శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : ఉపకార వేతనాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏసీబీ అధికారులు గిరిజన సంక్షేమ శాఖపై తాజాగా బుధవారం దృష్టి సారించారు. 2009-10 విద్యా సంవత్సరంలోనే ఈ స్కాంకు బీజం పడిందని ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు. అప్పటి నుంచి గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఎస్‌బీఐ ఖాతా నంబరు 11152305021లో జరిగిన లావాదేవీలన్నింటిని పరిశీలించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ ఖాతా నుంచి జారీ అరుున చెక్కుల వ్యవహారంలో జరిపిన పరిశీలనలో 2015 అక్టోబరులో ఓ చెక్కు రూ.11.5లక్షలు పాలకొండ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాల ప్రతినిధి పేరుతో ఉంది.
పాలకొండ సమీపంలో ప్రమాదానికి గురైన కారులో లభించిన రూ.24 లక్షల చెక్కు అంపోలు అజయ్‌కుమార్ పేరిట 2015 డిసెంబర్ నెలలో జారీ అయినట్టు గుర్తించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆ ఏడాది డైట్ బిల్లులు జూన్ నుంచి ఫిబ్రవరి వరకు మంజూరు కాలేదు. మార్చిలో ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయడంలో ఖాతా నంబరు 11152305021 కు నిధులు జమయ్యాయి. డైట్ బిల్లులు లేని సమయంలో ఆ ఖాతాకు రూ.లక్షల మొత్తం ఎలా వచ్చింది? ఆ అకౌంట్ పేరిట చెక్కులు ఎలా ఇచ్చారన్న సందేహాలు నెలకొన్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో లాగాన్ కావాల్సిన పాస్ వర్డ్ ప్రైవేటు కళాశాలల నిర్వాహకులకు చెప్పిందెవరన్న ప్రశ్నలు ముసురుకుంటున్నారుు. ఇందువల్లే లక్షల అక్రమాలకు తెర లేచిందని ఆ శాఖ అధికారులే గుసగుసలాడుతున్నారు.
బీసీ సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పని చేసిన రవిచంద్రను కలెక్టర్ ఇటీవల ప్రభుత్వానికి సరండర్ చేశారు. ఆ శాఖ పర్యవేక్షణ బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ధనుంజయరావుకు అప్పగించారు. ఆ శాఖ నిర్వహణను పర్యవేక్షించాల్సిన ద్వితీయ క్యాడర్ అధికారులు పనితీరుపైనా అనుమానాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే ఈ శాఖకు చెందిన కంప్యూటర్లను ఇళ్ల వద్దే ఉంచుకుని కొందరు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అనుమానాలున్నారుు. ఇవన్నీ కలసి ఉపకార వేతనాలు పక్కదారి పట్టాయని విమర్శలొస్తున్నారుు. ఈ క్రమంలో ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే!
బీసీ సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో జూనియర్ సహాయకునిగా పని చేస్తున్న బి.బాలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయాల్సిందిగా అప్పటి బీసీ సంక్షేమశాఖ అధికారి రవిచంద్రను కలెక్టర్ గతంలో ఆదేశించారు. ఆయన ఆదేశాలను ధిక్కరించినందుకు ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖాధికారిగా ఉన్న రవిచంద్రను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్ ఇన్‌చార్జి బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ధనుంజయరావుకు అప్పగించారు. దీనికి తోడు సంక్షేమశాఖలను కుదిపేస్తున్న స్కాలర్‌షిప్పుల కుంభకోణంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న బాలరాజును సస్పెండ్ చేశారు.
ఉపకారం స్కాంలో కొత్త కోణం?
Published Wed, Apr 20 2016 11:22 PM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement
Advertisement