ఏటీడబ్ల్యూవోలు కరువు | ATWo postes in tribal welfare department | Sakshi
Sakshi News home page

ఏటీడబ్ల్యూవోలు కరువు

Jul 26 2016 11:52 AM | Updated on Sep 4 2017 6:24 AM

గిరిజన విద్య కుంటుపడుతోంది. గిరిజన పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించే ఏటీడబ్ల్యూవో (గిరిజన సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు) పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆశ్రమాలపై పర్యవేక్షణ కొరవడుతోంది.

పూర్తిస్థాయిలో ఉన్నది ఇద్దరే.. 
హెచ్‌డబ్ల్యూవోలకే ఇన్‌చార్జి బాధ్యతలు 
ఎటూ న్యాయం చేయలేకపోతున్న ఇన్‌చార్జీలు 
గిరిజన విద్యపై పర్యవేక్షణ కరువు
 
ఉట్నూర్ : గిరిజన విద్య కుంటుపడుతోంది. గిరిజన పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించే ఏటీడబ్ల్యూవో (గిరిజన సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు) పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆశ్రమాలపై పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో ఆయా ఆశ్రమాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏటీడబ్ల్యూవో ఖాళీల స్థానాల్లో ఆశ్రమాల్లో హెచ్‌డబ్ల్యూవోలు (వార్డెన్లు)గా విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవోలుగా బాధ్యతలు అప్పగించారు. వారు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌చార్జీలు వారివారి ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ విధులు నిర్వహించలేక.. ఏటీడబ్ల్యూవో పరిధిలోని ఆశ్రమాలను పర్యవేక్షించలేక విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 
 
123 ఆశ్రమాలు.. 39వేలకు పైగా విద్యార్థులు..
ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ అధీనంలో జిల్లా వ్యాప్తంగా 123 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి విద్యా సంవత్సరానికి దాదాపు 39 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యాలను ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా కల్పిస్తోంది. అయితే.. గిరిజన విద్యను నిరంతరం పర్యవేక్షించడానికి ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన ఉపసంచాలకుల కార్యాలయంతో పాటు జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, జైనూర్, కాగజ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ ప్రాంతాల్లో ఏటీడబ్ల్యూవో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. సహాయ సంచాలకులను నియమించి గిరిజన విద్య పటిష్టం కోసం ృషి చేస్తోంది. ఆశ్రమ పాఠశాలలను నిరంతరం ఏటీడబ్ల్యూవోలు పర్యవేక్షించడం.. గిరిజన విద్యాభిృద్ధిలో గిరిజన సంక్షేమ శాఖ అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు ఆయా పాఠశాలల్లో అమలు చేయించడం, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని పరిశీలించడం, ఉపాధ్యాయుల బోధన తీరును పర్యవేక్షించడం చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించాలి. ఒక విధంగా చెప్పాలంటే గిరిజన విద్యాభిృద్ధిలో వీరి పాత్ర కీలకం. ఇలాంటి విధులు నిర్వర్తించే ఏటీడబ్ల్యూవో పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన విద్య కుంటుపడుతోంది. 
 
ఎనిమిది మందికి ఆరుగురు ఇన్‌చార్జీలే..
జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఏటీడబ్ల్యూవో కార్యాలయాలు ఉన్నాయి. ఎనిమిది మంది పూర్తి స్థాయి ఏటీడబ్ల్యూవోలు విధులు నిర్వహించాల్సి ఉండగా.. ఇద్దరు మాత్రమే పూర్తిస్థాయి అధికారులు ఉన్నారు. ఆరుగురు ఇన్‌చార్జీలు కొనసాగుతున్నారు. వీరిలో ఐదుగురు ఆయా ఆశ్రమ పాఠశాలల్లో హెచ్‌డబ్ల్యూవోలు కాగా.. మరొకరు ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవోలుగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ వారు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు.
 
