సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలతో పులకరిస్తున్న గిరిజన పల్లెలను మరోసారి ప్రభుత్వ యంత్రాంగం ఆత్మీయంగా పలకరించనుంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు, పథకాలు అందని అర్హులు ఎవరైనా మిగిలుంటే వారికి పథకాలు అందేలా చూస్తారు. ఇందుకోసం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘జన జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 15న విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అడిషినల్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
ఆ రెండు జిల్లాల్లోని 430 గిరిజన గ్రామాల్లో నాలుగు ప్రత్యేక వాహనాల(ప్రభుత్వ పథకాల ప్రచార వ్యాన్)తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), జిల్లాల స్థాయిలో స్థానిక ప్రజలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనేది ప్రత్యేకంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
వీటిపై ప్రత్యేక దృష్టి
ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించనున్నారు. గిరిజనుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇంకా అర్హత ఉన్న వాళ్లకు ఎవరికైనా రాకుంటే.. వారికి సంక్షేమ ఫలాలు అందించేలా తక్షణ చర్యలు చేపడతారు. గిరిజన జిల్లాల్లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్, ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థులను చేరి్పంచడం, స్కాలర్‌షిప్‌ల మంజూరు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల అమలు, అర్హులకు వాటిని దరి చేర్చడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.
‘జన జాతీయ గౌరవ్ దివస్’ను ఘనంగా జరుపుదాం
సీఎం జగన్‌కు కేంద్ర మంత్రి లేఖ
జన జాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నివాళి అర్పిస్తారని తెలిపారు.
అలాగే బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రం ఉలిహటు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశంలోని 75 ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ‘హమారా సంకల్ప్ వికసిత్ భారత్‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. మీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment