కుమ్రం భీం పురిటిగడ్డ.. ఇక పర్యాటక కేంద్రం
భీం 76వ వర్ధంతి సభలో మంత్రుల వెల్లడి
సాక్షి, ఆసిఫాబాద్: జల్, జంగిల్, జమీన్ కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కుమ్రం భీం పురిటిగడ్డను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందులాల్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న అన్నారు.గత ప్రభుత్వాలు తెలంగాణ పోరాటవీరులను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భీం జిల్లాలోని జోడేఘాట్‌లో గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం 76వ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తొలుత భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీం స్మృతివనం, మ్యూజియంను మంత్రులు ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వీరులను భవిష్యత్‌తరాలు గుర్తుంచుకునేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. భీమ్ వారసులను గుర్తించి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోనే అపారమైన అటవీసంపదను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని.. దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో పాలన పరుగులు పెడుతుందని, విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ సతీష్‌కుమార్ పాల్గొన్నారు. కాగా, కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాకపోవడంతో ఆదివాసీలు నిరుత్సాహానికి గురయ్యారు.