ప్రస్తుతం వీరు విధులు నిర్వర్తిస్తున్న ఆశ్రమాలతోపాటు ఆయా ఏటీడబ్ల్యూవో కార్యాలయాల పరిధిలోని ఆశ్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ.. కేవలం పై అధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాలకు హాజరు కావడం తప్ప నిరంతరం ఆశ్రమాలను పర్యవేక్షించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అదీకాక వీరు హెచ్‌డబ్ల్యూవోలుగా విధులు నిర్వర్తించే ఆశ్రమాల్లోనూ వందల సంక్య విద్యార్థులు ఉన్నారు. వారి పర్యవేక్షణకు వీరు పరిమితమవుతున్నారు. ఫలితంగా మిగతా ఆశ్రమాల్లోని విద్యార్థుల పట్ల పర్యవేక్షణ లేకుండాపోయింది. ఈ ప్రభావం భోజనం మెనూపైనా చూపుతోంది. దీనికితోడు ఆశ్రమాల్లో పారిశుధ్యం, శానిటేషన్ లోపిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు ఆశ్రమాలకు ఎగనామం పెడుతున్నా అడిగేవారు లేరని అంటున్నారు. ఇప్పటికైనా ఏటీడబ్ల్యూవోల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవోలు వీరే.. 
కేవలం కాగజ్‌నగర్, నిర్మల్ ప్రాంతాల్లోని ఏటీడబ్ల్యూవో కార్యాలయాలకు మాత్రమే పూర్తిస్థాయి ఏటీడబ్ల్యూవోలు ఉన్నారు. మిగిత ఆరు కార్యాలయాలకు ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవో అధికారులను పరిశీలిస్తే.. ఉట్నూర్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌డబ్ల్యూవో సత్యవతికి ఉట్నూర్ ఏటీడబ్ల్యూవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పటించారు. ఈమె తాను నిరంతరం హెచ్‌డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న ఆశ్రమంతోపాటు మొత్తం 25 ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంది. ఉట్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్‌డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న చంద్రమెహన్‌కు ఆదిలాబాద్ ఏటీడబ్ల్యూవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అదీకాక కేబీ ప్రాంగణంలోని వికాసం పాఠశాల హెచ్‌డబ్ల్యూవోగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఈయన హెచ్‌డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న ఉట్నూర్ ప్రాంతం నుంచి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ ఏటీడబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని 14 ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్‌డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న సౌజన్యకు బోథ్ ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవోగా బాధ్యతలు అప్పగించారు. ఈమె తాను విధులు నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలతోపాటు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 60 కిలోమిటర్లు ఉన్న బోథ్ ఏటీడబ్ల్యూవో కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది.
 
ఆ పరిధిలోని 14 ఆశ్రమాలను పర్యవేక్షించాలి. వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్‌డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న కనకదుర్గకు దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసిఫాబాద్ ఏటీడబ్ల్యూవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పటించారు. ఈమె తాను హెచ్‌డబ్ల్యూవోగా విధులు నిర్వహిస్తున్న ఆశ్రమంతోపాటు ఆసిఫాబాద్ కార్యాలయం పరిధిలోని 17 ఆశ్రమ పాఠశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. లక్షెట్టిపేట బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌డబ్ల్యూవో నీలిమకు మంచిర్యాల ఏటీడబ్ల్యూవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈమె తన ఆశ్రమంతోపాటు 26 కిలోమీటర్లు ఉన్న మంచిర్యాల ఏటీడబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని 16 ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ చేయాల్సి ఉంది. జైనూర్ బాలికల అశ్రమ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు భాస్కర్‌కు జైనూర్ ఏటీడబ్ల్యూవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దాదాపు 660 మంది విద్యార్థుల చదువులను పర్యవేక్షించే ప్రధానోపాధ్యాయుడికి ఏటీడబ్ల్యూవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఆశ్రమంలో విద్యార్థుల చదువులను పర్యవేక్షించే వారు కరువయ్యారు. తరచు జైనూర్ ఏటీడబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని 17 ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణకు వెళ్తుండడంతో ఆశ్రమంలో విద్య గాడి తప్పుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
పదోన్నతులు కల్పిస్తే మేలు..
గత విద్యా సంవత్సరం నవంబర్ నెలలో గిరిజన సంక్షేమ శాఖలో చేపట్టిన పదోన్నతులతో కూడిన బదిలీలతో మంచిర్యాల ఏటీడబ్ల్యూవో విజయలక్ష్మి గిరిజన సంక్షేమ శాఖ కమిషన్ కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా, బోథ్ ఏటీడబ్ల్యూవో చందన వరంగల్ డీటీడబ్ల్యూవోగా, ఆదిలాబాద్ ఏటీడబ్ల్యూవో సంధ్యారాణి మహబూబ్‌నగర్ డీటీడబ్ల్యూవోలుగా వెళ్లారు. ప్రభుత్వం డీపీసీ (డిపార్ట్‌మెంట్ ప్రమోషన్స్ కమిటీ)ని ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు పదోన్నతులు చేపడుతోంది. జిల్లాలో గిరిజన విద్య గాడి తప్పకుండా ఉండాలంటే డీపీసీ వెంటనే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న గ్రేడ్-1 హెచ్‌డబ్ల్యూవోలకు ఏటీడబ్ల్యూవోలుగా పదోన్నతులు కల్పించడం ద్వారా ఈ ఖాళీలు భర్తీ అవుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement