తప్పతాగి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇంటిపై దాడి
రెండు కార్లు ధ్వంసం
చంపుతామంటూ బెదిరింపు
కార్వేటినగరం: చిత్తూరు జిల్లా పెనుమూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కామసాని విజయకుమార్‌రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి ఆవరణలోని రెండు కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్‌రెడ్డిని చంపుతామని బెదిరించారు. విజయకుమార్‌రెడ్డి పెనుమూరు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోతుండగా పెనుమూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు పి.అనంత్‌రెడ్డి, పి.హేమాద్రినాయుడు కుమారుడు పి.ప్రదీప్, కె.బాబు కుమారుడు కె.రాజేష్ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.
వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలున్న కారు నంబరు ప్లేట్లను పెరికి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పెనుమూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి కమలాకరరెడ్డి కారు నంబర్ ప్లేటు తీసి పగులగొట్టారు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న విజయకుమార్‌రెడ్డికి ఫోన్‌చేసి బయటకు రమ్మని పిలిచారు. నిద్రలో ఉన్న విజయకుమార్‌రెడ్డి భార్యాపిల్లలతో బయటకు రాగా చంపుతామంటూ బెదిరించారు. భయంతో విజయకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన సోమవారం ఉదయం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమూరు ఎస్‌ఐ లోకేష్ సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు.
నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి
అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కార్లు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారు సోమవారం విజయకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన నారాయణస్వామి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment