గవర్నర్ వద్దకు ‘గిరిజన’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలకు చెందిన గిరిజన సంక్షేమశాఖల పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ శాఖకు సంబంధించి రెండురాష్ట్రాల మధ్య ఆస్తులు, పోస్టుల విభజన ఇంకా కొలిక్కి రాకపోవడంతో తెలంగాణ అధికారులు శుక్రవారం గవర్నర్‌ను ఆశ్రయించారు. మాసబ్‌ట్యాంకులోని సంక్షేమభవన్‌లో ఒక రాష్ట్ర కార్యాలయానికి మరొకరు పోటాపోటీగా తాళాలు వేయడం, ఫర్నిచర్ ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి విదితమే.
తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తమకు కేటాయించిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఏపీ గిరిజనశాఖ ఇవ్వకుండా జాప్యం చేస్తోందనేది తెలంగాణ వాదన. ఈ విషయంలో గవర్నర్‌నూ ఏపీ గిరిజనశాఖ తప్పుదోవ పట్టిస్తోందంటున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ పదిలోని సంస్థలకు సంబంధించిన అన్ని పోస్టులు, ఆస్తులను తెలంగాణ గిరిజన శాఖకు అప్పగించేలా ఏపీ శాఖకు ఆదేశించాలని గవర్నర్‌కు తెలంగాణ గిరిజనసంక్షేమ శాఖ జేఏసీ విజ్ఞప్తిచేసింది.
ఈ మేరకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదునూ, సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో తెలంగాణ గిరిజనసంక్షేమ శాఖ జేఏసీ నాయకులు ఎం.ఏ.రషీద్, నవీన్ నికొలాస్, ఐ. రాజామూర్తి, నైతం లక్ష్మణ్, సాగర్, ఆర్. సత్యనారాయణ, ఉపేంద్రచారి తదితరులున్నారు.