
గిరిజన ‘డ్రాపవుట్స్’ నివారణ అంతంతే!
బడికి దూరమైన, బడుల్లోనే చేరని గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్చాలన్న సర్కారు ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడం లేదు
♦ పూర్తిస్థాయిలో ఫలించని సర్కారు ప్రయత్నాలు
♦ మొత్తం 14,286 మంది చిన్నారుల్లో స్కూళ్లలో చేరింది 8,126 మందే
సాక్షి, హైదరాబాద్: బడికి దూరమైన, బడుల్లోనే చేరని గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్చాలన్న సర్కారు ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. రాష్ట్రస్థాయి నుంచి ఉన్నతాధికారులు డ్రాపవుట్స్ పిల్లలను స్కూళ్లలో చేర్పిం చేందుకు కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తున్నా వారిని బడుల్లో చేర్చే ప్రయత్నాలు పూర్తిగా సఫలం కావడం లేదు. జిల్లాస్థాయిల్లోని అధికారులు, ఇతర శాఖల సహకారంతో ఈ పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేకశ్రద్ధ, చొరవ తీసుకుంటే తప్ప ఈ పిల్లలంతా బడుల్లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం 12,100 గిరిజన ఆవాసాల్లో 14,286 మంది చిన్నారులు స్కూల్ డ్రాపవుట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
వారిని స్కూళ్లలో చేర్పించడంలో మాత్రం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ అధికారులు విజయం సాధిం చలేకపోతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,126 మంది చిన్నారులను అధికారులు సూళ్లలో చేర్చగా మరో 6,160 మందిని బడుల్లో చేర్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలవారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,495 మంది డ్రాపవుట్ల చిన్నారులకుగాను 2,222 మంది పిల్లలను స్కూళ్లలో చేర్చారు.
రంగారెడ్డి జిల్లాలో 2,345 పిల్లలకుగాను కేవలం 262 మందిని స్కూళ్లలో చేర్చగా, 2,083 పిల్లలను ఇంకా చేర్పించాల్సి ఉంది. హైదరాబాద్‌లో 357 మందికిగాను కేవలం 33 మందిని చేర్పించగా, 324 మందిని ఇంకా చేర్పించలేదు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వచ్చే శని వారం నాటికి మిగిలిన 6,160 పిల్లలను స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.