జిల్లాలో విద్యార్థుల ఉపకార వేతనాల్లో అక్రమాలకు సూత్రధారిగా అనుమానిస్తున్న అజయ్‌కుమార్ ఎవరు?
స్కాలర్‌షిప్పుల వ్యవహారంలో సూత్రధారి
ఆయన కారులోనే దొరికిన రూ. 24 లక్షల చెక్కు
బీసీ వెల్ఫేర్ పాస్‌వర్డ్ ట్యాంపరింగ్‌పై అనుమానాలు
గిరిజన హాస్టళ్లలో ఉన్నట్టు చూపిస్తూ కొల్లగొట్టిన వైనం
జిల్లాలో విద్యార్థుల ఉపకార వేతనాల్లో అక్రమాలకు సూత్రధారిగా అనుమానిస్తున్న అజయ్‌కుమార్ ఎవరు? ఆయనకు గిరిజన సంక్షేమ శాఖలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన గిరిజన సంక్షేమ శాఖ అధికారి సదరు అజయ్‌కుమార్‌కు రూ.24 లక్షల చెక్కు ఎందుకిచ్చారు? ఆ చెక్కుతో ఉన్న బ్యాంకు ఖాతాలోకి బీసీ సంక్షేమ శాఖ నిధులు ఎలా వెళ్లాయి? ఈ వ్యహారంలో సూత్రధారులెవరు.. ఇదీ ప్రస్తుతం జిల్లా అధికారుల్లో మెదులుతున్న ప్రశ్న.
శ్రీకాకుళం : జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో చదువుతున్న విద్యార్థులు ఎస్టీ వసతి గృహల్లో ఉంటున్నట్టు చూపిస్తూ రూ.కోట్లు కొట్టేసిన వ్యవహారం బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. వసతి గృహంలో లేని విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనంగా ఏడాదికి రూ.3,500లు చెల్లిస్తోంది. అయితే ఈ విద్యార్థులను వసతి గృహల్లో ఉన్నట్టు చూపించి ఒక్కొక్కరికి పేరుతో రూ.10,500లు వరకు బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖ అధికారుల బ్యాంకు ఖాతాలకు బదలాయించారు.
ఈ వ్యవహరంలో అజయ్‌కుమార్ అనే వ్యక్తి కీలక పాత్రపోషించడంతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి రూ.24 లక్షలు ఆయన పేరుతో చెక్కు అందజేశాడు. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంక్షేమాధికారిగా మెళియాపుట్టిలో పనిచేస్తున్న ఆ అధికారి సీతంపేటలో గత నెల 20న చెక్కును అజయ్ కుమార్‌కు ఇచ్చాడు. సీతంపేట నుంచి బయలుదేరిన అజయ్‌కుమార్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కారులో ఉన్న చెక్కును పాలకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అన్న అంశంపై నిగ్గు తేల్చాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎస్పీని ఆదేశించారు.
విచారణ మొదలు
సీతంపేటలో సోమవారం మకాం వేసిన కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు సిద్ధమయ్యారు. 2009-10 నుంచి 2015-16 విద్యా సంవత్సరాలకు గాను విద్యార్థుల పేరుతో బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించిన నిధులు, అందులో జరిగిన అక్రమాలు, 2013-14, 2014-15లో పాస్‌వర్టు ట్యాంపరింగ్ వ్యవహారాలపై శాఖల వారీగా విచారణ మొదలైయింది.
గత ఏడాది డిసెంబర్‌లో గిరిజన సంక్షేమ శాఖ శ్రీకాకుళం వసతి గృహం వార్డెన్ ఝాన్సీరాణి అకౌంటుకు రూ.32.78 లక్షలు జమా అయితే, ఈనెల 12 వరకు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయకుండా నిల్వ ఉంచడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించిన కలెక్టర్.. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణను విచారణాధికారిగా నియమించారు.