హాస్టల్‌కు సరఫరా కానున్నాయి. బయోమెట్రిక్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేయడంతో పాలు బిల్లులను తయా రు చేయడానికి ఉపయోగపడనున్నాయి. కంప్యూటర్లను కూడా రాష్ట్ర శాఖనే సరఫరా చేయనుంది. పారదర్శకత ఏర్పడుతుంది.. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలతో కంప్యూటర్లు, బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు కానున్నాయి. హాస్టళ్లకు భద్రతతో పాటు నిఘా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న పై నిర్ణయాల వల్ల హాస్టళ్లలో పారదర్శకత ఏర్పడుతుంది. – సంధ్యారాణి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి -
ఆగని మృత్యు కేళి
► మజ్జివలస హాస్టల్లో గిరిజన విద్యార్థి మృతి ► రెండు నెలల వ్యవధిలో ఏడుగురు మృత్యువాత ► మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన ► గిరిజన సంక్షేమ డీడీ కమల ► లిఖితపూర్వక హామీతో ఆందోళన విరమణ పాడేరు రూరల్: మన్యంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. మన్యం వసతి గృహాల్లో ఉండి చదువుకుం టున్న ఏడుగురు విద్యార్థులు రెండు నెలల వ్యవధిలో అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. విద్యార్థులు పిట్టల్లారాలిపోతున్నా ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారులు మరణాల అడ్డుకట్టకు సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా హుకుంపేట మండలం మారుమూల బూరుగుపుట్టు పంచాయతీ మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న కొర్రా శంకరరావు అనే విద్యార్థి మృతి చెందాడు. అదే పాఠశాలలో చదువుతున్న శంకరరావు సోదరుడు కొర్రా నవీన్‌కుమార్, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొర్రా శంకరరావు బుధవారం రాత్రి భోజనం తర్వాత అందరి విద్యార్థులతో హాస్టల్లో పడుకున్నాడు. తెల్లవారు జాము 4.30 గంటలకు ఉన్నట్టుండి కడుపునొప్పి, రక్తంతో కూడిన వాంతులు అవడం మొదలైంది. పక్కనే నిద్రపోతున్న విద్యార్థులు గమనించి హాస్టల్ క్వార్టర్స్‌లో ఉంటున్న సీఆర్టీలకు సమాచారం అందజేశారు. వారు ఉదయం ఏడు గంటలకు విద్యార్థిని ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి ఉంది. ఆస్పత్రిలో ఉండాల్సిన స్టాఫ్ నర్సుతో సహా మిగిలిన ఎవ్వరు లేరు. చేసేదేమీ లేక ఉప్పలో ఓ ప్రైవేటు వాహనంలో పా డేరు ఆస్పత్రికి తరలిస్తుండగా హుకుంపేట వచ్చేసరికే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాడేరు ప్రాం తీయ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి కుటుంబ సభ్యుల ఆందోళన తమ బిడ్డ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు ఎం.ఎం.శ్రీను, కె.సుందర్రావులు ఆస్పత్రికి చేరుకున్నారు. శంకరారవు కుటుంబాన్ని ఆదుకోవాలని, మృతిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల డిప్యూటీ వార్డెన్, హెచ్ఎం, ఏటీడబ్ల్యూఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. న్యాయం జరిగకపోతే అక్కడి నుంచి కదిలేది లేదబి బీష్మించుకుని కూర్చున్నారు. డీడీ హామీతో ఆందోళన విరమణ గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం.కమల ఆస్పత్రి మార్చిరీ వద్ద చేరుకుని విద్యార్థి కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులతో మాట్లాడారు. మృతిపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేటట్లు కృషి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి విద్యార్థి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు హుకుంపేట ఎస్ఐ రవికుమార్ తెలిపారు.